Hyderabad: అతివేగం.. నిర్లక్ష్యం.. మద్యం మత్తు.. ప్రమాదాలకు కారణాలివే..
ABN, Publish Date - Feb 24 , 2024 | 11:44 AM
మద్యం మత్తు, అతివేగం, నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా రోడ్డు ప్రమాదాల బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
- రోడ్డున పడుతున్న కుటుంబాలు
- రెండేళ్లలో ట్రై కమిషనరేట్‌లలో 3,441 మంది మృతి
హైదరాబాద్ సిటీ: మద్యం మత్తు, అతివేగం, నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా రోడ్డు ప్రమాదాల బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని వేల మంది క్షతగాత్రులు దివ్యాంగులుగా మారి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీసులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాహనదారుల్లో మార్పు రావడంలేదు. పోలీస్ ఉన్నతాధికారులు రహదారి భద్రతకు పెద్దపీట వేస్తున్నామని ప్రకటిస్తున్నా.. ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదు. దానికి తోడు వాహనదారుల నిర్లక్ష్యపు డ్రైవింగ్ అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. శుక్రవారం తెల్లవారుజామున పటాన్‌చెరు సమీపంలో ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డుప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(Cantonment MLA Lasya Nandita) దుర్మరణం చెందడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారు నడుపుతున్న ఆమె పీఏ ఆకాశ్ నిద్రమత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపినందువల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
రెండేళ్లలో 3,441 మంది మృత్యువాత..
గత రెండేళ్లలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 17,699 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 3,441 మంది మృతి చెందారు. 16,807 మంది గాయాలపాలయ్యారు. వారిలో వందలాది మంది దివ్యాంగులుగా మారి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అధిక శాతం ప్రమాదాలు డ్రంకెన్ డ్రైవింగ్, అతివేగం, మైనర్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల జరిగినట్లు పోలీసులు తేల్చారు.
ఓఆర్‌ఆర్‌పై నిర్లక్ష్యం..
నగర రోడ్లపై ట్రాఫిక్‌తో విసిగిపోయిన కొంతమంది వాహనదారులు ఓఆర్‌ఆర్ ఎక్కగానే డ్రైవింగ్‌లో తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అతిపెద్ద రోడ్లు విశాలంగా ఉండటం, ట్రాఫిక్ సమస్య అసలే లేకపోవడంతో ఓవర్ స్పీడుతో దూసుకుపోతున్నారు. లారీలు, భారీ వాహనాల డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపి ఉంచడం వాహనదారుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. రోడ్లపై లైటింగ్ సరిగా విస్తరించకపోవడంతో ఆగి ఉన్న వాహనాలను గుర్తించకలేక ఢీ కొంటున్నాయి. దాంతో జాతీయ రహదారులు, ఓఆర్‌ఆర్ సహా చాలా రోడ్లు రక్తమోడుతున్నాయి. వాహనాలు ఏదైనా మరమ్మతులకు గురైనప్పుడు లేక ఇతర అవసరాల కోసమైనా రోడ్డు మీద నిలిపేటప్పుడు చాలా మంది డ్రైవర్లు తగిన జాగ్రత్తలు పాటించడంలేదు. వెనకాల వచ్చే వాహనాలు గుర్తించేలా ఎల్లో సిగ్నల్స్‌ను, రెడ్ రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయడంలేదు. కనీసం ఆగిపోయిన వాహనాన్ని గుర్తించేలా చెట్లకొమ్మలు కూడా ఏర్పాటు చేయడంలేదు. దాంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాహనం కింద పడుకొని కొంతమంది మెకానిక్‌లు, డ్రైవర్లు మరమ్మతు పనులు చేస్తుంటారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు వారుసైతం మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా రాచకొండ, సైబరాబాద్ ఉన్నతాధికారులు స్పందించి ఓఆర్‌ఆర్, జాతీయ రహదారుల పైన, ఓఆర్‌ఆర్ నుంచి కనెక్టివిటీ ఉన్న రోడ్ల చుట్టుపక్కల లారీలు, భారీ వాహనాలు నిలుపకుండా చూడాల్సిన అవసరముంది.
Updated Date - Feb 24 , 2024 | 11:44 AM