Petrol Prices: ఆయిల్ కంపెనీల కీలక నిర్ణయం.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధర
ABN, Publish Date - Oct 30 , 2024 | 07:07 AM
పెట్రోల్, డీజిల్ ధరలు కొన్నాళ్లుగా అలాగే స్థిరంగా ఉంటున్నాయి. ఎలాంటి తగ్గుదల నమోదు కాలేదు. అయితే ధన త్రయోదశి సందర్భంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కీలకమైన ప్రకటన చేశాయి. పెట్రోల్ పంప్ డీలర్‌లకు చెల్లించే డీలర్ కమిషన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు కొన్నాళ్లుగా అలాగే స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి సవరణలు జరగలేదు. అయితే ధన త్రయోదశి సందర్భంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కీలకమైన ప్రకటన చేశాయి. పెట్రోల్ పంప్ డీలర్‌లకు చెల్లించే డీలర్ కమిషన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ నిర్ణయంతో దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న ఇంధన వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఆయిల్ రవాణాకు సంబంధించిన అంతర్-రాష్ట్ర ఛార్జీలను కంపెనీలు హేతుబద్ధీకరించాయి.
అంతర్-రాష్ట్ర రవాణా ఛార్జీలను హేతుబద్ధీకరించడంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. విక్రయించే ప్రాంతాన్ని బట్టి డీలర్ కమీషన్లు మారుతూ ఉంటాయి. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ప్రస్తుతం డీలర్‌లకు కిలోలీటర్‌కు రూ.1,868.14 ఛార్జీ, కమీషన్‌గా 0.875 శాతం చెల్లిస్తున్నారు. ఇక డీజిల్ విషయానికి వస్తే కిలోలీటర్‌కు రూ.1389.35 రవాణా ఛార్జీ, 0.28 శాతం కమీషన్‌గా అందిస్తున్నారు.
స్వాగతించిన కేంద్రం
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటనను కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఎక్స్ వేదికగా స్పందించారు. “పెట్రోల్ పంప్ డీలర్‌లకు చెల్లించాల్సిన డీలర్ కమిషన్‌ను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చేసిన ప్రకటనను నేను స్వాగతిస్తున్నాను. మారుమూల ప్రాంతాలలో (ఆయిల్ కంపెనీల పెట్రోలు, డీజిల్ డిపోలకు దూరంగా) వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా అంతర్-రాష్ట్ర సరుకు రవాణా ఛార్జీలను హేతుబద్ధీకరిస్తూ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. దేశంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలలో తగ్గుదలకు దోహదపడుతుంది’’ అని రాసుకొచ్చారు. కాగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, నియోజకవర్గాలలో ఈ నిర్ణయాన్ని తర్వాత అమలు చేస్తాయని ఆయన చెప్పారు.
ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఉన్న కూనన్‌పల్లి, కలిమెల ప్రాంతాలను హర్దీప్ సింగ్ పూరీ ఉదాహరణను చెప్పారు. ఇక్కడ పెట్రోల్ ధర వరుసగా రూ. 4.69, రూ.4.55 చొప్పున తగ్గుతుంది. డీజిల్ ధరలు వరుసగా రూ.4.45, రూ.4.32 చొప్పున తగ్గుతాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో పెట్రోల్ ధర రూ.2.09, డీజిల్ రూ.2.02 మేర తగ్గనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీజాపూర్, బైలాడిలా, కాటేకల్యాణ్, బచేలి, దంతేవాడలో కూడా రేట్లు దిగివస్తాయి. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరం రాష్ట్రాలలోని అనేక చోట్ల ధరలు తగ్గుతాయని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు.
డీలర్ కమీషన్ పెంపుతో దేశంలోని ఇంధన రిటైల్ అవుట్‌లెట్‌లను ప్రతిరోజూ సందర్శించే సుమారు 7 కోట్ల మంది పౌరులు ప్రయోజనం పొందుతారని అన్నారు. ఇంధన ధరలు పెరగకుండా మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. గత 7 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చడంతో దేశవ్యాప్తంగా 83,000 పెట్రోల్ పంపుల్లో పనిచేస్తున్న పెట్రోల్ పంప్ డీలర్లు, సుమారు 10 లక్షల మంది సిబ్బంది జీవితాల్లో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయని అన్నారు. అయితే ఏపీ, తెలంగాణలోని ఏయే ప్రాంతాల్లో ఈ నిర్ణయం ప్రభావం ఉంటుందో తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
న్యూక్లియర్ డ్రిల్ మొదలు పెట్టిన రష్యా.. ఏం జరగబోతోంది
ఇరాన్‌కు సంచలన వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్.. టెన్షన్ టెన్షన్
పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు.. కారణం ఎందుకంటే..
నవంబర్‌లో బ్యాంకులకు చాలా హాలిడేస్.. ఎప్పుడెప్పుడంటే
For more Business News and Telugu News
Updated Date - Oct 30 , 2024 | 01:37 PM