Telugu Desam: ఇద్దరు కార్యకర్తలకు అరుదైన గౌరవం.. సచివాలయానికి ప్రత్యేకంగా పిలిపించుకున్న సీబీఎన్
ABN, Publish Date - Aug 09 , 2024 | 10:55 AM
ఇద్దరు సామాన్య టీడీపీ (Telugu Desam) కార్యకర్తలకు అరుదైన గౌరవం లభించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం వారిద్దరినీ అమరావతి సచివాలయానికి ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు...
ఇద్దరు సామాన్య టీడీపీ (Telugu Desam) కార్యకర్తలకు అరుదైన గౌరవం లభించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం వారిద్దరినీ అమరావతి సచివాలయానికి ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన మహిళా కార్యకర్త దుర్గాదేవి, పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన నాగరాజు యాదవ్‌లకు ఈ అవకాశం లభించింది. ఈ ఇద్దరూ పార్టీకి వీరాభిమానులు. ఆర్థికంగా సాధారణ స్థితిలో ఉన్నవారు. చంద్రబాబు ఏ కార్యక్రమం నిర్వహించినా ఠంచనుగా హాజరవుతారు.
స్కూటీపైనే..!
దుర్గాదేవికి ఒక స్కూటీ ఉంది. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా.. ఏ కార్యక్రమం చేపట్టినా ఆమె తన స్కూటీపై ఎంత దూరమైనా వెళ్లి పాల్గొనేవారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆమె మంగళగిరి పార్టీ కార్యాలయం ముందు జాతీయ రహదారిపై ఆయన్ను పోలీసులు తీసుకొస్తున్న వాహనానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. పోలీసులు నెట్టివేసి కొట్టినా ఆగలేదు. నాగరాజు మరీ సామాన్య కార్యకర్త. పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్నారంటే బస్సెక్కి వచ్చేస్తాడు. ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటనకు వెళ్లినా హాజరవుతాడు. అమాయకంగా ఉండే నాగరాజును పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు ఆప్యాయంగా పలకరిస్తుంటారు.
గుర్తుపెట్టుకుని మరీ..!
చంద్రబాబు అరెస్టు సమయంలో వీరిద్దరూ రాజమహేంద్రవరం జైలు వద్దే కొన్ని రోజులు ఉండి ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురు చూశారు. తనపై అంతులేని అభిమానం ఉన్న ఈ ఇద్దరినీ చంద్రబాబు గుర్తుపెట్టుకుని తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా గురువారం సెక్రటేరియట్‌కు పిలిపించుకున్నారు. ఆప్యాయంగా పలుకరించి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారితో ఫొటోలు దిగారు. తమ అధినేత ఆదరణకు వారిద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారు.
Updated Date - Aug 09 , 2024 | 11:16 AM