Paytm Crisis: సంక్షోభంలో పేటీఎమ్.. పండగ చేసుకుంటున్న ఫోన్ పే, గూగుల్ పే!
ABN , Publish Date - Feb 06 , 2024 | 07:29 PM
పేటీఎం సంక్షోభంలో చిక్కుకుపోయిన నేపథ్యంలో వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యాప్‌ల డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయట.
గత కొన్ని రోజులుగా పేటీఎం (Paytm) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై (Paytm Payments Bank) ఆర్బీఐ (RBI) ఆంక్షలు విధించిన నేపథ్యంలో పేటీఎం సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో ఫోన్ పే (Phone Pe), గూగుల్ పే (Google Pay), భీమ్ (BHIM) యాప్‌ల డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయట. ఒక్క ఫిబ్రవరి మూడో తేదీనే ఫోన్ పేను 2.79 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారట. అలాగే గూగుల్ పే, భీమ్ యాప్‌ల డౌన్‌లోడ్లు కూడా చెప్పుకోదగిన స్థాయిలో పెరిగాయట.
ముఖ్యంగా అంతకు ముందు వారంతో పోలిస్తే ఫిబ్రవరి మొదటి వారంలో ఫోన్ పేను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య ఏకంగా 45 శాతం పెరిగిందట. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 మధ్య ఫోన్ పేను 10.4 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారట. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఆప్ స్టోర్‌లలో డౌన్‌లోడ్స్ పరంగా ఫోన్ పే అగ్రస్థానానికి చేరుకుందట. యాప్ ఫిగర్స్ సంస్థ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్లే స్టోర్‌లో జనవరి 31నాటికి ఫోన్ పే యాప్ 188వ స్థానంలో ఉండగా.. ఫిబ్రవరి ఐదో తేదీకి ఏకంగా 33వ స్థానానికి చేరుకుందట. ఇక, ఆపిల్ ఆప్ స్టోర్‌లో జనవరి 31నాటికి 227వ స్థానంలో ఉండగా.. ఫిబ్రవరి ఐదో తేదీకి 72వ స్థానానికి చేరుకుందట.
ఫోన్ పే మాత్రమే కాదు.. భీమ్ యాప్ డౌన్‌లోడ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ వారంలో భీమ్ యాప్ డౌన్‌లోడ్స్ సంఖ్య ఏకంగా 50 శాతం పెరిగిందట. జనవరి 31-ఫిబ్రవరి 5 మధ్య 5.9 లక్షల మంది భీమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారట. గూగుల్ పే యాప్‌ను జనవరి 31-ఫిబ్రవరి 3 మధ్య 3.95 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారట. అలాగే పేటీఎం డౌన్‌లోడ్స్ శాతం భారీగా పడిపోయింది.