TDP : రుషికొండ ప్యాలెస్ వెనుక మరెన్నో విషయాలు
ABN, Publish Date - Jun 18 , 2024 | 06:18 AM
విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వెనుక మరెన్నో విషయాలు దాగున్నాయని, ఇలాంటి కట్టడాలు ఇంకా ఉన్నాయని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రుషికొండ ప్యాలె్‌సకు ఎంత ఖర్చు చేశారు..
ఇలాంటి కట్టడాలు ఇంకా ఉన్నాయి
వంద రోజుల్లో గంజాయి
అరికట్టేలా ఆదేశాలు: మంత్రి లోకేశ్
మంగళగిరి సిటీ, జూన్ 17: విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వెనుక మరెన్నో విషయాలు దాగున్నాయని, ఇలాంటి కట్టడాలు ఇంకా ఉన్నాయని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రుషికొండ ప్యాలె్‌సకు ఎంత ఖర్చు చేశారు.. దేనికి ఖర్చు చేశారు అనే విషయాలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఇప్పటికే నివేదిక అడిగారని, పూర్తి వివరాలు వచ్చిన తరువాత ప్రజల ముందు బహిర్గత పరుస్తామని తెలిపారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యువగళం పాదయాత్ర సందర్భంగా.. గంజాయి వల్ల నష్టపోయిన కుటుంబాల గోడు తనను కలచివేసిందన్నారు. వంద రోజుల్లో గంజాయిని పూర్తిగా నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.
తాను కూడా డీజీపీ, హోం మంత్రితో ఈ విషయమై మాట్లాడానని, సెబ్ అధికారులతో సమీక్ష జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మూకల దాడులు ఆగలేదన్నారు. ఈ 12 రోజుల్లో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేశారని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో టీడీపీకి చెందిన ఓ మైనార్టీ కార్యకర్తను వైసీపీ నాయకుడు బ్యాటుతో కొట్టి చంపాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఓర్పు, సహనంతో ఉండాలని చెప్పడంతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఎంతో సంయమనంతో ఉన్నామని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తానన్నారు. ముఖ్యంగా దశాబ్దాల కాలంగా పేదలు నివసిస్తున్న భూములను రెగ్యులరైజ్ చేయడం, డ్రెయిన్లు, రోడ్లు, ఇతర మౌలిక వసతులు, స్వర్ణకారులకు గోల్డ్ క్లస్టర్ వంటి హామీలను నెరవేరుస్తామని మంత్రి లోకేశ్ మరోమారు స్పష్టం చేశారు.
Updated Date - Jun 18 , 2024 | 06:18 AM