ఈ అరాచకాలు.. కనీవినీ ఎరుగం!
ABN, Publish Date - May 14 , 2024 | 03:24 AM
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.
ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు
న్యూఢిల్లీ, మే 13 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి అరాచకాలను ఇంతకు ముందు ఎన్నిడూ చూడలేదన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో వైసీపీ కార్యకర్తలు ఇష్టారీతిన వ్యవహారించి తమ వాళ్లపై దాడులు చేశారని తెలిపారు. పోలింగ్ వేళ హింస జరిగిందంటూ కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.
టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఢిల్లీలో కమిషన్‌కు దీనిని అందజేశారు. సోమవారం రాష్ట్రంలో 121 చోట్ల వైసీపీ పలు రకాల అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందంటూ వాటి వివరాలను ఈసీ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు.
ఇవీ అక్రమాలు..
పల్నాడు జిల్లాలో పోలింగ్ కేంద్రాల ముందు పోలీసుల సమక్షంలోనే వైసీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ నేత హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహం శివారులో లభ్యమైంది.
నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలిపై పోలీసుల సమక్షంలోనే దాడిచేసి ఆయన 3 వాహనాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
సున్నిత ప్రాంతంగా ఈసీ గుర్తించిన పుంగనూరులో టీడీపీ పోలింగ్ ఏజెంట్లను ఉదయమే కిడ్నాప్ చేశారు.
తాడిపత్రిలో సిటింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి ప్రతి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ ఆమదాలవలస నియోజకవర్గంలోని రెండు బూత్‌లు(పీఎస్ నెం.158, 159) కబ్జా చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన అనుచరులతో కలిసి క్యూలో ఉన్న ఓటర్లపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదు.
పోలింగ్‌లో వైసీపీ హింస వల్ల పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. పోలింగ్ సంఘటనలపై ఆయన ‘ఎక్స్’లో వరుస పోస్టులు పెట్టారు.
వైసీపీ అరాచకాలకు పాల్పడింది: టీడీపీ
అమరావతి, న్యూఢిల్లీ, మే 13(ఆంధ్రజ్యోతి): పోలింగ్ సందర్భంగా సోమవారం రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడింది. పుంగనూరు, మాచర్ల, రైల్వే కోడూరు, పుట్టపర్తి, నరసరావుపేట, విజయవాడ, పాయకరావుపేట, ఆముదాలవలస, దర్శి, పత్తికొండ, శ్రీకాకుళం, యర్రగొండపాలెం, తెనాలి, నరసన్నపేట తదితర నియోజకవర్గాల్లో వైసీపీ అరాచకాలపై తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు టీడీపీ మాజీ మంత్రి దేవినేని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వేర్వేరు లేఖలు రాశారు. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీలో మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఎనిమిది ఫిర్యాదులు చేశారు
Updated Date - May 14 , 2024 | 03:24 AM