Anitha: ఈ సౌకర్యం జగన్‌కు, భారతి రెడ్డికీ లేదు: అనిత
ABN, Publish Date - Jan 25 , 2024 | 12:45 PM
విశాఖ: వై నాట్ 175 నుంచి... సంతోషంగా దిగిపోతా అనే స్థాయికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగిపోయారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అవినీతి తోటలో రోజా పువ్వులు విరబోస్తున్నాయని, మంత్రి రోజా అవినీతిని నగరి పార్టీ నేతలు, ప్రజలే చెబుతున్నారన్నారు.
విశాఖ: ‘వై నాట్ 175’ నుంచి... సంతోషంగా దిగిపోతా అనే స్థాయికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగిపోయారని తెలుగు దేశం పార్టీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఈ సందర్భంగా గురువారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి తోటలో రోజా పువ్వులు విరబోస్తున్నాయని, మంత్రి రోజా అవినీతిని నగరి పార్టీ నేతలు, ప్రజలే చెబుతున్నారన్నారు. చైర్ పర్సన్ పదవి కోసం రోజా తన బినామీలతో రూ.40 లక్షలు స్వాహా చేశారని, ఒక దళిత మహిళ దగ్గర డబ్బులు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. బురదలో వికసించిన రోజా ఎందుకు తన అవినీతిపై స్పందించడం లేదని నిలదీశారు.
‘నగరి రమ్మని అంటోంది.. జబర్దస్ పొమ్మంది.. గంజి నుంచి బెంజి వరకు వెళ్ళింది’’ అని కోట్లాది రూపాయలు ఆర్ టాక్స్ ద్వారా మంత్రి రోజా సంపాదించారని అనిత అన్నారు. జే టాక్స్‌కు అనుబంధం ఆర్‌టాక్స్‌ను రోజా వసూళ్లు చేశారని, నగరిలో ఐదు మండలాను తమ కుటుంబ సభ్యులకు అప్ప జెప్పి.. డబ్బులు వసూళ్లు చేశారని ఆరోపించారు. పర్యాటక శాఖ అంటే... తను మాత్రమే పర్యటించే శాఖ అని రోజా అంటున్నారన్నారు. కోట్లాది రూపాయల విదేశీ పర్యటనకు ఖర్చు చేస్తున్నారన్నారు.
‘రోజా రెడ్డి చెప్పులు పట్టుకోవడానికి ఉద్యోగి ఉన్నారు... ఈ సౌకర్యం జగన్‌కు.. భారతి రెడ్డికి లేదు’ అని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో సీసాలు బద్దలు కొట్టిన రోజా... ఇప్పుడు కల్తీ మద్యం ఏరులై పారుతున్నా సీసాలు ఎందుకు బద్దలు కొట్టడం లేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు షర్మిల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లు కోవాలన్నారు. ఆనాడు షర్మిల పాదయాత్ర చేస్తేనే.. వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. గ్రావెల్, ఇసుక, భూ ఆక్రమణలలో రోజా డబ్బులు సంపాదిస్తున్నారని, టీటీడీ దర్శనాల కోసం నెలకు రూ. 20 లక్షలు రోజా తీసుకుంటున్నారని, దేవుడితో పెట్టుకుంటే రోజాకు పుట్టగతులు ఉండవని అన్నారు.
మంత్రి రోజాకు అనిత సవాల్..
మంత్రి రోజాకు వంగలపూడి అనిత సవాల్ చేశారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, దమ్ముంటే రోజా ఏ తప్పు చేయలేదని ఏ గుడిలోనైనా ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు, లోకేష్, షర్మిల నాన్ లోకల్ అని అంటున్నారని, మరి ఆనాడు షర్మిల పాదయాత్ర చేసి నప్పుడు ఆమె నాన్ లోకల్ కాదా? దీనికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా పుట్టుపూర్వోత్తరాలన్నీ నాన్ లోకలేనని అన్నారు. షర్మిల ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానాలు చెప్పాల్సి ఉందన్నారు. జగనన్న బాణం తిరిగి వైసీపీకే గుచ్చుకుంటోందని, ఆమె రాక వల్ల వైసీపీకి భారీగా గండి పడిందని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
Updated Date - Jan 25 , 2024 | 12:50 PM