Kirana Shops: దేశంలో రెండు లక్షల కిరాణా షాపులు బంద్.. షాకింగ్ ఫాక్ట్..
ABN, Publish Date - Nov 02 , 2024 | 10:44 AM
దేశంలో ఇటివల ఇంట్రి ఇచ్చిన క్విక్ కామర్స్ సంస్థలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. బిస్కెట్ ప్యాకెట్, పాల నుంచి మొదలుకుని ఏది కావాలన్నా కూడా అనేక మంది ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. అయితే వీటి కారణంగా దేశంలోని అనేక కిరాణా షాపులు మూతపడ్డాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
దేశంలో ఆన్‌లైన్ కొనుగోళ్ల సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. చిప్స్ ప్యాకెట్, చాక్లెట్ నుంచి మొదలుకుని ఏ వస్తువు కావాలన్నా కూడా అనేక మంది ఆన్‌లైన్ సేల్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఇటివల మార్కెట్లోకి వచ్చిన క్విక్ కామర్స్ సంస్థలు జెప్టో, బ్లింకిట్ వంటి కంపెనీలు 10 నిమిషాల్లోనే వారి గిడ్డంగుల నుంచి ఆయా వస్తువలను కస్టమర్ల ఇంటికి తెచ్చి డెలివరీ చేస్తున్నాయి. దీంతో అనేక మంది ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి తోడు పలురకాల ఆఫర్ల పేరుతో కస్టమర్లకు తక్కువ ధరకు ఉత్పత్తులను ఇస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా నగరాల్లోని జనాలు వీటివైపే చూస్తున్నారు.
ఆన్‌లైన్ సేల్స్ కారణంగా..
ఈ ఆన్‌లైన్ విక్రయాల ప్రభావం కాస్తా సూపర్‌మార్కెట్లు, కిరాణా షాపులపై పడింది. దీంతో గత కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయి. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ (AICPDF) ఈ నివేదికను ప్రకటించడం విశేషం. క్విక్ కామర్స్ వ్యాపారం వేగంగా వృద్ధి చెందడం వల్ల సుమారు 2 లక్షల కిరాణా షాపులు బంద్ అయినట్లు ప్రకటించారు. ఈ వృద్ధి ప్రధానంగా మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో అత్యధిక ప్రభావాన్ని చూపిచింది. ఆ తర్వాత టైర్-1 నగరాల్లో (30 శాతం), టైర్ 2, 3 నగరాల్లో (25 శాతం) కిరాణా దుకాణాలు మూసివేయబడ్డాయి.
దేశంలో మొత్తం
నివేదిక ప్రకారం మెట్రోలలో నెలవారీ సగటు టర్నోవర్ రూ. 5.5 లక్షలతో 17 లక్షల దుకాణాలు ఉన్నాయి. వాటిలో 45% మూతపడ్డాయి. సగటు నెలవారీ టర్నోవర్ రూ. 3.5 లక్షలతో 12 లక్షల దుకాణాలు ఉన్న టైర్-1 నగరాల్లో 30% దుకాణాలు మూతపడగా, టైర్-2 నగరాల్లో 25% షాపులు బంద్ అయ్యాయి. దేశంలో మొత్తం 1.3 కోట్ల కిరాణా షాపులున్నాయి. వీటిలో టైర్ 1 నగరాల్లో అంటే పెద్ద నగరాల్లో 12 లక్షల దుకాణాలు ఉండగా, టైర్-2, టైర్-3 నగరాల్లో కోటి కిరాణా షాపులున్నాయి.
డిస్కౌంట్ల పేరుతో
సూపర్ మార్కెట్‌లతో పోటీపడే కిరాణా షాపులు ఇప్పుడు ఈ కామర్స్ కంపెనీల కారణంగా ముప్పును పొంచి ఉన్నాయని డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధైరశాలి పాటిల్ అన్నారు. తగ్గింపు ధరలకు వస్తువులను విక్రయిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్న ఆన్‌లైన్ వాణిజ్య సంస్థలు కిరాణా షాపుల వినియోగదారులను కొల్లగొడుతున్నాయని వెల్లడించారు. 40 నుంచి 60 శాతం వరకు తగ్గింపులతో వస్తువులను విక్రయించడం ఏ కంపెనీకి వాస్తవికమైనది లేదా స్థిరమైనది కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ సంస్థల చట్టవిరుద్ధ ధరలపై విచారణ జరిపించాలని పాటిల్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఈ నేపథ్యంలో వేగంగా మూతపడుతున్న కిరాణా షాపులను కాపాడాలని ఏఐసీపీడీఎఫ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియాకు రాసిన లేఖలో ఇ-కామర్స్, క్విక్ కామర్స్ భారీ తగ్గింపు గురించి అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధరలపై దర్యాప్తు చేయాలని సీసీఐని కోరింది. పలు FMCG సంస్థలు ఈ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రస్తావించింది. ఈ క్రమంలో క్విక్ కామర్స్ సంస్థల విస్తరణను అడ్డుకోకపోతే కిరాణా షాపులను కాపాడుకోవడం కష్టమన్నారు. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు. నష్టపోతున్న వ్యాపారస్తులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
Mukesh Ambani: ఆ దేశం అప్పులను తీర్చేందుకు ముఖేష్ అంబానీ బిగ్ ప్లాన్.. ఎలాగంటే..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Read More Business News and Latest Telugu News
Updated Date - Nov 02 , 2024 | 10:46 AM