Bonda Uma: 83 రోజుల తర్వాత ఎవరూ కనిపించరు.. వైసీపీపై బోండా ఉమా విమర్శలు
ABN, Publish Date - Jan 19 , 2024 | 01:18 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, వైసీపీపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి, సజ్జల ఆదేశించారని తప్పులు చేసే అధికారులకు ఐఏఎస్ అధికారి గిరీశాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
అమరావతి, జనవరి 19: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, వైసీపీపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి, సజ్జల ఆదేశించారని తప్పులు చేసే అధికారులకు ఐఏఎస్ అధికారి గిరీశాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఎన్నికల అనంతరం జగన్ రెడ్డి దేశం విడిచి పోతారని.. అతన్ని నమ్ముకొని తప్పులు చేసే అధికారులు ఎక్కడికి పోతారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పాలన ఉండేది కేవలం 83 రోజులే అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆదుకుంటాం.... రక్షిస్తామన్న ఏ నాయకుడు కనిపించడనే వాస్తవం అధికారులు గ్రహిస్తే మంచిదని ఆయన హితవుపలికారు.
తిరుపతి ఉపఎన్నికలో ఆర్వోగా నాడు చేసిన తప్పులకు, నేడు కలెక్టర్‌గా ఉన్న గిరీశా సస్పెండ్ అయ్యారన్నారు. అతనితో పాటు మంత్రిపెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను కూడా ఎన్నికల సంఘం శిక్షించాలని డిమాండ్ చేశారు. మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వెంటనే విచారణ చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామన్నారు. గిరీశాను సస్పెండ్ చేసినట్టే ప్రతాపరెడ్డి, రిష్వంత్ రెడ్డి, హరినారాయణ, పరమేశ్వర్ రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు.
ఎవరి ఆదేశాలతో దొంగ ఓట్లు సృష్టిస్తున్నారో, అర్హుల ఓట్లు తొలగిస్తున్నారో, ఇష్టానుసారం ఫామ్-7లు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారో అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు తప్పులు చేస్తున్న అధికారులపై ఫిర్యాదు చేస్తూనే ఉంటామన్నారు. సీఐలు, డీఎస్పీలు, ఆర్డీవోలు, ఎస్పీలు, కలెక్టర్లుగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని టీడీపీ నేత హెచ్చరించారు.
ఫ్రస్ట్రేషన్‌లో కొడాలి నాని...
కొడాలి నానీ వేస్ట్ ఫెలో అని.. అహంకారపు పొరలు కమ్మి టీడీపీ సభకు వచ్చిన జనం నానీకి కనిపించడం లేదని మండిపడ్డారు. రా.. కదలిరా సభకు వచ్చిన లక్షమందికి పైగా జనాన్ని చూసి కొడాలినానీ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారన్నారు. 83 రోజుల తర్వాత జగన్ రెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి సహా ఎవరూ కనిపించరని బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 19 , 2024 | 01:22 PM