Amaravati : టీడీపీ @ 50 లక్షలు
ABN, Publish Date - Nov 26 , 2024 | 04:36 AM
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొత్త రికార్డుల దిశగా పరుగెడుతోంది. సోమవారం రాత్రికి ఆ పార్టీ సభ్యత్వం 50 లక్షల మార్కును దాటేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన 29 రోజుల్లోనే అర కోటి రికార్డును ఆ పార్టీ శ్రేణులు అధిగమించడం విశేషం.
29 రోజుల్లో అరకోటి దాటిన సభ్యత్వాలు
సమర్థులకు, విధేయులకు పదవులు ఇవ్వడం వల్లే!
రికార్డు సాధించిన నేతలకు లోకేశ్ ఫోన్లు
83 వేలతో అగ్ర స్థానంలో రాజంపేట
82 వేలతో రెండో స్థానంలో కుప్పం
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొత్త రికార్డుల దిశగా పరుగెడుతోంది. సోమవారం రాత్రికి ఆ పార్టీ సభ్యత్వం 50 లక్షల మార్కును దాటేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన 29 రోజుల్లోనే అర కోటి రికార్డును ఆ పార్టీ శ్రేణులు అధిగమించడం విశేషం. పార్టీ ఆవిర్భవించిన ఈ 43 ఏళ్లలో ఇంత వేగంగా సభ్యత్వం పూర్తి కావడం ఇదే ప్రఽథమమని టీడీపీ వర్గాలు తెలిపాయి. ప్రతి రెండేళ్లకోసారి పార్టీ సభ్యత్వ నమోదు నిర్వహిస్తోంది. ఈసారి గత నెల 26న ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆ రోజు సభ్యత్వ నమోదులో అగ్రస్థానంలో ఉన్న 20 నియోజకవర్గాలు, నమోదైన సభ్యత్వం వివరాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం, లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గాల కంటే అధికంగా మరి కొన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వం నమోదు కావడం విశేషం. అన్నమయ్య జిల్లా రాజంపేట ఇప్పటివరకూ రాష్ట్రంలో ప్రఽథమ స్థానంలో ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. కానీ ఇప్పుడు 83 వేల సభ్యత్వ నమోదుతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని ఆశిస్తున్న ముగ్గురు నేతలు సుగవాసి బాలసుబ్రమణ్యం, జగన్మోహన రాజు, మేడా బాబు సభ్యత్వ నమోదులో పోటీపడుతుండడంతో అక్కడ వేగం పెరిగిందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది.
రెండో స్థానంలో కుప్పం ఉంది. అక్కడ 82 వేల మంది టీడీపీ సభ్యులుగా నమోదయ్యారు. మూడో స్థానంలో అనంతపురం జిల్లా కల్యాణదుర్గం, నాలుగో స్థానంలో మంత్రి రామానాయుడు నియోజకవర్గం పాలకొల్లు, ఐదో స్థానంలో మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. మంగళగిరిలో 65 వేల మంది సభ్యులుగా చేరారు. సభ్యత్వ నమోదులో చురుగ్గా ఉండి ఫలితం చూపిస్తున్న నియోజకవర్గాల నేతలకు లోకేశ్ ఫోన్లు చేసి అభినందనలు చెబుతున్నారు. దీంతో పోటీ పెరిగింది. ఈసారి రాష్ట్ర స్థాయి నేతలతోపాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా సభ్యత్వ నమోదులో ఉత్సాహంగా పాల్గొంటున్నారని, దీనివల్ల నమోదు వేగంగా జరుగుతోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
5 లక్షల బీమా
టీడీపీలో సభ్యత్వ నమోదు రుసుము రూ.వందగా నిర్ణయించారు. గతంలో పార్టీ సభ్యులకు రూ.2 లక్షల ప్రమాద బీమా ఉండేది. ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచారు. పోయినసారి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ సభ్యత్వ నమోదు పెద్దగా సాగలేదు. ఈసారి అక్కడ కూడా జోరుగా జరుగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యకర్తల అవసరాలు చూడడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ పెట్టారు. దీని ద్వారా గత ఐదేళ్లలో పార్టీ శ్రేణులకు రూ.185 కోట్లు సాయంగా అందించారు. కష్టపడిన కార్యకర్తలను గుర్తించడానికి ఈసారి కొత్త విధానం ఏర్పాటు చేస్తున్నారు. సాంకేతికతతో బాగా పనిచేసిన వారిని గుర్తించి ఆ వివరాలు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఇటీవల నామినేటెడ్ పదవుల భర్తీలో ఈ సమాచారం ఆధారంగా కింది స్థాయిలో కష్టపడిన వారిని గుర్తించి పదవులు ఇవ్వడం వల్ల మంచి సంకేతం వెళ్లిందని, సభ్యత్వ నమోదు చురుగ్గా జరగడానికి ఇది కూడా కారణమని టీడీపీ కేంద్ర కార్యాలయ వర్గాలు అంటున్నాయి.
Updated Date - Nov 26 , 2024 | 04:38 AM