ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శక్తి స్వరూపిణి జగజ్జనని

ABN, Publish Date - Oct 06 , 2024 | 07:31 AM

శక్తి స్వరూపిణి జగజ్జనని శక్తి స్వరూపిణి అయిన జగజ్జనని ఈ జగమంతా అనేకానేక రూపాలలో వుంటుంది. వాటిలో కొన్ని రూపాలకు విశేష చరిత్ర వుంది. మరికొన్ని రూపాలను సాధకులు తమ సాధనలు, కోరికలు త్వరగా ఫలించేందుకు ఎంచుకుని పూజలు చేస్తుంటారు.

శక్తి స్వరూపిణి జగజ్జనని శక్తి స్వరూపిణి అయిన జగజ్జనని ఈ జగమంతా అనేకానేక రూపాలలో వుంటుంది. వాటిలో కొన్ని రూపాలకు విశేష చరిత్ర వుంది. మరికొన్ని రూపాలను సాధకులు తమ సాధనలు, కోరికలు త్వరగా ఫలించేందుకు ఎంచుకుని పూజలు చేస్తుంటారు. దేవీ నవరాత్రులలో ఆలయాల ప్రాంగణాలలో అమ్మ ధరించిన అనేక రూపాలను అలంకారాలుగా ప్రదర్శిస్తుంటారు. ఇవన్నీ యుగయుగాలుగా ఆ తల్లి దుష్టశిక్షణ, శిష్టరక్షణల కోసం ధరించినవే. ఇలాంటి అవతారాల గురించి దేవీభాగవతం, మార్కండేయ పురాణాలు వివరంగా చెపుతున్నాయి.


దసరా ఉత్సవాలనగానే సర్వసాధారణంగా దుర్గామాత దర్శనం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. అయితే దుర్గమ్మ రూపం కేవలం ఒకటి మాత్రమే కాదు. బహు రూపాలలో వుంటుంది ఆ తల్లి. ఇలా ఎందుకు? అంటే మానవాళి కోరుకునే కోర్కెలలో ఒక్కో కోరికను సిద్ధింపచేయడానికి ఒక్కో రూపంలో వున్న దుర్గమ్మ ఆరాధన, ధాయన పూజలు చెయ్యాల్సి వుంటుందని అందుకే అన్ని రూపాలని సాధకులు, పండితులు చెపుతున్నారు. నవదుర్గలు, సప్తసతులు, దశమహా విద్యలు... ఇలా ఎన్నో రూపాలలో ఆ తల్లి దర్శనమిస్తుంటుంది.


నవదుర్గలు..

దుర్గామాత అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవి. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించింది. ఈ మూడు అవతారాల నుంచే నవదుర్గలు వెలువడ్డారని పురాణాలు పేర్కొంటున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో నవదుర్గలను పూజించటం సంప్రదాయంగా వస్తోంది.

దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మ దేవుడిని అడిగితే బ్రహ్మ దుర్గాదేవి వివరాలు తెలిపినట్లు వరాహ పురాణం తెలుపుతోంది.

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్‌


పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ

సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్‌

నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః

ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా

ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది.

సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీకవచంలో నవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తుంది. నవదుర్గల పూజాఫలం ఇలా వుంటుందని సాధకులు వివరిస్తున్నారు.


1. శైలపుత్రి:

సతీదేవి యోగాగ్నిలో తనువు చాలించి ఆ తరువాత పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికగా అవతరించింది. అందుకే ఆమెకు శైలపుత్రి అనే పేరొచ్చింది. ఈమె వాహనం వృషభం. ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము వుంటాయి. తలపై చంద్రవంకను ధరించి వుంటుంది. పార్వతి, హైమవతి అనేవి కూడా ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతాలు. కోరిన కోర్కెలను ప్రసాదిస్తుందీ తల్లి.

2. బ్రహ్మచారిణి

బ్రహ్మచారిణి నిత్యం తపస్సులో వుంటుంది. బ్రహ్మంలో చరిస్తుండేది కనుక ఈ పేరొచ్చింది. కుడి చేతిలో జపమాలను, ఎడమచేతిలో కమండలాన్ని ధరించి వుంటుంది. పరమేశ్వరుని పతిగా పొందటానికి తీవ్రమైన తపస్సు చేసి ఉమ అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఈ దేవి స్వరూపం జ్యోతిర్మయం. ఎంతో శుభంకరం. భక్తులకు, సిద్ధులకు అనంత ఫలాన్ని ప్రసాదిస్తుందీ దేవి. ఈమె కృపవల్ల ఉపాసకులకు నిశ్చల దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయం ప్రాప్తిస్తుంటాయి.


3. చంద్రఘంట

ఈ తల్లి తన శిరస్సున ధరించిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండటంతో ఈమెకు ‘చంద్రఘంట’ పేరు స్థిరపడింది. ఈమె శరీరం బంగారు కాంతిమయం. తన పది చేతులలో ఖడ్గం, బాణం తదితర ఆయుధాలను ధరించి వుంటుంది. సింహ వాహనాన్ని అధిరోహించి, నిరంతరం యుద్ధముద్రలో వుంటుంది. ఈమె చేతి గంటనుంచి వెలువడే భయంకరధ్వనులను వినగానే క్రూరులైన దానవ రాక్షసులు గడగడలాడతారు. అయితే భక్తులకు, ఉపాసకులకు ఈ తల్లి సౌమ్యంగా ప్రశాంతంగా కనిపిస్తుంటుంది.

ఈ దేవి ఆరాధన వెంటనే ఫలితాన్నిస్తుంది. భక్తుల కష్టాలను అమ్మవారు చాలా తొందరగా నివారిస్తుంది. ఈ మాతను ఉపాసించే వారు సింహ పరాక్రమశాలురుగా, నిర్భయులుగా ఉంటారు. ఎలాంటి భయాలూ వారిని బాధించవు.


4. కూష్మాండ

చిరునవ్వు నవ్వుతూ అవలీలగా బ్రహ్మాండాన్ని సృష్టిస్తుంది కనుక ఈ దేవికి కూష్మాండ అనే పేరొచ్చింది. సూర్య మండలం మధ్యలో వుంటుంది. ఈమె తేజస్సు నిరుపమానం. ఈ తల్లి తేజోమండల ప్రభావం చేతనే దశదిశలు వెలుగుతుంటాయి. బ్రహ్మాండంలోని సకల వస్తువులలో, ప్రాణులలో వున్న తేజస్సంతా ఈ అమ్మ రూపమే. ఈ అమ్మనే అష్టభుజాదేవి అని కూడా అంటారు. ఈమె ఎనిమిది చేతులతో విరాజిల్లితుంటుంది. ఏడు చేతులలో వరుసగా కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద వుంటాయి. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించే జపమాల వుంటుంది. ఈ తల్లి వాహనం కూడా సింహమే. భక్తులు ఈ దేవిని ఉపాసించటం వల్ల రోగాలు, శోకాలు నశిస్తాయి. అలాగే ఆయువు, యశస్సు, బలం, ఆరోగ్యభాగ్యాలు వృద్ధిచెందుతాయి. కొద్దిపాటి భక్తిసేవలకే ఈ అమ్మ ప్రసన్నురాలవుతుంది.


5. స్కందమాత

కుమారస్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి అయిన దుర్గాదేవిని స్కందమాత అంటారు. ఈమె బాలుడి రూపంలో వున్న కుమార స్వామిని ఒడిలో ఒక పక్క కుడిచేత పట్టుకొని వుంటుంది. మరొక కుడిచేత పద్మం ధరించి వుంటుంది. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలం ధరించి వుంటుంది. ఈ తల్లికే పద్మాసన అనే పేరుకూడా వుంది. ఈమె వాహనం కూడా సింహమే. స్కందమాతను ఉపాసించటం వల్ల కోర్కెలన్నీ నెరవేరతాయి. ఈ లోకంలోనే పరమశాంతిని, సుఖాలను అనుభవిస్తారు. స్కందమాతకు చేసిన పూజలు బాల స్కందుడికి చెందుతాయి. ఈ దేవి సూర్య మండలాన్ని అధిష్ఠించి వుండటంతో ఈమెను ఉపాసించే వారు కూడా దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుతుంటారు.


6. కాత్యాయని

కాత్యాయనీ మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించింది. కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పొందటం కోసం గోకులంలోని గోపికలంతా యమునాతీరంలో ఈమెను పూజించారు. స్వరూపం దివ్యం, బంగారు వర్ణంతో వుంటుంది. నాలుగు భుజాలతో విరాజిల్లుతుంటుంది. ఈమె కుడిచేతులలోని ఒక చెయ్యి అభయ ముద్రను, మరొక కుడి చేతిలో వరముద్రను కలిగి వుంటుంది. ఎడమచేతుల్లోని ఒక చేతిలో ఖడ్గం, మరొక ఎడమ చేతిలో పద్మం శోభిల్లుతుంటాయి. ఈమె వాహనం కూడా సింహమే. ఈ దేవిని భక్తితో సేవించేవారికి ధర్మార్ధకామమోక్షాలనే చతుర్విధ పురుషార్ధాలు ఫలిస్తాయి. రోగాలు, శోకాలు, సంతాపాలు, భయాలు దూరమవుతాయి. జన్మజన్మాంతర పాపాలు నశిస్తాయి.


7. కాళరాత్రి

కాళరాత్రి శరీరవర్ణం గాఢాంధకారంలా వుంటుంది. తలపై కేశాలు చెల్లాచెదురై వుంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతుంటుంది. ఈమె మూడు కన్నులు బ్రహ్మాండాల్లా గుండ్రంగా వుంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు భయంకరాలైన అగ్నిజ్వాలలను వెళ్లగక్కుతుంటాయి. ఈమె వాహనం గార్దభం. కుడిపక్కనున్న చేతులలోని ఒక చేత ఈమె వరముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంటుంది. మరొక కుడిచేయి అభయ ముద్రను కలిగి వుంటుంది. ఎడమవైపున వున్న ఒక చేతిలో ఇనపముళ్లున్న ఆయుధం, మరొక ఎడమచేతిలో ఖడ్గం ధరించి వుంటుంది. కాళరాత్రి స్వరూపం చూడటానికి ఎంతో భయానకంగా వుంటుంది. కాని ఈమె ఎప్పుడూ శుభాలనే ప్రసాదిస్తుంటుంది. అందువలన ఈమెను ‘శుభంకరి’ అని కూడా అంటారు.

కాళరాత్రి మాతను స్మరిస్తే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేత పిశాచాలు భయంతో పారిపోతాయి. ఈమె అనుగ్రహంతో గ్రహబాధలు కూడా తొలగిపోతాయి. ఈ తల్లిని ఉపాసించేవారికి అగ్ని, జలం, జంతువులు తదితరాల భయం, శత్రువుల భయం, రాత్రి భయం ఏ మాత్రం ఉండవు. దేవి కృపతో భక్తులు భయవిముక్తులవుతారు.


8. మహాగౌరి

ఎనిమిది సంవత్సరాల వయసున్న బాలికలాగా మహాగౌరి కనిపిస్తుంటుంది. గౌర వర్ణంతో వుంటుంది కనుక గౌరి అనే పేరొచ్చింది. ధరించే వస్త్రాలు, ఆభరణాలు తెల్లని కాంతులను వెదజల్లుతుంటాయి. ఈమెకు నాలుగు చేతులుంటాయి. వృషభ వాహనాన్ని ఎక్కి వుంటుంది. తన కుడిచేతులలో ఒకదానిలో అభయముద్రను, మరొకదానిలో త్రిశూలాన్ని ధరించి వుంటుంది. అలాగే ఎడమచేతులలో ఒకదానిలో డమరుకం, మరొకదానిలో వరముద్రను కలిగి వుండి ప్రశాంతంగా కనిపిస్తుంటుంది.

పార్వతి అవతారంలో పరమశివుని పతిగా పొందేందుకు కఠోరమైన తపస్సు చేసింది. అప్పుడు ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కింది. ప్రసన్నుడైన శివుడు గంగాజలంతో అభిషేకించాడు. దాంతో ఈమె గౌరవర్ణంలోకి మారింది. అలా అప్పటినుంచి మహాగౌరి అయింది. ఈ తల్లిని అర్చించే వారికి వెంటనే కోరిన కోరికలు నెరవేరతాయి. ఈమెను ఉపాసించిన భక్తుల కర్మలన్నీ ప్రక్షాళితమవుతాయి. వారి పూర్వ సంచిత పాపాలు పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో పాపతాపాలు, దైన్య దుఃఖాలు వారిని దరిజేరవు. వారు సర్వవిధాల పునీతులై, అక్షయ పుణ్యఫలాలను పొందుతారు. ఈ దేవి పాదాలను సేవించటం వలన కష్టాలు మటుమాయమవుతాయి. ఈమె ఉపాసన ప్రభావంతో అసంభవాలైన కార్యాలు కూడా సంభవాలే అవుతాయి.


9. సిద్ధిదాత్రి

సర్వవిధ సిద్ధులను ప్రసాదించే తల్లికనుక సిద్ధి దాత్రి అనే పేరొచ్చింది. పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవి కృపవలనే పొందాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలంపై ఆసీనురాలై వుంటుంది. కుడివైపున ఒకచేతిలో చక్రం, మరొకచేతిలో గదను ధరించి వుంటుంది. ఎడమవైపున ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో కమలం కనిపిస్తుంది. నిష్ఠతో ఈ తల్లిని ఆరాధించే వారికి సకలసిద్ధులు లభిస్తాయని సాధకులు అనుభవంతో చెపుతుంటారు.

- శ్రీమల్లి

98485 43520


ఎన్నెన్ని రూపాలో...

సప్తశతిలో అమ్మ పేర్లు: మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంభరి (శతాక్షి), భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరీ అనే పేర్లు కనిపిస్తాయి.

సప్తసతీ దేవతలు: సప్తసతీ దేవతలని మరో సంప్రదాయం ఉంది. దీనిలో నందా, శతాక్షీ, శాకంభరీ, భీమా, రక్తదంతికా, దుర్గా, భ్రామరీ అనే ఏడుగురు సప్తసతుల ప్రస్తావన వుంది. అలాగే సప్తమాతృకలని మరో ఏడుగురు దేవతామూర్తుల రూపాలలో కూడా అమ్మ దర్శనమిస్తుంది. ఇదేకాక దశమహా విద్యలని మరో పది అమ్మవారి రూపాలున్నాయి. ఈ రూపాలన్నీ విభిన్న సాధనలకు ఉపకరిస్తాయి. కాళీ, ఛిన్నమస్త, తార, మాతంగి, త్రిపురసుందరి, కమల, భువనేశ్వరి, ధూమావతి, భైరవి, బగళాముఖి అనేవే దశమహావిద్యల రూపాలు. ఈ రూపాలలో అమ్మను ఆరాధించటం వల్ల గ్రహదోషాలు, కష్టనష్టాల నుంచి భక్తులు బయట పడవచ్చంటారు అనుభవజ్ఞులు. ఒక్కో పేరుకు ఒక్కో రూపం వున్నట్టే ఒక్కో రూపంలోని అమ్మను ధ్యానించటానికి, ఆరాధించటానికి, యోగసాధన చెయ్యటానికి ఒక్కో మంత్రం విడివిడిగా వుంటుంది. అవన్నీ సద్గురువుల నుంచి ఉపదేశం పొంది మాత్రమే సాధన చేయాల్సి వుంటుంది.

Updated Date - Oct 06 , 2024 | 07:38 AM