డీజీపీ ఏం చేస్తున్నారు? కేసుల వివరాలివ్వడానికి ఎంత టైం కావాలి?
ABN, Publish Date - Apr 13 , 2024 | 05:35 AM
తమపై నమోదైన కేసుల వివరాలు అందజేయాలని ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పలువురు అభ్యర్థులు ఇచ్చిన వినతిపత్రాలపై డీజీపీ స్పందించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది....
నెల క్రితమే వినతిపత్రం ఇచ్చారుగా?
ఏఐతో మూడు గంటల్లోనే ఇవ్వచ్చు
సుప్రీం మార్గదర్శకాలు పాటిస్తే కేసుల సమాచారం తెప్పించేవారు
కేసుల్ని ప్రస్తావించకుంటే అభ్యర్థుల్ని అనర్హులుగా ప్రకటిస్తారుగా
16లోగా సమాచారం ఇవ్వండి
హైకోర్టు మౌఖిక ఆదేశాలు
అమరావతి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): తమపై నమోదైన కేసుల వివరాలు అందజేయాలని ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పలువురు అభ్యర్థులు ఇచ్చిన వినతిపత్రాలపై డీజీపీ స్పందించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నెల రోజుల క్రితం పిటిషనర్లు డీజీపీకి వినతి పత్రం అందజేస్తే, సమాచారం ఇవ్వకుండా ఇంతకాలం ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. కేసుల వివరాలు అందజేసేందుకు ఎంత సమయం కావాలని నిలదీసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేసుల వివరాలు అందజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించి ఉంటే ఇప్పటికే కేసులు సమాచారం తెప్పించి ఉండేవారని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. నామినేషన్ల సమయంలో పిటిషనర్లు తమపై నమోదైన కేసులు వివరాలను ప్రస్తావించకుంటే వారిపై అనర్హతవేటు పడొచ్చని పేర్కొంది. సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించింది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే రెండు, మూడు గంటల్లోనే సమాచారాన్ని అందజేయవచ్చని పేర్కొంది. నేటి నుంచి మొదలుపెట్టి ఈ నెల 16లోగా పిటిషనర్లకు వారిపై నమోదైన కేసుల వివరాలు అందజేయాలని డీజీపీ, పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తమపై నమోదైన కేసుల వివరాలు అందజేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రులు అయ్యన్నపాత్రుడు, నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాసరావు, బొండా ఉమామహేశ్వరరావు, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బీ రామచంద్ర యాదవ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, వీవీ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు వీవీ సతీష్, పీవీజీ ఉమేశ్‌చంద్ర, తదితరులు వాదనలు వినిపించారు.పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘పిటిషనర్లపై నమోదైన కేసుల వివరాలను జిల్లా ఎస్పీలు నుంచి తెప్పించాల్సి ఉంది. ఎస్పీలను సంప్రదించకుండా నేరుగా డీజీపీకి వినతిపత్రం ఇస్తున్నారు. దీంతో సమాచారం తెప్పించడం ఇబ్బందికరంగా మారింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటిస్తాం’ అని అన్నారు.
Updated Date - Apr 13 , 2024 | 06:56 AM