Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..?
ABN , Publish Date - Jul 11 , 2024 | 11:18 AM
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ త్వరలో అరెస్ట్ కాబోతున్నారా..? ఇందుకు సంబంధించి రంగం సిద్ధమైందా..? అంటే తాజా పరిణామాలను చూస్తే ఇదే నిజమనిపిస్తోంది..
విజయవాడ: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు న్యాయస్థానానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో వంశీని 71వ నిందితుడిగా పేర్కొనడం జరిగింది. అరెస్టుల భయంతో వైసీపీ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. త్వరలోనే అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సర్వం సిద్ధం అవుతోందని తెలియవచ్చింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్లో కొందరిని పోలీసులు నిన్ననే అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్‌విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు (క్రైమ్ నంబర్ 137/2023) నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..
ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుబెట్టారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టారు. ఐదు గంటలపాటు విధ్వంసం సృష్టించారు. గన్నవరంలో వారు సృష్టించిన అరాచకం, విధ్వంసం స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. అయితే ఇదంతా వల్లభనేని వంశీ ప్రోద్భలంతోనే జరిగింది. కానీ అప్పట్లో పోలీసులు టీడీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అర్ధరాత్రి వరకూ జీపులో వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పారు.
ఈ వ్యవహారంపై తాజాగా సత్యవర్ధన్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని సీసీ కెమేరాలు, వీడియోలు ద్వారా గుర్తించారు. 71మంది దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. వీరిలో 15 మంది.. మూల్పూరి ప్రభుకాంత్ అలియాస్ ప్రేమ్‌కుమార్, ఎర్రగళ్ల నగేశ్, షేక్ కరీముల్లా, కొల్లి సుబ్రమణ్యం, బుగ్గల రాజేశ్, రామినేని రవిబాబు, మల్లవల్లి సాయి రాహుల్, షేక్ రబ్బాని, పాగోలు సురేశ్, బండారుపల్లి కోటేశ్వరరావు, పడమట నాగరాజు, దాసరి విజయ్, సాలియోహాన్, డొక్కు సాంబశివ వెంకన్నబాబు, మేచినేని విజయ్‌కుమార్‌లను అరెస్టు చేసి బుధవారం గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. తాజాగా 71వ నిందితుడిగా వల్లభనేని వంశీ పేరును చేర్చారు.