Share News

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్షల్లో ఫ్రెషర్ల నియామకానికి కంపెనీలు రెడీ

ABN , Publish Date - Aug 21 , 2024 | 03:33 PM

ఓ వైపు ఐటీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్న వేళ.. కంపెనీల యాజమాన్యాలు భారీగా ఫ్రెషర్లను నియమించుకోవడానికి రెడీ అవుతున్నాయి. దేశంలోని 72 శాతం మంది యజమానులు 2024 చివరిలో ఫ్రెషర్‌లను నియమించుకోవాలని భావిస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది.

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. లక్షల్లో ఫ్రెషర్ల నియామకానికి కంపెనీలు రెడీ

ఢిల్లీ: ఓ వైపు ఐటీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్న వేళ.. కంపెనీల యాజమాన్యాలు భారీగా ఫ్రెషర్లను నియమించుకోవడానికి రెడీ అవుతున్నాయి. దేశంలోని 72 శాతం మంది యజమానులు 2024 చివరిలో ఫ్రెషర్‌లను నియమించుకోవాలని భావిస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది. టీమ్‌లీజ్ ఎడ్‌టెక్(TeamLease EdTech) ఇందుకు సంబంధించిన రిపోర్ట్‌ని బుధవారం విడుదల చేసింది.

ఈ సంస్థ దేశవ్యాప్తంగా 603 కంపెనీలపై సమగ్ర సర్వే నిర్వహించింది. గతేడాదితో పోల్చితే నియామక వృద్ధి 4 శాతం పెరిగింది. 2023లో ఇదే సమయంతో పోల్చితే 7 శాతం పెరిగిందని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ నివేదిక తెలిపింది. "నియామకాలు పెరగడం ఫ్రెషర్లకు శుభవార్తే అని చెప్పుకోవచ్చు. యజమానులకు పెరుగుతున్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. శ్రామిక లోకం ప్రతిభకు విలువైన అవకాశాలను అందిస్తుంది" అని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ అన్నారు.


తగ్గిన నిరుద్యోగిత రేటు..

నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) డేటా ప్రకారం భారతదేశ నిరుద్యోగిత రేటు 3.1 శాతానికి తగ్గింది. అయితే ఉపాధి కోరుకునే గ్రాడ్యుయేట్‌ ఫ్రెషర్‌ల సంఖ్య పెరుగుతోంది. ఈ-కామర్స్, టెక్ స్టార్టప్‌లు, ఇంజినీరింగ్, మౌలిక సదుపాయాలు, రిటైల్ వంటి పరిశ్రమలు ఫ్రెషర్ హైరింగ్‌లో ముందున్నాయని నివేదిక పేర్కొంది. ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలు కలిగిన సంస్థలు అత్యధికంగా(74 శాతం) బెంగళూరులో ఉన్నాయి. ముంబై 60 శాతం, చెన్నై 54 శాతంతో రెండు, మూడో స్థానంలో నిలిచాయి. ఫుల్ స్టాక్ డెవలపర్‌లు, SEO ఎగ్జిక్యూటివ్‌లు, డిజిటల్ సేల్స్ అసోసియేట్‌లు, UI/UX డిజైనర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్‌లో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను కంపెనీలు ఎక్కువగా కోరుకుంటున్నాయి.

సమయం వృథా చేయకుండా నిరుద్యోగులు నిరంతరం నేర్చుకోవడం అవసరం అని రూజ్ చెప్పారు. నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి.. సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది కంపెనీ యజమానులు.. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారితో పాఠాలు చెప్పిస్తూ.. విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని, 62 శాతం మంది విద్యా సంస్థలకు, పరిశ్రమలకు నేరుగా టైఅప్ ఉండాలని సూచించారు.

For Latest News and Telangana News click here

Updated Date - Aug 21 , 2024 | 03:33 PM