YS Vijayamma: వైఎస్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ
ABN, Publish Date - Oct 29 , 2024 | 06:22 PM
జగన్, షర్మిల పేరిట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొన్ని ఆస్తులు పెట్టారని ఆయన సతీమణి విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ ఆస్తులు పంపకం కాదని అన్నారు. వైవీసుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఎన్నో అసత్యాలు చెప్పారని అన్నారు. వైఎస్ ఆస్తులు పంచారన్నది అవాస్తవమని విజయమ్మ స్పష్టం చేశారు.
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఆయన సతీమణి విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ‘‘ఇంటి గుట్టు వ్యాధి రట్టు.. తెరిచిన పుస్తకం’’ అని వైఎస్ అనేవారని గుర్తుచేశారు. తాను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. జరగకూడనివి అన్ని తన ముందే జరిగిపోతున్నాయని అన్నారు. అబద్ధాల పరంపర కొనసాగుతుందని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఎన్నో అసత్యాలు చెప్పారని అన్నారు. వైఎస్ ఆస్తులు పంచారన్నది అవాస్తవమని వైఎస్ విజయమ్మ తేల్చిచెప్పారు.
పిల్లలకు ఆస్తులు సమానంగా ఉండాలి..
జగన్, షర్మిల పేరిట వైఎస్ కొన్ని ఆస్తులు పెట్టారని తేల్చిచెప్పారు. ఇది ముమ్మాటికీ ఆస్తులు పంపకం కాదని అన్నారు. ‘‘షర్మిలకు వైఎస్సార్ ఆస్తులు ఇచ్చారని లిస్టు చదివారు. అలాగే జగన్ పేరిట పెట్టిన ఆస్తుల జాబితా కూడా చదివి ఉండాల్సింది. ఆడిటర్‌గా ఉన్న విజయసాయిరెడ్డికి అన్నీ తెలుసు. ఇంటి బంధువుగా ఎంవోయూపై వైవీసుబ్బారెడ్డి సంతకం చేశారు. మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం బాధ కలిగించింది. అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండేందుకే నిజం చెబుతున్నా. అమ్మగా నాకు ఇద్దరు సమానమే.. అలాగే వైఎస్సార్ మాట కూడా ముఖ్యమే. ఆస్తులు ఇద్దరు బిడ్డలకు సమానం అనేది నిజం. నలుగురు పిల్లలకు ఆస్తులు సమానంగా ఉండాలన్నది వైఎస్సార్ ఆజ్ఞ. బాధ్యత గల కొడుకుగా జగన్ ఆస్తులను సంరక్షించాలి. వైఎస్సార్ చివరి రోజుల్లో ఆయనకు జగన్ మాట ఇచ్చారు. నాన్న నీ తర్వాత పాప మేలు కోరే వారిలో నేనే మొదటివాడిని అని.. వైఎస్సార్‌కు జగన్ మాట ఇవ్వడం కూడా నిజం. ఈ విషయం 'నాలో నాతో వైఎస్సార్' పుస్తకంలో ఎప్పుడో రాశా’’ అని విజయమ్మ స్పష్టం చేశారు.
వైఎస్సార్ ఆస్తులు పంచలేదు...
‘‘అమ్మగా నాకు ఇద్దరూ సమానమే. అలాగే ఆస్తులు ఇద్దరికీ సమానమనేది నిజం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండటం నా విధి, ధర్మం. ఇంట్లో ఒకబిడ్డకు ఇంకోబిడ్డ అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం కష్టం. హక్కు ఉంది కాబట్టే పాప షర్మిలకు రూ.200 కోట్ల డివిడెండ్లు ఇచ్చారు. పాపకు హక్కు ఉంది కాబట్టే ఎంవోయూ రాసుకున్నారు. ఎంవోయూలో ఉన్న సరస్వతి షేర్స్ వందశాతం.. ఎంవోయూలో లేని యలహంక ప్రాపర్టీ వందశాతం వెంటనే ఇస్తానని.. జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. వైఎస్సార్ ఉన్నప్పుడు ఆస్తులు పంచలేదు.. అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు ఉన్నవన్నీ కుటుంబ ఆస్తులే. అన్నీ తెలిసినా విజయసాయిరెడ్డి అవాస్తవాలు మాట్లాడారు. వీటన్నింటికీ అప్పుడు.. ఇప్పుడూ నేనే సాక్షిని. అటాచ్‌మెంట్‌లోలేని ఆస్తుల్లోనూ పాపకు అన్యాయం జరిగింది. రాజకీయాల్లో జగన్ చెప్పినట్టే పాప చేసింది.ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని అందరినీ కోరుతున్నా’’ అని విజయమ్మ వెల్లడించారు.
Updated Date - Oct 29 , 2024 | 06:55 PM