ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tammineni Sitaram: అధ్యక్షా.. ఇది అక్రమం..

ABN, Publish Date - Oct 23 , 2024 | 04:30 AM

టీడీపీ హయాంలో వెలగపూడిలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో జర్మన్‌ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో మైకులు, డిజిటల్‌ ఆడియో సిస్టం ఏర్పాటు చేశారు.

Tammineni Sitaram

  • అసెంబ్లీ టెండర్లలో గోల్‌మాల్‌!

  • ఎల్‌-1ను కాదని ఎల్‌-2కు ఆడియో సిస్టం నిర్వహణ బాధ్యత

  • ఎక్కువ ధర వేసిన సంస్థకు పని అప్పగింత

  • ఫైలుపై రాసి ఆదేశించిన నాటి స్పీకర్‌ తమ్మినేని

  • టెండర్‌ ఫైళ్లను పరిశీలించిన ఆడిట్‌ విభాగం

  • మూడేళ్లలో రూ.18 లక్షల ప్రజాధనం వృథా అయినట్లు నివేదిక

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : టీడీపీ హయాంలో వెలగపూడిలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో జర్మన్‌ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో మైకులు, డిజిటల్‌ ఆడియో సిస్టం ఏర్పాటు చేశారు. దీనిని మొదట సీఆర్‌డీఏ ఏర్పాటు చేయించి మూడేళ్లపాటు దాని నిర్వహణ చూసింది. ఆ గడువు ముగిసే సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆడియో సిస్టం నిర్వహణ కోసం 2020 అక్టోబరులో టెండర్లు పిలిచారు. ఇందులో రెండు సంస్థలు సాంకేతిక అర్హత సాధించాయి. ఇందులో ఒకటి అట్లూరి అండ్‌ కో కాగా.. మరొకటి స్వస్తిక్‌ కమ్యూనికేషన్స్‌. అట్లూరి సంస్థ ఉమ్మడి రాష్ట్రంలో చాలాకాలం అసెంబ్లీ ఆడియో సిస్టం నిర్వహణ చేపట్టింది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కూడా నిర్వహణ అదే చూస్తోంది. స్వస్తిక్‌ కమ్యూనికేషన్స్‌ ప్రధానంగా సీసీ కెమేరాలు, ఇంటర్‌ కమ్‌ ఫోన్లకు సంబంధించిన నిర్వహణ చూస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్‌ సీసీ కెమేరాల నిర్వహణ ఈ సంస్థే చూస్తోంది.

మూడేళ్లపాటు ఆడియో సిస్టం నిర్వహణ అనుభవం ఉండాలన్నది ఈ టెండర్‌లో ప్రధాన నిబంధన. ఈ టెండర్‌ పిలవడానికి సరిగ్గా రెండు నెలల ముందు విజయవాడలోని గవర్నర్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్సింగ్‌ గదిలో ఆడియో సిస్టం ఏర్పాటుకు స్వస్తిక్‌ సంస్థకు ఆర్డర్‌ లభించింది. ఆగస్టు 1న ఆర్డర్‌ ఇచ్చి రెండో తేదీకల్లా దానిని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. టెండర్లలో తన అనుభవం కింద స్వస్తిక్‌ ఈ ఆర్డర్‌ను చూపించడం గమనార్హం. అలాగే గతంలో వైసీపీ కార్యాలయంలో ఏదో పని చేసినట్లు మరో లేఖను జత చేసింది. అయినా మూడేళ్ల అనుభవం నిబంధనకు ఇది చాలదు. 2020 అక్టోబరు 29న అసెంబ్లీలో టెక్నికల్‌ బిడ్‌ తెరిచారు. ఎల్‌-1గా అట్లూరి, ఎల్‌-2గా స్వస్తిక్‌ సంస్థను ఎంపికచేశారు. అదేరోజు సాయంత్రం ఫైనాన్షియల్‌ బిడ్‌ కూడా తెరిచారు. అట్లూరి సంస్థ ఏడాదిపాటు ఆడియో సిస్టం నిర్వహణకు రూ.36లక్షలు కోట్‌ చేసింది. స్వస్తిక్‌ రూ.44లక్షలు పేర్కొంది. రెంటికి మధ్య రూ.8లక్షల తేడా ఉంది. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు అందిన ఫిర్యాదులోని సారాంశం ప్రకారం..


ఈ బిడ్‌ తెరిచిన వెంటనే అట్లూరి సంస్థపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. పైవారికి స్వస్తిక్‌కు ఇవ్వాలన్న ఆసక్తి ఉందని.. అందుచేత బిడ్‌ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని అసెంబ్లీలోని కొందరు అధికారులు అట్లూరి ప్రతినిధులను పిలిపించి సూచించారు. ఎంత ఒత్తిడి చేసినా వారు ఒప్పుకోలేదు. దీంతో ఆ సంస్థపై అనర్హత వేటు వేయడానికి నాలుగైదు చిన్నచిన్న కారణాలు వెతికి పట్టుకుని ఫైలు తయారు చేశారు. తాము పెట్టిన నిబంధనల ప్రకారం డిమాండ్‌ డ్రాఫ్ట్‌ జత చేయాలని.. కానీ అట్లూరి సంస్థ బ్యాంకుగ్యారెంటీ చూపించిందన్నది ఇందులో ఒక కారణం. ఎంఎ్‌సఎంఈలుగా నమోదైన సంస్థలు డీడీ బదులు బ్యాంకు గ్యారంటీ చూపించవచ్చని కేంద్రం గతంలోనే ఆదేశాలు జారీచేసింది. అయినా అనర్హతకు దానిని కారణంగా చూపించారు.

ఎక్స్‌టర్నల్‌ పవర్‌ సప్లయ్‌ యూనిట్ల సరఫరా ధరను ఈ రెండు సంస్థలు విడివిడిగా పేర్కొన్నాయి. అట్లూరితో పోలిస్తే స్వస్తిక్‌ పేర్కొన్న ధర దాదాపు రెట్టింపుగా ఉంది. అయితే 16 యూనిట్లు అని ఉండాల్సినచోట అట్లూరి టెండర్‌లో 2అని టైపింగ్‌ తప్పు దొర్లింది. ఆ ధరను 16 యూనిట్లకు వర్తింపజేసినా తేడా రూ.లక్ష దాటడం లేదు. టెండర్‌ మొత్తం విలువలో ఈ రెండు సంస్థల మధ్య తేడా రూ.8 లక్షలు ఉంది. అందులో నుంచి ఒక లక్ష తగ్గించినా అట్లూరి టెండర్‌ ఇంకా రూ.7లక్షలు తక్కువగానేఉంది. తాము 16 యూనిట్లు అడిగితే అట్లూరి సంస్థ 2 అని మాత్రమే పేర్కొందంటూ అనర్హతకు అదొక కారణంగా రాశారు. ఆడియో సిస్టం తయారు చేసిన జర్మన్‌ కంపెనీ నుంచి తాము సర్టిఫికెట్‌ అడిగామని, టెండర్‌ తమకు వస్తే దానిని తెస్తామని స్వస్తిక్‌ కంపెనీ వాగ్దానం చేసిందని.. అట్లూరి కంపెనీ ఏమీ చెప్పలేదని మరో కారణం రాశారు. సాధారణంగా టెండర్‌ ఎవరికి వస్తే వాళ్లు వెళ్లి ఆ కంపెనీ నుంచి సర్టిఫికెట్‌ తెచ్చుకుంటారు.


ఇది ఆనవాయితీ. ఇటువంటి కారణాలు చూపించి అట్లూరి కంపెనీ బిడ్‌ తిరస్కరిస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు ఫైలు తయారు చేసి నాటి స్పీకర్‌ తమ్మినేని సీతారాం వద్దకు పంపారు. ఆయన దానిని సమర్థిస్తూ సవివరంగా వివరణ రాశారు. అట్లూరి కంపెనీ సర్వీస్‌ బాగోలేదని, డీడీ బదులు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చిందని... కొన్ని యూనిట్లు తక్కువ సరఫరా చేస్తామని చెప్పిందని.. ఈ కారణాల వల్ల అట్లూరి కంపెనీకి బదులు స్వస్తిక్‌ కంపెనీకే టెండర్‌ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఆయన ఆదేశంతోనే తుది నిర్ణయం జరిగినట్లు ఇది స్పష్టం చేస్తోంది. స్వస్తిక్‌ కంపెనీ ఈ టెండర్‌ ఆధారంగా మూడేళ్లపాటు ఆడియో సిస్టం నిర్వహించి అసెంబ్లీ నుంచి నిధులు పొందింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇటీవలే ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందాయి.


ఆడిట్‌ విభాగం పరిశీలన..

ఆడియో సిస్టం నిర్వహణ టెండర్‌ ఖరారుపై ప్రభుత్వ ఆడిట్‌ విభాగం పరిశీలనజరిపింది. తక్కువ ధరకు వేసిన సంస్థను పక్కన పెట్టడానికి చూపించిన కారణాలు సవ్యంగా లేవని నివేదికలో పేర్కొంది. స్వస్తిక్‌ కంపెనీ టెండర్‌ను ఆమోదించడం వల్ల మూడేళ్లలో సుమారుగా రూ.18లక్షల ప్రజాధనం వృధా అయిందని, తక్కువ ధర కోట్‌ చేసిన సంస్థ టెండర్‌ను ఆమోదించి ఉంటే ఈ వృధా జరిగేది కాదని స్పష్టం చేసింది. 16యూనిట్ల బదులు 2యూనిట్ల ధరను అట్లూరి కంపెనీ పేర్కొందన్న కారణం కూడా సమంజసంగా లేదని, ఆ ధరను 16 యూనిట్లకు వర్తించినా ఇంకా చాలాతేడా ఉందని వ్యాఖ్యానించింది. ఆడిట్‌ అభ్యంతరాలపై అసెంబ్లీ అధికారులు తమను తాము సమర్థించుకుంటూ సమాధానం పంపారు. కానీ వాటిని ఆడిట్‌ విభాగం ఉపసంహరించలేదు. ‘అసెంబ్లీ అధికారులు తప్పుడు నిర్ణయం తీసుకుంటే స్పీకర్‌ సరిదిద్దాలి. కానీ ఆయన ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఫైలుపై రాశారు. తమకు కావలసిన సంస్థను నిబంధనలకు వ్యతిరేకంగా ఎంపిక చేయడంలో ఆయన పాత్ర ఉందనడానికి ఇదే నిదర్శనం’ అని నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందడంతో అసెంబ్లీ అధికార వర్గాలు ప్రస్తుతం ఈ ఫైళ్ల పరిశీలన చేపట్టాయి.


మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం టెండర్ల వ్యవహారంలో ఇరుక్కున్నారు. ఆయన హయాంలో అసెంబ్లీలో ఒక పనికి పిలిచిన టెండర్లలో తక్కువకు కోట్‌ చేసిన వారిని కాదని.. తమకు కావలసిన వారికి దక్కేలా ప్రభావితం చేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తక్కువ రేటుకు టెండర్‌ వేసిన కంపెనీని పక్కకు తప్పించడానికి చిన్న చిన్న కారణాలు చూపుతూ ఆయన స్వయంగా ఫైలుపై రాసి సంతకం కూడా చేసినట్లు సమాచారం. రేటు ఎక్కువ వేసినా.. నాటి సీఎం జగన్‌ కుటుంబ మీడియా కార్యాలయంలో సీసీ కెమేరాల నిర్వహణ చూస్తున్న సంస్థకు ఈ టెండర్‌ లభించడం విశేషం.


Also Read:

జగన్‌కు మరో సీనియర్ నేత గుడ్‌బై..!

తల్లి, చెల్లిపై కోర్టులో జగన్ పిటిషన్..

ఆకాశ్, ఇషా అంబానీల వీడియో వైరల్.. విషయం

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Oct 23 , 2024 | 10:38 AM