తిరుమలకు విజన్ డాక్యుమెంట్
ABN, Publish Date - Nov 22 , 2024 | 04:46 AM
తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
టీటీడీలో టౌన్ ప్లానింగ్ విభాగం ఏర్పాటు: ఈవో శ్యామలరావు
తిరుపతి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుపతి పరిపాలన భవనంలో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో ఐఐటీ నిపుణులు తిరుమలకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. విజన్ డాక్యుమెంట్ రూపొందించిన ప్రతినిధులతో సమావేశమయ్యామని, ఆ మాస్టర్ ప్లాన్‌లోని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్టు చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాలన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణావసరమని, టీటీడీకి అర్బన్ డెవల్‌పమెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండ్‌ను మార్చనున్నట్టు చెప్పారు. మల్టీలెవల్ కారు పార్కింగ్‌లను ఏర్పాటుచేసే ఆలోచన కూడా ఉందన్నారు. భవిష్యత్తులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోబుతున్నట్టు చెప్పారు. రాబోయే పాతికేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డాక్యుమెంట్‌ను రూపొందించి దాని ప్రకారం మౌలిక సదుపాయాలు రూపొందించే ఆలోచన ఉందన్నారు. ఇందుకు టౌన్ ప్లానింగ్‌లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ను సలహాదారుగా నియమించామన్నారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మికత వాతావరణం ఉండేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు సూచిస్తామని, వాటిలో నచ్చిన పేరును కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. ఆధ్యాత్మిక చిహ్మాలు లేని కాటేజీలను అందుకు అనుగుణంగా నిర్మాణంలో మార్పు చేసేలా చర్యలు తీసుకోబోతున్నామన్నారు.
Updated Date - Nov 22 , 2024 | 04:48 AM