Share News

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్‌బీఐ కొరడా

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:39 AM

ఐటీ మౌలిక సదుపాయాలపై సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేకపోతే ఎంతటి పెద్ద బ్యాంకునైనా ఉపేక్షించేది లేదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) స్పష్టం చేస్తోంది. ఈ రెండు కారణాలతో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం...

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్‌బీఐ కొరడా

కొత్త క్రెడిట్‌ కార్డుల జారీపై నిషేధం.. కొత్త కస్టమర్ల చేరికలపైనా వేటు

ఐటీ మౌలిక సదుపాయాలపై సరైన పర్యవేక్షణ లేకపోవటంతో చర్యలు

ముంబై: ఐటీ మౌలిక సదుపాయాలపై సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేకపోతే ఎంతటి పెద్ద బ్యాంకునైనా ఉపేక్షించేది లేదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) స్పష్టం చేస్తోంది. ఈ రెండు కారణాలతో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (కేఎంబీ) కొత్త క్రెడిట్‌ కార్డులు జారీ చేయకుండా నిషేధం విధించింది. అంతేకాకుండా ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ వంటి డిజిటల్‌ చానల్స్‌ ద్వారా బ్యాంక్‌ కొత్త ఖాతాదారులను చేర్చుకోకుండా వేటు వేసింది. బ్యాంక్‌ ఐటీ మౌలిక వ్యవస్థలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, బ్యాంక్‌ వృద్ధి రేటు కు అనుగుణంగా నియంత్రణలు లేకపోవడంతో ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని ఆర్‌బీఐ తెలిపింది. గత రెండేళ్లుగా (2022, 2023) తాము జరిపిన పరిశీలనలో ఈ విషయం తేలినట్టు తెలిపింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.


అయితే ఈ నిషేధం బ్యాంక్‌ ప్రస్తుత ఖాతాదారులు, క్రెడిట్‌ కార్డుదారులపై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. బ్యాంకు వారికి యథావిధిగా తన సేవలు అందించవచ్చని స్పష్టం చేసింది. కాగా 2020 డిసెంబరులో ఇదే తరహా కారణాలతో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ కొత్త క్రెడిట్‌ కార్డులు జారీ చేయకుండా, కొత్త డిజిటల్‌ సేవలు అందుబాటులోకి తీసుకురాకుండా ఆర్‌బీఐ నిషేధం విధించింది. అనంతరం నిబంధనలకు అనుగుణంగా బ్యాంక్‌ చర్యలు తీసుకోవటంతో 2022 మార్చిలో ఆర్‌బీఐ ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.

బ్యాంకుపై ప్రభావం

ప్రస్తుత ఖాతాదారులు, క్రెడిట్‌ కార్డుదారులపై ఎలాంటి ప్రభావం లేకపోయినా.. ఆన్‌లైన్‌ లేదా మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కొత్త ఖాతాదారులను చేర్చుకోవడంపై ఆర్‌బీఐ నిషేధం తీవ్ర ప్రభావం చూపనుంది. కొత్త క్రెడిట్‌ కార్డుల జారీనీ ఆర్‌బీఐ నిషేధించడంతో ఆ ప్రభావమూ బ్యాంక్‌పై తీవ్రంగానే ఉంటుందని నిపుణుల అంచనా. వ్యాపార విస్తరణలో భాగంగా బ్యాంక్‌ ఇటీవల ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ చానల్స్‌ ద్వారా పెద్దఎత్తున కొత్త ఖాతాదారులను చేర్చుకుంటోంది. క్రెడిట్‌ కార్డుల మార్కెట్లోనూ బ్యాంక్‌ ఇటీవల ఎస్‌బీఐ కార్డ్స్‌, హెచ్‌డీఎ్‌ఫసీ వంటి ప్రధాన బ్యాంకులతో పోటీపడుతోంది. ఆర్‌బీఐ తాజా నిషేధంతో ఈ ప్రయత్నాలకు బ్రేక్‌ పడనుంది.

దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాం

మరోవైపు బ్యాంక్‌ ఐటీ సిస్టమ్స్‌ను బలోపేతం చేసేందుకు అవసరమైన కొత్త టెక్నాలజీలను తీసుకువచ్చేందుకు అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నట్లు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆర్‌బీఐతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది.


లోపాలు ఇవే..

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో ఐటీ రిస్క్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ గవర్నెన్స్‌ విధానాలు తమ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని ఆర్‌బీఐ తెలిపింది. దీంతో బ్యాంక్‌ ఐటీ ఇన్వెంటరీ నిర్వహణ, ప్యాచ్‌ అండ్‌ చేంజ్‌ నిర్వహణ, యూజర్‌ యాక్సెస్‌ నిర్వహణ, వెండర్‌ రిస్క్‌ నిర్వహణ, డేటా సెక్యూరిటీ, డేటా లీక్‌ ప్రివెన్షన్‌ స్ట్రాటజీ, బిజినెస్‌ కంటిన్యుటీ, డిజాస్టర్‌ రికవరీ విధానాలు కూడా లోపభూయిష్టంగా ఉన్నట్టు తమ పరిశీలనలో తేలినట్టు ప్రకటించింది. ఈ లోపాల కట్టడి కోసం బ్యాంక్‌ తీసుకున్న చర్యలు కూడా లోపభూయిష్టంగా ఉండడం వల్లే ఈ కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చినట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ లోపాల కారణంగానే కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌ (సీబీఎస్‌), ఆన్‌లైన్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌ చానల్స్‌ గత రెండేళ్లుగా తరచూ సమస్యలకు లోనవుతున్నట్టు తెలిపింది. ఈ నెల 15న బ్యాంక్‌ సేవల అంతరాయానికీ ఇదే కారణమని పేర్కొంది. బ్యాంక్‌ తమకు సంతృప్తి కలిగించేలా ఈ లోపాలను సరిదిద్దుకున్న వెంటనే ఈ నిషేధం ఎత్తివేస్తామని తెలిపింది.

Updated Date - Apr 25 , 2024 | 05:40 AM