జగన్ అమెరికా వెళ్తే ఇక తిరిగి రానట్టే..: బుద్దా
ABN, Publish Date - Nov 25 , 2024 | 05:24 AM
అదానీ నుంచి రూ.1,750 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో.. జగన్ విచారణకు వెళ్తే ఇక జీవితాంతం ఏపీకి తిరిగి రాలేడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు.
విజయవాడ(వన్‌టౌన్), నవంబరు 24(ఆంధ్రజ్యోతి): అదానీ నుంచి రూ.1,750 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో.. జగన్ విచారణకు వెళ్తే ఇక జీవితాంతం ఏపీకి తిరిగి రాలేడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. ఆలిండియా పిరికిపందల సంఘానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ అధ్యక్ష, కార్యదర్శులని ఎద్దేవా చేశారు. అధికార మదంతో నాని, వంశీ నోటికొచ్చినట్లు వాగారని, నైతిక అర్హత లేని వెదవలు కూడా చంద్రబాబును విమర్శిస్తున్నారని, అలాంటి వాళ్లని శిక్షించాలని ప్రజలే డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. నారా భువనేశ్వరిని కించపరిచిన వారికి బుద్ధి చెప్పాలని కోరారు. కొడాలి నాని, వంశీ వంటి వెదవలను చూసి పోసాని కూడా అడ్డగోలుగా వాగాడన్నారు. పోసాని రాజకీయాలు వదిలేశానంటే మాత్రం.. చేసిన తప్పులుపోతాయా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా మాట్లాడిన వారందరూ జైలుకు వెళ్లాల్సిందేనని, శిక్ష అనుభవించాల్సిందేనని బుద్దా వ్యాఖ్యానించారు. భారతీరెడ్డి గురించి తామెప్పుడూ మాట్లాడలేదన్నారు. వంశీ, పోసాని, కొడాలి నాని, దేవినేని అవినాశ్ క్షమాపణలకు అర్హులు కారన్నారు. వాళ్లలాగా తాము పదవులకు, డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తులం కాదన్నారు. వెలంపల్లి చరిత్ర ఏమిటో విజయవాడ ప్రజలకు తెలుసని, మస్కా కొట్టినా, మాయమాటలు చెప్పినా వదిలేది లేదన్నారు. టీడీపీ కార్యకర్తలను ఇప్పుడు టచ్ చేస్తే చేయి తీసేస్తారంటూ హెచ్చరించారు. ఇలాంటి వెదవలకు శిక్షలు పడితేనే ఇతరులకు గుణపాఠం అవుతుందని బుద్దా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Updated Date - Nov 25 , 2024 | 05:25 AM