ATM: ఏటీఎంలలో చోరీలకు పాల్పడే గజదొంగ అరెస్టు
ABN, Publish Date - Mar 30 , 2024 | 11:43 AM
ఏటీఎం కేంద్రాల్లో చోరీలకు పాల్పడే గజదొంగ తంబిరాజ్‌ను కోయంబత్తూరు క్రైం పోలీసులు(Coimbatore Crime Police) అరెస్టు చేశారు. తంబిరాజ్‌పై రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ చోరీ కేసులున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది.
చెన్నై: ఏటీఎం కేంద్రాల్లో చోరీలకు పాల్పడే గజదొంగ తంబిరాజ్‌ను కోయంబత్తూరు క్రైం పోలీసులు(Coimbatore Crime Police) అరెస్టు చేశారు. తంబిరాజ్‌పై రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ చోరీ కేసులున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. తేని జిల్లా బోడినాయకనూరు సమీపం జక్కమ్మనాయకన్‌పట్టి ప్రాంతానికి చెందిన తంబిరాజ్ ఏటీఎం కేంద్రాల వద్ద డబ్బులు డ్రాజేసేందుకు వచ్చేవారికి ఏటీఎం నుంచి సక్రమంగా డబ్బులు డ్రాచేసి ఇస్తానంటూ చెప్పి వారిచ్చే ఏటీఎం కార్డులు ఉపయోగించి చాకచక్యంగా నగదు అపహరించేవాడు. ఏటీఎం కార్డులు దారుడు తాము చెప్పిన దానికంటే అధికంగా డబ్బు ఖాతా నుండి డ్రా అయినట్లు తెలుసుకుని దిగ్ర్భాంతి చెందేవారు. ఇలా తంబిరాజ్ నాలుగు రాష్ట్రాలలోనూ చోరీలకు పాల్పడి పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతుండేవాడు. ఇటీవల ఓ ఏటీఎం కేంద్రం వద్ద చోరీచేస్తున్న తంబిరాజ్‌కు సంబంధించిన వీడియో ఓ సీసీ కెమెరా ద్వారా పోలీసులకు లభ్యమైంది. కోయంబత్తూరు క్రైం విభాగం పోలీసులు ఆ వీడియో ఆధారంగా తంబిరాజ్‌ను గుర్తించారు. రెండు రోజుల క్రితం తంబిరాజ్ స్వస్థలానికి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం అతడి ఇంటి వద్దకు వెళ్ళి అరెస్టు చేశారు.
Updated Date - Mar 30 , 2024 | 11:43 AM