ఒక జ్ఞానావతారుని హృదయం!
ABN , Publish Date - May 10 , 2024 | 03:40 PM
“నీకు బేషరతుగా నా ప్రేమ అందిస్తాను.” మచ్చలేని ప్రేమను అందిస్తానన్న ఈ శాశ్వత వాగ్దానంతో మూర్తీభవించిన జ్ఞానావతారులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి.. యువ ముకుందుడిని తన ఆశ్రమంలోకి స్వాగతించారు..
శ్రీ శ్రీ స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి 169వ జన్మదినోత్సవం
“నీకు బేషరతుగా నా ప్రేమ అందిస్తాను.” మచ్చలేని ప్రేమను అందిస్తానన్న ఈ శాశ్వత వాగ్దానంతో మూర్తీభవించిన జ్ఞానావతారులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి.. యువ ముకుందుడిని తన ఆశ్రమంలోకి స్వాగతించారు. (తరువాతి కాలంలో పరమహంస యోగానందగా సుప్రసిద్ధులు అయిన వీరు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క వ్యవస్థాపకులుగా, పశ్చిమ దేశాల్లో యోగ పితామహుడుగా, అత్యధికంగా అమ్ముడుపోతున్న ఆధ్యాత్మిక గ్రంథరాజమైన ఒకయోగి ఆత్మకథ రచయితగా సుపరిచితులు.) ఆయన రాక కోసం స్థిర చిత్తులైన ఆయన గురువు ఒక దశాబ్దమున్నర కాలంగా ఎదురు చూస్తున్నారన్నది అంతవరకూ చోటుచేసుకున్న దివ్యనాటకంలోని సంఘటనలకు ఎరుక లేదు.
1894 వ సంవత్సరం జనవరిలో అలహాబాదులోని కుంభమేళాలో శ్రీయుక్తేశ్వర్ గిరి మరణం లేని హిమాలయ యోగీశ్వరులైన మహావతార్ బాబాజీని కలిశారు. యోగానందజీ మళ్ళీ అవతారం తాల్చారన్న విషయం ఎరిగి ఉన్న బాబాజీ (ముకుందుడు 1893 జనవరి 5 న గోరఖ్ పూర్ లో జన్మించారు ) “పశ్చిమదేశాల్లో యోగశాస్త్ర వ్యాప్తి చేయడం” కోసం తగిన శిక్షణ ఇచ్చే నిమిత్తం ఒక యువ శిష్యుడిని ఆయన వద్దకు పంపుతామని వాగ్దానం చేశారు. అంతేకాక సనాతన ధర్మానికి చెందిన ధర్మ శాస్త్రాలకు, క్రైస్తవ ధర్మ శాస్త్రాలకు మధ్య అంతర్లీనంగా ఉన్న సామరస్యతను వివరిస్తూ ఒక చిన్న పుస్తకాన్ని వ్రాయమని శ్రీయుక్తేశ్వర్‌ని కోరారు. “పాశ్చాత్య ప్రపంచం గురించీ, ప్రాచ్య ప్రపంచం గురించీ కూడా నీకు ఆసక్తి ఉండడం గమనించాను. నీ హృదయ వేదన నేను అర్థం చేసుకున్నాను: విశాలమైన నీ గుండెలో మానవులందరికీ చోటు ఉంది.” అన్న ఈ మాటలతో బాబాజీ శ్రీయుక్తేశ్వర్ గిరిని మెచ్చుకొన్నారు. రెండు మత గ్రంథాలలోనూ “దైవ ప్రేరణ పొందిన మహాత్ములు బోధించిన సత్యాలు ఒకటే” అని తెలిపే సమాంతర ఉల్లేఖనాలను ఉదహరించవలసిందిగా ఆయన శ్రీయుక్తేశ్వర్‌ని కోరారు.
శ్రీయుక్తేశ్వర్ తన స్వాభావిక వినయంతో ఆ దైవాజ్ఞను స్వీకరించి, తన సహజావబోధయుత జ్ఞానంతోనూ, లోతైన అధ్యయనంతోనూ కైవల్యదర్శనం (The Holy Science) అన్న గ్రంథ రచనను కొద్ది రోజుల్లోనే పూర్తిచేశారు. ప్రభువైన ఏసుక్రీస్తు బోధనలను ప్రస్తావిస్తూ, “ఆయన ఉపదేశాలు వస్తుతః వేదదర్శనాలతో ఏకీభవిస్తాయని నిరూపించాను.” ఇంకా, శ్రీయుక్తేశ్వర్ ఆ పుస్తకంలోని వివిధ సూత్రాలలో మానవ హృదయపు ఐదు దశలను వివరించారు. అంధకార, ప్రేరేపిత, నిలకడైన , భక్తియుత, శుద్ధ హృదయ దశలు. “ఈ వివిధ హృదయ దశల వల్ల మానవులు వర్గీకరించబడ్డారు, వారి పరిణామ స్థాయి నిర్ధారించబడుతుంది.” అని వారు తెలియజేశారు.
పశ్చిమ బెంగాలులోని శ్రీరాంపూర్‌లో 1855, మే 10న ప్రియనాథ్ కరార్‌గా జన్మించి, కాశీలోని ఉత్కృష్ట యోగివర్యులైన లాహిరి మహాశయుల శిష్యులయ్యారు. అనంతర కాలంలో ఆయన సన్యాస దీక్ష తీసుకొని స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి అన్న కొత్త పేరు స్వీకరించారు. బాబాజీకి తాను చేసిన వాగ్దానాన్ని అనుసరించి శ్రీయుక్తేశ్వర్.. యువ యోగానందగారిని తన ఆశ్రమంలో ఒక దశాబ్దం పాటు తీర్చిదిద్దారు. ఒక యోగి ఆత్మకథ లో “గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం” అన్న అధ్యాయంలో బెంగాల్ సింహం - శ్రీయుక్తేశ్వర్‌తో తాను గడిపిన కాలాన్ని యోగానంద ఎంతో విపులంగా, ప్రీతికలిగించే రీతిలో వివరించారు. తన గురువు ఎన్నడూ అత్యాశ, కోపము లేక మానవ అనుబంధాల కారణంగా మాయకు లోనవడం కానీ, భావోద్రేకాలలో మునిగిపోవడం కానీ తాను చూడలేదని అయన అందులో రాసారు. ఆయనది ఒక “స్వాస్థ్యకారక ప్రశాంతతా” కాంతి పరివేషం. తన మార్గదర్శకత్వంలో ఉన్న అనేక శిష్యులకు ఆయన క్రియాయోగం (భవత్ సాక్షాత్కారానికై చేసే పురాతన శాస్త్రీయ ధ్యాన ప్రక్రియ) ఆవశ్యకతను తెలుపుతూ ఈ విధంగా హెచ్చరించేవారు. “మాయ అనే చీకటి చప్పుడు చెయ్యకుండా దగ్గరికి వస్తోంది; లోపలింటికి త్వరగా పోదాం, పద!”
తన మార్గదర్శకత్వాన్ని కోరి వచ్చిన శిష్యుల పట్ల శ్రీయుక్తేశ్వర్ చాలా బాధ్యతగా ఉండేవారు. తీవ్రత అనే అగ్ని జ్వాలల్లో శుద్ధి చేయడం ఆయన ఎంచుకొన్న శిక్షణా విధానం; అవి మామూలు సహన శక్తికి మించి వ్యక్తిని దహిస్తాయి. తన గురువులోని నిష్పాక్షిక కార్యశీలతను గుర్తించిన యోగానంద.. ఆయన నమ్మదగినవారనీ, అర్థం చేసుకొనే వారనీ, నిశ్శబ్దంగా ప్రేమించేవారనీ తెలుసుకొన్నారు. యోగానందగారు తన గురువు గురించి ఇలా వ్రాసారు; “ఆయనది చిత్రమైన స్వభావం; ఎప్పుడూ పూర్తిగా తెలిసేది కాదు; బయటి ప్రపంచానికి అందనంత లోతుగా, నిశ్చలంగా ఉండేది ఆయన ప్రకృతి. ఆ బయటి ప్రపంచం విలువల్ని ఆయన ఏనాడో అధిగమించారు”. మరింత సమాచారం కోసం: yssofindia.orgలో తెలుసుకోండి.