YS Jagan : పాస్‌పోర్టు ఐదేళ్లకు ఇప్పించండి
ABN, Publish Date - Sep 07 , 2024 | 03:48 AM
పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇచ్చేందుకు విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు కఠిన షరతులు విధించడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టులో జగన్ అత్యవసర పిటిషన్
బెజవాడ ప్రజాప్రతినిధుల కోర్టు పరిధి దాటింది
ఎన్‌వోసీ జారీకి కఠిన షరతులు పెట్టింది
సీబీఐ కోర్టు ఐదేళ్లు రెన్యువల్ చేయాలంటే.. ఏడాదికే పాస్‌పోర్టు ఇవ్వాలని ఆదేశాలు
మాజీ సీఎం తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు
వివరాల కోసం సమయం కోరిన పీపీ
ఎల్లుండి విచారణ జరుపుతామన్న న్యాయమూర్తి
అమరావతి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పాస్‌పోర్ట్ పునరుద్ధరణకు నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇచ్చేందుకు విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు కఠిన షరతులు విధించడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం కోర్టు విచారణ ప్రారంభమైన వెంటనే ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. కుమార్తె పుట్టినరోజు వేడుకలకు ఈ నెల 3 నుంచి 25 వరకు లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు జగన్‌కు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా డిప్ల్లమేటిక్ పాస్‌పోర్టు ఉండేదని, పదవి నుంచి దిగిపోయాక జనరల్ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. పాస్‌పోర్టును ఐదేళ్లపాటు పునరుద్ధరించేందుకు (రెన్యువల్‌కు) సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిందని వెల్లడించారు.
‘ఓ పరువునష్టం కేసు పెండింగ్ ఉన్నందున విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు నుంచి ఎన్‌వోసీ తెచ్చుకోవాలని పాస్‌పోర్ట్ అధికారులు జగన్‌కు సూచించారు. అందుకోసం ఆయన ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా.. ఎన్‌వోసీ జారీకి పలు కఠిన షరతులు విధించింది. ఏడాది పాటు మాత్రమే పాస్‌పోర్టు రెన్యువల్‌కు అనుమతిస్తామని.. అందుకు రూ.20 వేల బాండ్‌తో ష్యూరిటీ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 6 నుంచి 27 మధ్య మాత్రమే లండన్‌కు వెళ్లాలని షరతులు విధించింది.
సీబీఐ కోర్టు విధించిన షరతులకు అదనంగా విజయవాడ ప్రత్యేక కోర్టు షరతులు పెట్టింది. ఈ విషయంలో తన పరిధి దాటింది’ అని పేర్కొన్నారు. సీబీఐ కోర్టు ఇచ్చిన గడువు తక్కువగా ఉన్నందున ప్రత్యేక కోర్టు విధించిన షరతులను సవాల్ చేస్తూ తాము వేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ... కేసు వివరాలు తన వద్ద అందుబాటులో లేవని, అవి తెప్పించుకునేందుకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్.. పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపి, అదేరోజు నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించారు.
Updated Date - Sep 07 , 2024 | 03:48 AM