Samarlakota : ముగ్గురిని నరికేశారు!
ABN, Publish Date - Dec 16 , 2024 | 06:50 AM
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో దారుణం జరిగింది. ఇంటి నిర్మాణం విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురై దుర్మరణం చెందారు.
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో దారుణం
సామర్లకోట, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో దారుణం జరిగింది. ఇంటి నిర్మాణం విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురై దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. సామర్లకోటలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వెనుకగల దళిత చెరువు అనే ప్రాంతంలో కార్ధాల పండు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే తమ స్థలంలో కొంత ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ బచ్చల వర్గీయులు పంచాయతీకి, గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. 3నెలలుగా ఈ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నిర్మాణంలో భాగంగా శ్లాబ్ వేస్తుండగా కార్ధాల వర్గీయులపై బచ్చల కుటుంబీకులు ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు.
వీరిలో కార్ధాల ప్రకాశరావు(55) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని సామర్లకోట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ కార్ధాల చంద్రరావు(60) మృతి చెందాడు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించిన కార్ధాల ఏసుబాబు(45) కూడా మృతి చెందాడు. కార్ధాల పండు, కార్ధాల దావీదు, కార్ధాల బాబీతోపాటు మరో నలుగురు తీవ్ర గాయాలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని పెద్దాపురం డీఎ్‌సపీ శ్రీహరిరాజు, సామర్లకోట సీఐ శ్రీకృష్ణభగవాన్ సందర్శించారు. సామర్లకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Dec 16 , 2024 | 06:50 AM