ఇంకెన్నాళ్లీ ఇక్కట్లు?
ABN, Publish Date - Dec 20 , 2024 | 05:14 AM
జగన్ ప్రభుత్వంలో అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పించడంలో అక్రమాలు ఎలా చేశారో కూటమి ప్రభుత్వం నిగ్గు తేల్చింది. అక్రమార్కులు ఎవరో కనిపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. కానీ, ఈ పేరిట ఫ్రీ హోల్డ్ పరిధిలోకి వచ్చిన భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసింది.
చిన్న కమతాలకూ ‘ఫ్రీ హోల్డ్’ కష్టాలు
ఎకరం,రెండు ఎకరాల రైతులకు మోక్షమేదీ?
అసైన్డ్ భూములపై ఎటూ తేల్చని ప్రభుత్వం
రికార్డుల పున: పరిశీలన ఇప్పటికే పూర్తి
కానీ, రిజిస్ట్రేషన్ల నిలిపివేత మరోనెల పొడిగింపు
జగన్ ఇచ్చిన జీవో 596తో అసైన్డ్‌కు ఆపద
ఆ జీవోను వెనక్కి తీసుకోని కూటమి ప్రభుత్వం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ ప్రభుత్వంలో అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పించడంలో అక్రమాలు ఎలా చేశారో కూటమి ప్రభుత్వం నిగ్గు తేల్చింది. అక్రమార్కులు ఎవరో కనిపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. కానీ, ఈ పేరిట ఫ్రీ హోల్డ్ పరిధిలోకి వచ్చిన భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసింది. రికార్డుల పున:పరిశీలన ప్రక్రియ ముగిసినా రిజిస్ట్రేషన్లపై స్పష్టవ్యె ఉత్తర్వులు ఇచ్చేవరకు రిజిస్ట్రేషన్లు చేపట్టడానికి వీల్లేదంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీంతో చిన్న కమతాలున్న అసైన్డ్ భూయజమానులు గగ్గోలు పెడుతున్నారు. భూములు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుంటే రుణాలు, ఇతర ఆర్థికపరమైన వనరులు సమకూరతాయని, కానీ గత ఐదారు నెలలుగా ప్రభుత్వం అనుమతించకపోవడంతో తమకు ఆ అవకాశాలు దక్కడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
20 ఏళ్ల నిబంధనతో చిక్కులు..
గత జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అసైన్‌మెంట్ భూముల చట్టం-1977(పీఓటీ యాక్ట్)ను సవరించిన సంగతి తెలిసిందే. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూముల గడువు 20 ఏళ్లు దాటితే వాటిపై లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు(ఓనర్‌షిప్ రైట్స్) వస్తాయనీ, అలాంటి భూములను నిషేధ భూముల జాబితా 22‘(ఏ) నుంచి తొలగించాలనీ, ఆ తర్వాత ఆ భూములను రైతుల పేరిట ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలని గత ప్రభుత్వం గత ఏడాది డిసెంబరులో జీవో 596 జారీ చేసింది. అయితే, వైసీపీ నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కయి జీవోను అడ్డంపెట్టుకొని 4.17 లక్షల ఎకరాలను అక్రమంగా, నిబంధనలకు విరుద్ధ్దంగా ఫ్రీ హోల్డ్ చేశారు. అందులో 25వేల ఎకరాలను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.
భూవివాదాలపై టాస్క్‌ఫోర్సు
కూటమి ప్రభుత్వం వచ్చాక మదనపల్లి ఫైల్స్ ఘటన జరిగింది. సబ్‌కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ రికార్డు రూమ్‌లోని అసైన్‌మెంట్ పట్టాలు, రిపోర్టులను దుండగులు తగలబెట్టారు. ఆ తర్వాత అన్ని రెవెన్యూ ఆఫీసుల్లోని అసైన్డ్ భూముల రికార్డుల పున:పరిశీలన ప్రారంభించారు. ఈ ప్రక్రియ ముగిసేవరకు ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం రికార్డుల పున:పరిశీలన అనేది సెప్టెంబరు నెలాఖరునాటికే పూర్తికావాల్సిఉంది. అయితే రెవెన్యూశాఖ వివిధ పనుల్లో బిజీగా ఉంటూ ఈ లక్ష్యాన్ని సకాలంలో అందుకోలేకపోతోంది. దీంతో ఇప్పటివరకు రెండు దఫాలుగా రిజిస్ట్రేషన్ల నిలిపివేతను పొడిగించింది. ఈనెల 10తోనే ఈ గడువు ముగిసింది. వాస్తవానికి రికార్డుల పరిశీలన ఈనెల ఆరోతేదీనాటికే పూర్తయింది. తొమ్మిది లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేస్తే అందులో 4.17 లక్షల ఎకరాలు అక్రమంగా, జీవో 596కు విరుద్ధంగా చేశారని గుర్తించారు. కాబట్టి ఆ భూముల విషయంలో జరిగిన అక్రమాలకు బాధ్యులెవరో ప్రభుత్వం గుర్తించాలి. వారిపై చర్యలు తీసుకోవడానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కానీ, రిజిస్ట్రేషన్ల నిలిపివేత విషయంలో ఏ ఆదేశాలూ ఇవ్వలేదు. దీంతో రెవెన్యూశాఖ ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేతను మరో నెలరోజుల పాటు పొడిగించింది.
ఏదో ఒకటి తేల్చాలి...
అక్రమాలు ఏపాటివో తేలింది. అక్రమార్కులు ఎవరో పోలీసులు కనిపెట్టాలి. కానీ, ఎకరం, రెండు ఎకరాల విస్తీర్ణం ఉన్న అసైన్డ్ భూములను ఇంకా నిషేధ జాబితాలో కొనసాగించడం దేనికి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఐదు లేదా పది ఎకరాలను ఒకేసారి ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని నిలిపివేయాలేగానీ, 50 సెంట్లు, ఎకరం భూములను కూడా నిషేధ జాబితాలో కొనసాగించడం ఏమిటని పామర్రుకు చెందిన రైతు లక్ష్మణరావు ఆందోళన వ్యక్తంచేశారు. ’’అసైన్డ్ చట్టసవరణ సర్కారుకు ఇష్టమా? కాదా? ఏదో ఒకటి స్పష్టంగా చెప్పాలి. ఫ్రీ హోల్డ్ కొనసాగిస్తామనో లేక రద్దుచేస్తామనో చెప్పాలి. దీనిపై స్పష్టత ఇవ్వకుండా ఎంతకాలం రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తారు? అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేసుకున్నవారెవరో కనిపెట్టి చర్యలు తీసుకోవాలి. అంతేతప్ప చిన్న కమతాలున్న రైతులకు ఇబ్బంది కలిగేలా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం సరికాదు’’ అని రిటైర్డ్ అధికారి, రెవెన్యూ నిపుణుడు రామయ్య ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.
Updated Date - Dec 20 , 2024 | 05:15 AM