గిరి శిఖరాన ఆస్పత్రి
ABN, Publish Date - Nov 27 , 2024 | 04:33 AM
గిరి శిఖరాన ఉండే గిరిజనులు ఏ అనారోగ్యం వచ్చినా కొండ దిగాల్సిందే! ఇక గర్భిణులకు ఆకస్మికంగా పురిటి నొప్పులు వస్తే.. డోలిపై వేసుకొని, కొండ దిగి మైదాన ప్రాంతంలో ఉన్న ఆస్పత్రులకు వెళ్లాల్సిందే! గ
మన్యం జిల్లాలోని కరడవలసలో తొలి కంటైనర్ ఆస్పత్రి ఏర్పాటు
గిరిజనుల వైద్య కష్టాలకు చెక్
వారి చెంతకే పలు వైద్య సేవలు
కూటమి ప్రభుత్వ వినూత్న నిర్ణయం
‘డోలీ మోత’లు ఉండకూడదన్న సీఎం ఆదేశాలతో అధికారుల చర్యలు
మరికొన్ని చోట్ల ఏర్పాటుకు సిద్ధం!
సాలూరు రూరల్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గిరి శిఖరాన ఉండే గిరిజనులు ఏ అనారోగ్యం వచ్చినా కొండ దిగాల్సిందే! ఇక గర్భిణులకు ఆకస్మికంగా పురిటి నొప్పులు వస్తే.. డోలిపై వేసుకొని, కొండ దిగి మైదాన ప్రాంతంలో ఉన్న ఆస్పత్రులకు వెళ్లాల్సిందే! గత ప్రభుత్వంలో వైద్య సేవలు కొండపైకి వరకూ రాకపోవడంతో గిరిజనులు వైద్యం కోసం కిందకు దిగాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత డోలీ మోతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులకు స్పష్టంచేశారు. డోలీ మోతలు ఉండకూడదనే ఆదేశాలతో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గిరి శిఖర గ్రామాల గిరిజనులకు అందుబాటులో వైద్య సేవలు తెచ్చేందుకు ‘గిరి ఆరోగ్య కేంద్రం’ పేరిట ఒక కంటైనర్ ఆస్పత్రిని రూపకల్పన చేశారు. మన్యం జిల్లాలో ఈ కంటైనర్ ఆస్పత్రుల ఏర్పాటుకు వైద్య శాఖతో చర్చించారు. 15 చోట్ల వీటి ఏర్పాటుకు సమీక్షించారు. తొలుత పైలెట్ ప్రాజెక్ట్‌గా ఏవోబీలో సాలూరు మండలం కరడవలస పంచాయతీ కేంద్రంలో ఏర్పాటు చేశారు. మంత్రి సంధ్యారాణి చేతులు మీదుగా సోమవారం(ఈనెల 25న) ప్రారంభించారు.
మరో నాలుగు చోట్ల ఏర్పాటు!
కరడవలస కంటైనర్ ఆస్పత్రి సమీప గిరిజన గ్రామాలకు చెందిన దాదాపు 2,000 మందికి అందుబాటులో ఉంటుంది. ఈ కేంద్రం పనితీరు పరిశీలించి జిల్లాలో మరో నాలుగు చోట్ల గిరి శిఖర గ్రామాల్లో కంటైనర్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నారు.
గిరిపుత్రులు.. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కొండలపై, అడవుల్లో జీవనం సాగిస్తుంటారు. వారి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మృగ్యం. ఇక వైద్య సదుపాయాల గురించి అయితే చెప్పనవసరం లేదు. అత్యవసరంగా వైద్యం అవసరమైతే.. నానా కష్టాలు పడి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మరీ కొండలు, వాగులు, వంకలు దాటుకొని రావాల్సిన పరిస్థితి. ఇక గర్భిణుల విషయంలోనైతే ‘డోలీ’ మోతలు అనేవి సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి.
గిరిజనుల వైద్య కష్టాలకు చెక్ పెట్టాలని కూటమి ప్రభుత్వం నిశ్చయించింది. డోలీ మోతలు ఉండకూడదని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గిరిజనులకు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ‘గిరి ఆరోగ్య కేంద్రం’ పేరిట కంటైనర్ ఆస్పత్రిని రూపకల్పన చేశారు. తొలుతగా సాలూరు మండలం కరడవలసలో ప్రారంభించారు.
ఏ వైద్య సేవలు.. ఎలా అందిస్తారంటే?
కరడవలస గిరి ఆరోగ్య కేంద్రంలో వారానికి రెండు రోజులు తోణాం పీహెచ్‌సీ డాక్టర్ వచ్చి వైద్య సేవలు అందిస్తారు. మిగిలిన రోజుల్లో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్), హెల్త్ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, ఆశా, సీహెచ్‌డబ్ల్యూ సేవలందిస్తారు. ఈ ఆస్పత్రిలో డాక్టర్ రూం, రోగులకు వైద్యం అందించేందుకు నాలుగు బెడ్‌లతో మరో రూం, టీవీ, బాల్కనీ ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో మలేరియా, డెంగ్యూ, మధుమేహం, రక్తశాతం, హెపటైటిస్, హెచ్‌ఐవీ, నీటి తనిఖీ, క్షయ, హెచ్‌సీవీ, ఐవోడీన్, యూరిన్, హెచ్‌సీజీ, వీఐఏ, నేత్ర వంటి 14 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. టీకాలు కూడా వేస్తారు. దాదాపు 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. గర్భిణులకు వైద్య పరీక్షలు చేయనున్నారు. వారానికి రెండుసార్లు వైద్యాధికారి ఓపీ సేవలు అందించనున్నారు. నాలుగు బుధవారాల్లో 104 మొబైల్ మెడికల్ యూనిట్ వచ్చి సేవలందిస్తుంది. ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ వారానికి మూడు సార్లు ఇక్కడ ఓపీ సేవలు అందిస్తారు.
ఇక ఆ కష్టాలు ఉండవు
గిరిజనులు ఇకపై వైద్యం కోసం డోలీ మోతలతో కొండ దిగాల్సిన అవసరం లేదు. మంత్రగాళ్లను ఆశ్రయించాల్సిన పనిలేదు. అందుబాటులో వైద్యం ఉండడం వారి ఆరోగ్యానికి రక్షగా ఉంటుంది.
- సీదరపు అప్పారావు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు
ఎంతో ప్రయోజనకరం
గిరి ఆరోగ్య కేంద్రం వల్ల గిరిజనులకు ఎంతో ప్రయోజనం. చిన్న అనారోగ్య సమస్యలకు మైదాన ప్రాంతానికి రావాల్సిన అవసరం తప్పుతుంది. గర్భిణులకు వివిధ పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తారు. పెద్ద ఆరోగ్య సమస్యలైతే మైదాన ప్రాంత ఆస్పత్రులకు రెఫర్ చేస్తాం.
- అక్యాన అజయ్, తోణాం పీహెచ్‌సీ వైద్యుడు
Updated Date - Nov 27 , 2024 | 04:35 AM