TDP Grievance Cell : భూ సమస్యలపై ఫిర్యాదుల వెల్లువ
ABN, Publish Date - Dec 04 , 2024 | 05:50 AM
భూ ఆక్రమణలు, తప్పుడు రిజిస్ట్రేషన్లపై టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): భూ ఆక్రమణలు, తప్పుడు రిజిస్ట్రేషన్లపై టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. బాపట్ల జిల్లా వెల్లటూరులో తన భూమిని అక్రమించి, తనపైనే దాడికి దిగుతున్నారని పేరయ్య అనే వ్యక్తి వాపోయారు. నంద్యాల జిల్లా సిద్ధాపురంలో తన భూమిని రిటైర్డ్ ఎమ్మార్వో దొంగ సంతకాలతో రాంబాబు అనే వ్యక్తి ఆక్రమించాడని బాధితుడు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా చోడవరంలో తన పుట్టింటి వారిచ్చిన రిజిస్టర్డ్ భూమిని అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారని వేణుకుమారి అనే మహిళ వాపోయారు. తన భూమిని మరొకరికి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కేసరపల్లికి చెందిన లక్ష్మిప్రసాద్ కోరారు. పల్నాడు జిల్లా కనుమలచెరువులో తమ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి, ఇల్లు కట్టుకోకుండా అడ్డుపడుతున్నారని వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.
Updated Date - Dec 04 , 2024 | 05:50 AM