Vijayawada: భవానీ దీక్ష విరమణలు.. సీపీ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 21 , 2024 | 09:23 AM
భవానీల దీక్ష విరమణ ప్రారంభమైంది. అందుకోసం శనివారం ఉదయం ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. దీక్ష విరమణ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు.. ఏర్పాట్లను పర్యవేక్షించారు.
విజయవాడ, డిసెంబర్ 21: ఇంద్రకీలాద్రిపై కోలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. శనివారం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం సీపీ రాజశేఖర్ బాబు విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రం నలుమూల నుంచి దీక్ష విరమణ కోసం భక్తులు తరలి వస్తున్నారన్నారు.
Also Read: భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి
ఈ ఏడాది ఏడు లక్షలకు పైచిలుకు భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. భవానీల మాల విరమణ కోసం రెండు హోమ గుండాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమం బందో బస్తు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు ఆరు వేల మంది పోలీసులు విజయవాడకు వచ్చారని పేర్కొన్నారు. ఇక నగరంలో అడుగడుగున... అంటే దాదాపు 1900 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ వివరించారు. కంట్రోల్ కమాండింగ్ ద్వారా భవానీలను మోనిటరింగ్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్ లను సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నామన్నారు.
ఇక అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు వీలు కలుగుతోందన్నారు. అలాగే భవానీలను మోనిటరింగ్ చేసేందుకు దీక్ష విరమణ అనే ప్రత్యేక యాప్‌ని అందుబాటులోకి తీసుకు వచ్చామని గుర్తు చేశారు. గతంలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఈ ఏడాది పకడ్బందీగా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. నేటి నుంచి ప్రారంభమైన భవానీ దీక్షలు.. డిసెంబర 25వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఈ నేపథ్యంలో భవానీ దీక్ష విరమణలకు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని విజయవాడ నగర సీపీ రాజశేఖర్ బాబు వివరించారు.
మరోవైపు దీక్ష విరమణ కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి భవానీలు, భక్తులు విజయవాడ భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇక శనివారం ఉదయం నుంచి దీక్ష విరమణ నేపథ్యంలో భవానీలు విజయవాడకు పోటెత్తారు. ఇక వారి కోసం మూడు హోల్డింగ్ ప్రాంతాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు అన్న వితరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లుపై దేవాలయ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అలాగే సీతమ్మ పాదాల వద్ద భక్తులు తలనీలాల సమర్పించుకొనేందుకు ఏర్పాట్లు చేశారు. అదే విధంగా దీక్ష విరమణ సమయంలో భక్తులు విసర్జింజే దుస్తులను ఆ ప్రదేశం నుంచి తొలగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Dec 21 , 2024 | 09:25 AM