గుంటూరులో వైసీపీ నేత అరాచకం
ABN, Publish Date - Dec 03 , 2024 | 05:28 AM
తమ పార్టీ అధికారంలో ఉందన్న ధీమాతో ఓ వైసీపీ నేత అరాచకానికి పాల్పడ్డాడు. ఓ దుకాణం నిర్వాహకురాలిని బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆ క్రమంలో ఫొటోలు, వీడియోలు తీశాడు.
మహిళను బెదిరించి లొంగదీసుకున్న వైనం
నగ్న ఫొటోలు, వీడియోలతో బెదిరింపు
ప్రాణ భయంతో ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు
గుంటూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): తమ పార్టీ అధికారంలో ఉందన్న ధీమాతో ఓ వైసీపీ నేత అరాచకానికి పాల్పడ్డాడు. ఓ దుకాణం నిర్వాహకురాలిని బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆ క్రమంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటి ని చూపించి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. అక్కడితో ఆగకుండా ప్రతి రోజూ రూ.4,000 చొప్పున గత రెండేళ్లుగా వసూలు చేశాడు. తనకు అడ్డుగా ఉన్నాడని భావించి ఆమె భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. డబ్బులు ఇచ్చుకోలేని దుస్థితిలోకి జారిపోయిన ఆ మహిళపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. దెబ్బలు చూసి ప్రశ్నించిన భర్తకు, బాధితురాలు అసలు విషయాన్ని చెప్పింది. దాంతో వారిద్దరూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు పట్టించుకోలేదు. ప్రాణభయంతో బాధితులు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
దేవరకొండ దౌర్జన్యం తీరిది...
గుంటూరులోని ఓ కాలనీకి చెందిన మహిళ ఇంటికి సమీపంలో మెయిన్ రోడ్డు పక్కన తన భర్తతో కలిసి మరమరాల బట్టీ నిర్వహిస్తోంది. మరమరాలు కొనుగోలు నిమిత్తం గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు రెండేళ్ల క్రితం ఈ దుకాణానికి వచ్చాడు. షాపు నిర్వాహకురాలిపై కన్నేశాడు. మాటలు కలిపేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పందించలేదు. దీంతో దుకాణంలో వరుసగా మూడు దఫాలు దొంగతనం చేయించాడు. వైసీపీ నాయకులు అప్పిరెడ్డి, మద్దాలి గిరి తెలుసని, పోలీసులకు చెప్పి దొంగలను పట్టుకునేలా చేస్తానంటూ మాయమాటలు చెప్పాడు. ఫోన్ నంబరు తీసుకున్నాడు. పరిచయం పెంచుకొని లొంగదీసుకున్నాడు. ఆక్రమంలోనే ఆ మహిళ నగ్న ఫొటోలు, వీడియోలు తీశాడు. అవి దగ్గర పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌కు దిగాడు.
ప్రతి రోజూ రూ.4,000 చొప్పున ఇవ్వాలంటూ డిమాండ్ చేసి వసూలు చేశాడు. గత రెండేళ్లుగా బలవంతంగా శారీరక సంబంధం కొనసాగిస్తూ, డబ్బులు వసూలు చేశాడు. ఆమె భర్త తనకు అడ్డుగా ఉన్నాడని భావించి ఆయననూ అడ్డు తొలగించుకునేందుకు పథకం రూపొందించాడు. గత ఏడాది డిసెంబరు, ఈ ఏడాది ఏప్రిల్‌లో... రెండుసార్లు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో గత నెల 13న డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నాగేశ్వరరావు ఆ మహిళపై దాడి చేసి కొట్టాడు. దీంతో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. వాటిని గమనించిన భర్త ఎం జరిగిందంటూ ప్రశ్నించాడు.
దీంతో ఆమె వ్యవహరం మొత్తాన్నీ భర్తకు వివరించింది. విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు మరోసారి ఆ మహిళ భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబరు 23న నగరంపాలెం పోలీస్ ేస్టషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నాగేశ్వరరావు రెచ్చిపోయి బెదిరింపులకు దిగాడు. భయంతో వణికిపోయిన ఆ కుటుంబం తమకు రక్షణ కల్పించాలని, చట్ట ప్రకారం వైసీపీ నేత నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. వారి ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ కార్యాలయం అధికారులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలంటూ నగరంపాలెం సీఐను ఆదేశించారు.
Updated Date - Dec 03 , 2024 | 05:28 AM