వెంకన్న సన్నిధిలో టికెట్ల మాయ!
ABN, Publish Date - Aug 20 , 2024 | 05:55 AM
నకిలీ టికెట్లతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న అక్రమం ఒకటి టీటీడీలో బయటపడింది. ట్రావెల్స్, దళారీలతో కుమ్మక్కైన ఓ టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ చర్యకు పాల్పడుతున్నట్టు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ టిక్కెట్లు సృష్టి...స్కాన్ చేస్తున్నట్లు నాటకం
భారీగా సొమ్ములు తీసుకుని దర్శనానికి పంపుతున్న వైనం
ట్రావెల్స్, దళారీలతో కుమ్మక్కైన కాంట్రాక్టు ఉద్యోగి
గుట్టు రట్టు చేసిన విజిలెన్స్ అధికారులు
తిరుమల, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): నకిలీ టికెట్లతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న అక్రమం ఒకటి టీటీడీలో బయటపడింది. ట్రావెల్స్, దళారీలతో కుమ్మక్కైన ఓ టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ చర్యకు పాల్పడుతున్నట్టు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన మోహన్‌రాజు శ్రీవారి దర్శనం కోసం చెన్నైలోని ఎంపైర్ ట్రావెల్స్‌ను సంప్రదించాడు.
నాలుగు టికెట్లకు రూ.11,200 అవుతుందని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పడంతో మోహన్‌రాజు 17వ తేదీన గూగుల్‌పే ద్వారా నగదు పంపాడు. దీంతో గతంలో టీటీడీకి సేవలందించిన కేవీఎం అనే సంస్థలో పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి నవీన్‌ను సంప్రతించాలని ట్రావె ల్స్ నిర్వాహకులు సూచించారు.
నవీన్ ఏపీ టూరిజం పేరిట ఉన్న నాలుగు రూ.300 నకిలీ టికెట్ల జిరాక్స్‌ను మోహన్‌రాజుకు ఇచ్చి, టికెట్ల స్కాన్ కౌంటర్‌లో కౌంటర్ బాయ్‌గా పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి రుద్రసాగర్‌కు చూపిస్తే దర్శనానికి అనుమతిస్తారని వివరించాడు. కాగా, ఇలాంటి అక్రమాలపై ఇప్పటికే నిఘా ఉంచిన విజిలెన్స్ వింగ్ అధికారులు తిరుమలలో మోహన్‌రాజును అదుపులోకి తీసుకుని విచారించగా వ్యవహారం వెలుగు చూసింది. నకిలీ టికెట్లు స్కాన్ కాకపోయినప్పటికీ స్కాన్ చేసినట్టు నటిస్తూ దర్శనానికి రుద్రసాగర్ అనుమతిస్తున్నట్టు తేలింది.
17వ తేదీన 35మందిని, 18వ తేదీన 18మందిని ఇలాగే అనుమతించినట్టు విచారణలో వెలుగు చూసింది. అమృత్‌యాదవ్ అనే మరో మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగితో కలిసి కొద్ది నెలలుగా ఈ అక్రమానికి పాల్పడినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మోహన్‌రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నివేదిక తయారు చేసి తిరుమల టూటౌన్ పోలీసులకు కేసును అప్పగించారు. నవీన్, రుద్రరాజుతో పాటు ట్రావెల్స్‌కు సంబంధించిన ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Aug 20 , 2024 | 05:55 AM