NPCI: యూపీఐ చెల్లింపుల కోసం.. ఆ దేశానికి సాయం చేయనున్న భారత్
ABN, Publish Date - May 03 , 2024 | 11:32 AM
దేశంలో యూపీఐ చెల్లింపులు ప్రారంభమయ్యాక.. నగదురహిత లావాదేవీలు రూ.లక్షల కోట్లకు చేరుకున్నాయి. చిల్లర ఇబ్బందులను దూరం చేసిన యూపీఐ అనథి కాలంలోనే మారుమూల గ్రామాల్లోకి చేరుకుంది.
ఢిల్లీ: దేశంలో యూపీఐ చెల్లింపులు(UPI Payments) ప్రారంభమయ్యాక.. నగదురహిత లావాదేవీలు రూ.లక్షల కోట్లకు చేరుకున్నాయి. చిల్లర ఇబ్బందులను దూరం చేసిన యూపీఐ అనథి కాలంలోనే మారుమూల గ్రామాల్లోకి చేరుకుంది. ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఎంతటి మొత్తాన్నైనా ఫోన్ పే, గూగుల్, పే, పేటీఎం అంటూ చెల్లిస్తున్నారు వినియోగదారులు. భారత్‌లో చెల్లింపుల విధానాన్ని సులభతరం చేసిన యూపీఐపైన ఓ దేశానికి ఆసక్తి కలిగింది.
తమ దేశంలో సైతం అలాంటి చెల్లింపు వ్యవస్థ ఉండాలని కోరుకుంటోంది. ఈ క్రమంలో భారత్‌ని ఆ దేశ అధికారులు సంప్రదించారు. ఆర్బీఐ ఆమోదంతో ఎన్పీసీఐ ఇటీవల ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్(NIPL)ని ప్రారంభించింది. నమీబియాలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ లాంటి ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్‌ని అభివృద్ధి చేయడానికి బ్యాంక్ ఆఫ్ నమీబియా (BoN)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు NIPL గురువారం తెలిపింది.
UPI సాంకేతికత, అనుభవాన్ని ఉపయోగించుకుని నమీబియా ఆర్థిక పర్యావరణ వ్యవస్థను ఆధునీకరించడం ఇరుదేశాల భాగస్వామ్య ముఖ్య లక్ష్యం. యాక్సెసిబిలిటీ, స్థోమత, దేశీయ, అంతర్జాతీయ చెల్లింపు నెట్‌వర్క్‌లతో కనెక్టివిటీ, ఇంటర్‌ఆపరేటబిలిటీని మెరుగుపరిచే లక్ష్యంతో ఇరు దేశాలు పని చేయనున్నాయి.
"యూపీఐ టెక్నాలజీని నమీబియాలో ప్రారంభించడం ద్వారా ఆ దేశం డిజిటల్ చెల్లింపుల్లో దూసుకెళ్తుంది. తక్కువ జనాభా కలిగిన నమీబియాలో యూపీఐ చక్కగా ఉపయోగపడుతుంది" అని ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ సీఈవో రితేష్ శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. BoNతో తమ సహకారం డిజిటల్ ఆర్థిక సేవలను మెరుగుపరచడం, భారత్‌లో రియల్ టైమ్ పర్సన్-టు-పర్సన్ (P2P),మర్చంట్ చెల్లింపు లావాదేవీలను (P2M) సులభతరం చేస్తుందని ఎన్పీసీఐ ప్రకటించింది. నమీబియాలో యూపీఐలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేస్తామని వెల్లడించింది.
ఒక్క శాతం తగ్గిన లావాదేవీలు..
ఇదిలా ఉండగా.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల ప్రకటించిన నివేదిక ప్రకారం.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల సంఖ్య నెలవారీ ప్రాతిపదికన ఒక్క శాతం తగ్గింది. మార్చిలో రూ.1,344 కోట్ల నుంచి ఏప్రిల్‌లో రూ.1,330 కోట్లకు పడిపోయింది. అయితే ఏడాది ప్రాతిపదికన లావాదేవీల సంఖ్య 50 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో లావాదేవీల పరిమాణం రూ.19.64 లక్షల కోట్లుగా ఉంది. మార్చిలో రూ.19.78 లక్షల కోట్లకు పెరిగిందని ఎన్పీసీఐ గణాంకాలు చెబుతున్నాయి.
For Latest News and Business News click here
Updated Date - May 03 , 2024 | 11:38 AM