AP Government : మళ్లీ నవోదయం!
ABN, Publish Date - Dec 23 , 2024 | 03:19 AM
రాష్ట్రంలో నాటుసారాపై టీడీపీ కూటమి ప్రభుత్వం యుద్ధభేరి మోగించేందుకు సిద్ధమైంది. దశలవారీగా ఏపీని నాటుసారా రహితంగా మార్చేందుకు మరోసారి నవోదయం కార్యక్రమం చేపట్టనుంది.
నాటుసారాపై ఉక్కుపాదం
8 జిల్లాల్లో తీవ్ర ప్రభావం.. 1,383 గ్రామాల్లో ఉత్పత్తి, రవాణా, అమ్మకం
దీనిని అరికట్టేందుకు జనవరి నుంచి మూడు దశల్లో నవోదయం-2
తొలుత గ్రామ సభలతో ప్రజల్లో అవగాహన
తర్వాత తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి
అనంతరం దాడులతో సారా రహిత రాష్ట్రం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో నాటుసారాపై టీడీపీ కూటమి ప్రభుత్వం యుద్ధభేరి మోగించేందుకు సిద్ధమైంది. దశలవారీగా ఏపీని నాటుసారా రహితంగా మార్చేందుకు మరోసారి నవోదయం కార్యక్రమం చేపట్టనుంది. జనవరి మొదటి వారంలో ఎక్సైజ్ శాఖ నవోదయం-2 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే నాటుసారా ప్రభావిత జిల్లాలు, గ్రామాలను గుర్తించింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు జిల్లాలు మినహా రాష్ర్టాన్ని నాటుసారా రహితంగా ప్రకటించారు. అప్పట్లో నవోదయం కార్యక్రమాన్ని పక్కాగా అమలుచేసి సారా లేకుండా చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత నాటుసారా మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో, ఆ తర్వాత ప్రభుత్వం మద్యం ధరలు రెట్టింపు చేసినప్పుడు నాటుసారా భారీగా పెరిగింది. పెరిగిన ధరలతో మద్యం
కొనుగోలుచేయలేని వారు ప్రత్యామ్నాయంగా సారావైపు మళ్లారు. ఓవైపు ఎక్కువ ధరలు, మరోవైపు పిచ్చి బ్రాండ్ల కారణంగా నాటుసారా వ్యాపారం జోరుగా కొనసాగింది. దీనిని అరికట్టేందుకు నాటి జగన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదు. పైగా ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని విక్రయించకపోవడంతో దానిని ఆసరాగా తీసుకున్న అక్రమార్కులు నాటుసారా తయారుచేసి అమ్మడం ద్వారా భారీగా ఆదాయం గడించారు. పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం, కర్నూలు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో నాటుసారా స్థావరాలు భారీగా పెరిగిపోయాయి.
మూడు కేటగిరీలుగా గ్రామాలు..
రాష్ట్రవ్యాప్తంగా 1,383 గ్రామాల్లో నాటుసారా ప్రభావం ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. వాటిని మూడు రకాలుగా వర్గీకరించింది. ‘ఏ’ కేటగిరీలో 206, ‘బీ’ కేటగిరీలో 394, ‘సీ’ కేటగిరీలో 783 గ్రామాలు ఉన్నాయి. ‘ఏ’ కేటగిరీ అంటే సారా ఉత్పత్తి చేసి అక్కడికక్కడే విక్రయిస్తారు. ‘బీ’ అంటే వేరే గ్రామంలో తయారైన సారాను తీసుకొచ్చి రవాణా చేస్తారు. ‘సీ’ గ్రామాల్లో సారా విక్రమాలు జరుగుతాయి. వీటిలో ప్రధానంగా ఏ కేటగిరీపై దృష్టి పెట్టనున్నారు. ఉత్పత్తిని నిలిపివేస్తే బీ, సీ కేటగిరీల గ్రామాల్లో దానంతట అదే నాటుసారా ఆగిపోతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత మూడు కేటగిరీల గ్రామాల్లోనూ దాడులు చేస్తారు. ఎక్కడా కొత్త స్థావరాలు ఏర్పాటు కాకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకుంటారు.
గ్రామ సభలతో శ్రీకారం..
గతంలో నాటుసారాపై అకస్మాత్తుగా దాడులు నిర్వహించేవారు. దానివల్ల తాత్కాలికంగా సారా తయారీ ఆగిపోయినా.. ప్రదేశాలు మార్చుకుని మళ్లీ ఉత్పత్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటుచేయడం వల్ల వాటిని గుర్తించడం పోలీసు, ఎక్సైజ్ అధికారులకు క్లిష్టంగా మారింది. అందువల్ల ఇకపై వ్యూహం మార్చి ఈసారి గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. నాటుసారా ప్రభావిత గ్రామాల్లో వీటిని ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నాటుసారా తయా రీ వల్ల కలిగే దుష్ప్రయోజనాలు, వాటి ద్వారా పెట్టే కేసులతో ఏర్పడే చిక్కులను వివరిస్తారు. వారే స్వచ్ఛందంగా తయారీ నుంచి వైదొలిగేలా మొదట ప్రయ త్నం చేస్తారు. ఆ తర్వాత దానిపైనే ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వం ద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తారు. దీనివల్ల కొంత మార్పు వస్తుందని.. నిత్యం కేసులు, దాడుల జీవితం కంటే, ప్రశాంతమైన జీవనానికి అక్కడి ప్రజలు మొగ్గుచూపే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నాటుసారా ఉత్పత్తికి కీలకమైన బెల్లం ఉత్పత్తిపైనా ఇక నుంచి నిఘా పెడతారు. నాటుసారాకు బెల్లం సరఫరా చేసేవారిపై చర్యలు తీసుకుంటారు. మూడో దశలో నాటు సారా స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేస్తారు.
రెండు రకాల ప్రయోజనాలు..
నవోదయం-2తో ఒకేసారి రెండు రకాల ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఓవైపు నాటుసారా నిర్మూలనతో ప్రజల ఆరోగ్యం పాడవకుండా కాపాడొచ్చు. అలాగే నాటుసారా కారణంగా మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయి. నాటుసారా అందుబాటులో లేకుండా చేస్తే దానికి అలవాటుపడ్డ వారు క్రమంగా తిరిగి మద్యం వైపు మళ్లుతారు. దానివల్ల అనారోగ్యం ప్రభావం తగ్గడంతో పాటు ప్రభుత్వానికీ ఆదాయం పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం క్వార్టర్ మద్యం రూ.99కే అందుబాటులోకి తెచ్చింది. నాటుసారా ప్రభావిత ప్రాంతాల్ల్లో రూ.99 మద్యం ఎక్కువ అందుబాటులో ఉంచితే నాటుసారాను సులభంగా నిర్మూలించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Updated Date - Dec 23 , 2024 | 03:31 AM