YSRCP: పాపం వైసీపీ.. ఎగిరిపోతున్న రెక్కలు..
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:41 PM
ఫ్యాన్ గాలి మారింది. రెక్కలు ఒక్కొకటిగా ఎగిరిపోతున్నాయి. జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి ఉంది. అవకాశం వస్తే జారుకునేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు.
రాజమహేంద్రవరం, నవంబర్ 16: ఫ్యాన్ గాలి మారింది. రెక్కలు ఒక్కొకటిగా ఎగిరిపోతున్నాయి. జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి ఉంది. అవకాశం వస్తే జారుకునేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో జిల్లాలో వైసీపీ డీలా పడింది. ఎన్నికల తర్వాత అనేక మంది వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ జిల్లాలో చోటా మోటా నాయకులే కూటమి బాటపట్టారు. గురువారం ఏకంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, గత వైసీపీ ప్రయత్వంలో సలహాదారుగా వ్యవహరించిన ఎస్. రాజీస్ కృష్ణ టీడీపీలో చేరడంతో అంచనాలు తారుమారయ్యాయి. స్థానిక ఎన్నికలు వచ్చేలోపు వైసీపీ ఖాళీ అయిపోతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
వైసీపీ నుంచి క్యూ..
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైసీపీలో వివిధస్థాయిల్లో పనిచేసిన నేతలు తెలుగు దేశం, జనసేన, బీజేపీల్లో చేరడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో స్థానికంగా నెలకొన్న రాజకీయాల వల్ల కూటమిలో నేతలే అంగీకరించని పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ ఆయా నేతలు టచ్‌లో ఉన్నట్టు సమాచారం. కొవ్వూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కింగ్ మేకర్‌గా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే దివంగత పెండ్యాల కృష్ణబాబు అల్లుడైన ఎస్. రాజీవ్ కృష్ణ టీడీపీలో చేరడంతో ఇక వైసీపీ పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పార్టీ మారడంతో కార్యకర్తలు కూటమి వైపే చూస్తున్నారు. రాజమహేంద్రవరంలో 2014లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన బొమ్మన రాజ్ కుమార్ తనయుడు బొమ్మన జయకుమార్ కొద్ది నెలల కిందటే టీడీపీలో చేరడంతో పాటు జాంపేట కోఆపరేటివ్ ఆర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా కూడా ఎన్నికయ్యారు.
అంతకుముందు చల్లా శంకరరావు కూడా కూటమి మద్దతుతో ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ అయిన సంగతి తెలిసిందే. అనపర్తి నియోజకవర్గంలో పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలోనూ పార్టీ అంతంత మాత్రంగానే ఉంది. గోకవరం జడ్పీటీసీ దాసరి శ్రీరంగ అధికారికంగా టీడీపీలో చేరకపోయినప్పటికీ.. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతోనే కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. కోరుకొండ మండలంలోని కాపవరం సర్పంచ్ జాజుల రాము టీడీపీలో చేరారు. దేవరపల్లిలో వైసీపీ నేత మాధవరపు వెంకటేశ్వరరావు జనసేనలో చేరారు. పోతుల కనకరాజు జనసేనలో చేరారు. అదే బాటలో కొవ్వూరు, నిడదవోలు మునిసిపల్ చైర్మన్లు ఉన్నారు.
ఇంకా చాలా నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు టీడీపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నేతలు గాంభీర్యత ప్రదర్శిస్తున్నప్పటికీ వారికి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ఇంకా వైసీపీ గురించి మాట్లాడుతున్నారనే చర్చ కూడా మొదలైంది. వైసీపీ వైఖరికి విసిగిపోయిన ప్రజలు జగన్, వైసీపీకి ఇక భవిష్యత్ లేదనే వాదన చేస్తున్నారు. ఎన్నికల తర్వాత జిల్లా వ్యాప్తంగా కొందరు మౌనంగా ఉండిపోయారు. సుమారు ఐదు నెలల్లోనే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా ముందుకు వెళ్లడంతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. ఈ నేపధ్యంలో ఇక తమకు రాజకీయ భవిష్యత్ ఉండదనే కారణంతో పలువురు వైసీపీ నేతలు కూటమి వైపు చూస్తున్నారు. అయితే స్థానిక కూటమి నేతలు మాత్రం తమకు తెలియకుండా చేరికలు జరుగుతుండడంపై కినుక వహిస్తున్నారు. గత సంఘటనల నేపథ్యంలో సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
నిడదవోలులోనూ వైసీపీకి షాక్..
నిడదవోలు నియోజకవర్గంలోనూ వైసీపీకి షాక్ తగిలింది. నిడదవోలు మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సహా మరో తొమ్మిది మంది కౌన్సిలర్లు శుక్రవారం సాయంత్రం వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను వైసీపీ జిల్లా అధ్యకుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు పంపారు. వివిధ కారణాల వల్ల తామంతా వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని, తమ రాజీనామాను ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు. అయితే వీరు ఏ పార్టీలో చేరుతున్నది వెల్లడించలేదు. జనసేనలో చేరనున్నట్టు సమాచారం. నిడదవోలు 25వ వార్డు కౌన్సిలర్, మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, 4వ వార్డు కౌన్సిలర్ మునిసిపల్ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, 3,7,9,10,11,18,23,24,28 వార్డుల కౌన్సిలర్లు వరుసగా ఎమ్.డి. షాజీరాబేగం, ముంగంటి మాణిక్య మాల, ఉసూరుమర్తి జాన్ బాబు, ఆరుగొల్లు వెంకటేశ్వర్లు, చిలకల శారదా దేవి, సైదు చంద్ర శేఖర్, మద్దిపాటి నాగశ్రీ, మానుపాటి లక్ష్మి, ఆకుల ముకుందరావు తమ రాజీనామా లేఖలను జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల కృష్ణకు పంపారు. వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు విధానాలతో గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న మునిసిపల్ చైర్మన్, మరి కొందరు కౌన్సిలర్లు వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆంధ్రజ్యోతి ముందే కథనం ప్రచురించింది. ఇప్పుడు అదే నిజమైంది. మునిసిపల్ పాలకవర్గం వైసీపీని వీడడంలో జనసేన నాయకుడు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. త్వరలోనే మిగిలిన వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది.
కౌన్సిల్లో తగ్గిన వైసీపీ బలం..
నిడదవోలు పురపాలక సంఘానికి 2021లో ఎన్నికలు జరగ్గా 27 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు, ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ప్రస్తుతం కౌన్సిల్లో 27 మంది సభ్యులు ఉంటే.. వైసీపీలో నేడు 11 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయడంతో 18 మందికి వైసీపీ బలం పడిపోయింది. త్వరలో మరికొంతమంది వైసీపీ కొన్సిలర్లు రాజీనామా బాట పట్టనుండడంతో అతి త్వరలోనే నిడదవోలు మునిసిపల్ కౌన్సిల్ జనసేన పార్టీ కైవసం చేసుకోనుంది.
Also Read:
కొండెక్కిన ధరలు.. ఆందోళనలో సామాన్యులు
చలి కాలంలో ఈ తప్పులు చేయకండి..
జగన్ పెట్టిన బాధలకు సూసైడ్ చేసుకోవాలనుకున్నా
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Nov 16 , 2024 | 01:41 PM