అన్నింటా జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం
ABN, Publish Date - Nov 19 , 2024 | 04:10 AM
జగన్ హయాంలో అన్నింటా నిర్లక్ష్యం తాండవమాడిందని, దీంతో ఆయా వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయని పలువురు మంత్రులు నిప్పులు చెరిగారు.
తాగునీటి నుంచి హౌసింగ్ వరకు అన్ని వ్యవస్థలనూ భ్రష్టుపట్టించారు
నిప్పులు చెరిగిన పలువురు మంత్రులు
అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో అన్నింటా నిర్లక్ష్యం తాండవమాడిందని, దీంతో ఆయా వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయని పలువురు మంత్రులు నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఒక్కొక్క వ్యవస్థను గాడిలో పెడుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. సుమారు 2 గంటల పాటు ప్రశ్నోత్తరాలు నడిచాయి.
వైసీపీ రాబందుల కోసం!
గత జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 650 గ్రామాల్లో రీసర్వే చేపట్టిందని, ఆయా గ్రామాల్లో రీసర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే మళ్లీ సర్వే చేపడతామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ‘‘ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలో కూడా సవరణలు తెచ్చాం. 2019 నాటికి రాష్ట్రంలో 36.37 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి పంపిణీ జరిగింది. గత ప్రభుత్వం 20 ఏళ్ల పూర్తయిన అసైన్డ్ భూములు, పదేళ్లు పూర్తయిన ఇంటి పట్టాలను రెగ్యులరైజ్ చేసేందుకు చట్టం తీసుకొచ్చింది. అయితే, ఆ చట్టాన్ని వైసీపీ రాబందులు ఉపయోగించుకున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రతి ఒక్కటీ పరిశీలించి చర్యలు తీసుకుంటాం’’ అని వివరించారు.
హౌసింగ్‌పై విచారణ
2014-19 మధ్య కాలంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పట్టణ, పీఎంఏవై గ్రామీణ పథకాల కింద 2,90,260 ఇళ్లను కేంద్రం సాయంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 5,63,179 ఇళ్లను ఎన్టీఆర్ గ్రామీణ ఇళ్ల కార్యక్రమం కింద నిర్మించారని చెప్పారు. పీఎంఏవై పట్టణ, పీఎంఏవై గ్రామీణ పథకాల కింద ఎలాంటి బిల్లులు పెండింగులో లేవని తెలిపారు. అయితే, ఎన్టీఆర్ గ్రామీణ ఇళ్ల పథకం కింద 2,80,589 మంది లబ్ధిదారులకు రూ.919.29 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. బిల్లులు పెండింగ్‌లో ఉన్న వివిధ దశల్లోని గృహ నిర్మాణాలను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయని చెప్పారు. భూసేకరణ రెవెన్యూ శాఖ ద్వారా చేపట్టడం వల్ల హౌసింగ్ ద్వారా విచారణ చేపట్టడం వీలుకాదని, ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని అన్నారు. మండపేట నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే జోగేశ్వరరావు ప్రస్తావించారు.
చదును పేరుతో చెక్కేశారు!
ఎమ్మెల్యే పీజీవీఆర్‌నాయుడు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరుతో భూములను సేకరించిందని, ఆ పార్టీ నేతలు అప్పట్లో వాటిని చదును చేసి సొమ్ము చేసుకున్నారని, ఆ అక్రమాలు వెలికి తీయాలని సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం అండమాన్ జైలు మాదిరిగా సెంటు భూమి కేటాయించిందని, ఇప్పుడు ఆ స్థలాలను విక్రయించుకుంటున్నారని, ఎవరూ అక్కడ ఇళ్లు నిర్మించడం లేదని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తెలిపారు.
ముఖారవిందం ముద్రించారు
సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. గత ముఖ్యమంత్రి జగన్ తన ముఖారవిందాన్ని పట్టా కాగితాలపై ముద్రించి ఇచ్చారని, ఆ పట్టాలు ఎలా చెల్లుతాయని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో జగనన్న కాలనీల్లో విక్రయాలు జరుగుతున్నాయని, పట్టణాలకు 30 కిలోమీటర్ల దూరంలో ఈ స్థలాలు ఇవ్వడంతో అక్కడ ఇళ్లు నిర్మించుకోకుండా ఇతరులకు విక్రయించుకుంటున్నారని తెలిపారు.
ఆన్‌కాల్ డ్యూటీపై సమీక్షిస్తాం
ఆర్‌టీసీలో డ్రైవర్లు కొరత ఉందని, ఆన్ కాల్ డ్యూటీ విధానం ద్వారా అనుభవం లేని డ్రైవర్లు బస్సులు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు అన్నారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సమాధానమిస్తూ.. ఆన్‌కాల్ డ్యూటీ విషయంలో ఆర్థికశాఖకు ఫైల్ వెళ్లిందన్నారు. ఆర్టీసీ సమస్యపై గుడివాడ ఎమ్మెల్యే రాము మాట్లాడారు. కాగా, నెల్లిమర్ల నియోజకవర్గంలో మత్స్యకారులు సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే లోకం మాధవి ప్రస్తావించారు. వారికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మత్స్యకారులకు అందించే డీజిల్ సబ్సిడీ లీటర్‌కు రూ.17కు పెంచాలని కోరారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మత్స్య పరిశ్రమల శాఖ పీఎంఎంఎ్‌సవై నాన్ బెనిఫిషరీ పథకం కింద రాష్ట్రానికి 4,484 ట్రాన్స్ పాండర్లను కేటాయించిందని, ఇన్‌స్టాలేషన్ కొనసాగుతోందన్నారు.
మల్లవల్లిలో మౌలిక సదుపాయాలు
మల్లవల్లి పారిశ్రామిక పార్కులో యాజమాన్యాలు, కార్మికులు, ఉద్యోగులు మౌలిక వసతులు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. దీనికి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమాధానమిస్తూ.. మల్లపల్లి పారిశ్రామిక పార్కులో భూవివాదాలు లేని ప్రాంతాల్లో ఏపీఐఐసీ బీటీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించిందన్నారు.
నివేదికలు పరిశీలించాలి: స్పీకర్
అధికారులు ఇచ్చిన నివేదికలను మంత్రులు గుడ్డిగా నమ్మవద్దని, ఆ నివేదికలను మళ్లీ ఒకసారి పరిశీలించాలని స్పీకర్ అయ్యన్పపాత్రుడు మంత్రి పార్థసారథికి సూచించారు. ఒకసారి ఆ నివేదికలను పునః సమీక్షించి ఎవరైనా తప్పుడు నివేదికలు ఇచ్చి ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సూచనలు స్వీకరించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు.
Updated Date - Nov 19 , 2024 | 04:15 AM