Viral News: సినిమాని మించిన త్రిల్లర్.. 300 కోట్ల కోసం మహిళ పెద్ద స్కెచ్.. ఫైనల్‌గా పెద్ద ట్విస్ట్
ABN, Publish Date - Jun 07 , 2024 | 06:01 PM
మానవత్వం మంటగలిసిపోతోందని చెప్పడానికి తాజా ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. డబ్బుల మోజులో ఓ మహిళ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే అత్యంత...
మానవత్వం మంటగలిసిపోతోందని చెప్పడానికి తాజా ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. డబ్బుల మోజులో ఓ మహిళ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణానికి పాల్పడింది. సుపారీ ఇచ్చి మరీ.. తన సొంత మామను హతమార్చింది. ఆపై దీనిని ఓ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. చివరికి పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి రావడంతో.. ఆమె కటకటాలపాలయ్యింది. ఈ ఘటన మహారాష్ట్రలో (Maharashtra) చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: నాడు రాజీవ్ గాంధీలాగా.. నేడు మోదీ వదులుకుంటారా?
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మానేవాడ కాంప్లెక్స్‌లో నివాసం ఉండే పురుషోత్తం పుట్టేవార్(82)ను మే 22వ తేదీన ఒక కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రాథమిక విచారణలో భాగంగా పురుషోత్తం మృతిని యాక్సిడెంట్‌గా తేల్చారు. అయితే.. ఇది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, దీని వెనుక హత్యాకోణం ఉండొచ్చని మృతుడి సోదరుడు పోలీసులకు తెలిపాడు. ఆ దిశగా పోలీసులు విచారణగా ప్రారంభించగా.. విస్తుపోయే నిజాలు ఒకదాని తర్వాత మరొకటి వెలుగులోకి వచ్చాయి.
Read Also: ఇంట్రెస్టింగ్ సీన్.. మోదీ పాదాలను నితీశ్ టచ్ చేయబోతే..
తొలుత సీసీటీవీ ఆధారంగా పోలీసులు కారు డ్రైవర్స్ అయిన నీరజ్ నిమ్జే, సచిన్ ధర్మిక్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా.. అర్చన పుట్టేవార్ నుంచి తాము డబ్బులు తీసుకొని, ఆమె మామను కారుతో ఢీకొట్టి చంపేశామని అంగీకరించారు. ఇందుకు కారణాలేంటని ఆరా తీయగా.. రూ.300 కోట్ల ఆస్తి కోసమేనని తేలింది. పూర్వీకుల నుంచి పురుషోత్తంకు అంత భారీ ఆస్తి వచ్చిందని, దాని కోసమే అర్చన సుపారీ ఇచ్చి మరీ మామని చంపించిందని వెల్లడైంది. ఈ కేసులో పోలీసులు ఆ ఇద్దరు డ్రైవర్స్, అర్చనని అరెస్ట్ చేశారు. కాగా.. అర్చన పుట్టేవార్ ఓ ప్రభుత్వ అధికారి!
Read Also: కండక్టర్ కాదు.. స్పైడర్‌మ్యాన్
ఈ కేసు గురించి నాగ్‌పూర్ పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ.. ఇదొక హై-ప్రొఫైల్ కేసు అని పేర్కొన్నారు. దీనిపై నాగ్‌పూర్ క్రైమ్‌బ్రాంచ్ బృందం ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోందన్నారు. రూ.300 కోట్ల ఆస్తి కోసమే పురుషోత్తంను కోడలు అర్చన చంపినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఇంకా ఈ కేసు విచారణ కొనసాగుతోందన్న ఆయన.. మరిన్ని విషయాలు వెల్లడి కావాల్సి ఉందని, త్వరలోనే వాటిని వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.
Read Latest Crime News and Telugu News
Updated Date - Jun 07 , 2024 | 06:02 PM