Paytm: ``భయపడకండి.. పరిస్థితి చక్కబడుతుంది``.. ఉద్యోగులకు పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మ భరోసా!
ABN , Publish Date - Feb 05 , 2024 | 09:28 PM
ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం ఉద్యోగులతో ఆ సంస్థ బాస్ విజయ్ శేఖర్ శర్మ భేటీ అయ్యారు.
పేటీఎం (Paytm) సంక్షోభం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ ఆ సంస్థ ఉద్యోగులతో సీఈవో విజయ్ శేఖర్ శర్మ (Vijay Shekhar Sharma) భేటీ అయ్యారు. ఒక్కరిని కూడా ఉద్యోగం నుంచి తొలగించే ఆలోచన తమకు లేదని ఉద్యోగుల్లో భరోసా నింపారు. త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయని, చాలా బ్యాంకులు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆర్బీఐ (RBI) తో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు (Paytm Crisis).
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank)పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో భవిష్యత్‌పై ఉద్యోగులు, ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వర్చువల్ టౌన్ హాల్ మీటింగ్‌లో దాదాపు 900 మంది ఉద్యోగులతో విజయ్ శేఖర్ శర్మ గంటకు పైగా భేటీ అయ్యారు. ``అసలు ఏం జరిగిందనేది దాని మీద పూర్తి సమచారం లేదు. కానీ, త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయి. చాలా బ్యాంకులు మనకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆర్బీఐతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. మీరందరూ పేటీఎమ్ కుటుంబం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేద``ని విజయ్ శేఖర్ శర్మ అన్నారు.
పేటీఎం వ్యాలెట్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అక్రమ నగదు లావాదేవీలు, రూ.వందల కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 29 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్.. కొత్త డిపాజిట్ల స్వీకరణ, రుణ లావాదేవీలు, టాప్-అప్స్ నిలిపివేయాలని ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, పేటీఎం వినియోగదారులకు సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎస్బీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.