Share News

YCP: కేవలం ఏడుగురితోనే ఐదో జాబితా విడుదల

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:29 AM

అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల కొరతతో సతమతమవుతోంది. దీంతో కేవలం ఏడుగురితోనే ఐదో జాబితాను బుధవారం రాత్రి విడుదల చేశారు. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారుచేశారు.

YCP: కేవలం ఏడుగురితోనే ఐదో జాబితా విడుదల

వైసీపీ ఐదో జాబితాలో నలుగురు ఎంపీ,

ముగ్గురు అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు

మళ్లీ తిరుపతి లోక్‌సభకు గురుమూర్తి

నరసరావుపేట నుంచి అనిల్‌కుమార్‌

మచిలీపట్నంలో సింహాద్రి రమేశ్‌

సత్యవేడు అసెంబ్లీకి నూకతోటి రాజేశ్‌

విజయసాయికి అదనంగా

గుంటూరు లోక్‌సభ బాధ్యతలు

ఒంగోలు పార్లమెంటరీ

సమన్వయకర్తగా చెవిరెడ్డి

సంతనూతలపాడు,

కందుకూరు, కావలికీ ఆయనే

అమరావతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల కొరతతో సతమతమవుతోంది. దీంతో కేవలం ఏడుగురితోనే ఐదో జాబితాను బుధవారం రాత్రి విడుదల చేశారు. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారుచేశారు. తిరుపతి (ఎస్సీ) లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో.. అక్కడ ప్రస్తుత ఎంపీ మద్దిల గురుమూర్తికే అవకాశమిచ్చారు. ఆయన పోటీచేయాలనుకున్న సత్యవేడు (ఎస్సీ) అసెంబ్లీ అభ్యర్థిగా నూకతోటి రాజేశ్‌ను ప్రకటించారు. కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్‌, మచిలీపట్నం పార్లమెంటుకు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌బాబును ఇన్‌చార్జులుగా ప్రకటించారు. సింహాద్రి చంద్రశేఖరరావును అవనిగడ్డ అసెంబ్లీ ఇన్‌చార్జిగా నియమించారు. నెల్లూరు సిటీ స్థానంలో గెలుపు అవకాశాల్లేవని.. ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ను నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడి వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఐదు విడతల్లో 61 మంది అసెంబ్లీ.. 14 మంది లోక్‌సభ ఇన్‌చార్జులను ప్రకటించారు. అరకులోయ అసెంబ్లీ స్థానానికి ఇప్పటికే అరకు (ఎస్టీ) ఎంపీ గొడ్డేటి మాధవిని అభ్యర్థిగా ప్రకటించగా.. బుధవారం ఆమెను మార్చి ఆర్‌.మత్స్యలింగానికి అవకాశమిచ్చారు. సర్వేల సాకుతో విజయావకాశాల్లేవంటూ మెజారిటీ సిటింగ్‌లకు సీఎం జగన్‌ మొండిచేయి చూపుతున్నారు. ఈ క్రమంలో సరైన అభ్యర్థుల కోసం ఎంత అన్వేషిస్తున్నా.. ఆయన అంచనాలకు తగినవారు దొరకడం లేదు. ఇంకోవైపు.. ఒంగోలు లోక్‌సభ స్థానం అభ్యర్థిగా ఇంకా ఎవరినీ తేల్చలేదు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఖరారుచేశామని మంగళవారం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంపీ విజయసాయిరెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేసినప్పటికీ.. తాజా జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. అయితే ఆ స్థానంతో పాటు సంతనూతలపాడు, కందుకూరు, కావలి అసెంబ్లీలకు చెవిరెడ్డిని ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించడం గమనార్హం. గుంటూరు లోక్‌సభ సమన్వయ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అదనంగా అప్పగించారు.

లోక్‌సభ అభ్యర్థులు వీరే..

తిరుపతి(ఎస్సీ) ఎం.గురుమూర్తి

నరసరావుపేట అనిల్‌కుమార్‌ యాదవ్‌

కాకినాడ చలమలశెట్టి సునీల్‌

మచిలీపట్నం సింహాద్రి రమేశ్‌బాబు

అసెంబ్లీ అభ్యర్థులు...

సత్యవేడు (ఎస్సీ) నూకతోటి రాజేశ్‌

అవనిగడ్డ సింహాద్రి చంద్రశేఖరరావు

అరకులోయ (ఎస్టీ) మత్స్యలింగం

ఐదో జాబితా ఇంత చిన్నగా ఉండడంపై వైసీపీ ముఖ్యనేతలూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇన్ని నెలలుగా కసరత్తు చేస్తూ.. 175 అసెంబ్లీ .. 25 లోక్‌సభ స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని అంతర్గత సమావేశాల్లో ఆర్భాటంగా చెప్పుకొంటున్న జగన్‌లో ఏదో తెలియని భీతి కనిపిస్తోందని అధికార పార్టీ వర్గాలే అంటున్నాయి.

వైసీపీలోకి రావెల

బుధవారం తాడేపల్లి సీఎం కార్యాలయానికి మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి విల్సన్‌బాబు వచ్చారు. కిశోర్‌బాబు ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.

ఆ ఫ్లెక్సీలు కట్టిన చోట జనసేన పోటీచేస్తుందా?

వైసీపీ సిద్ధం అంటూ కట్టిన ఫ్లెక్సీల పక్కనే మేమూ సిద్ధమేనంటూ జనసేన ఫ్లెక్సీలను కడుతోందని.. ఇలా పెట్టిన ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన పోటీ చేయగలదా అని మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

Updated Date - Feb 01 , 2024 | 08:07 AM