Varanasi Tour: కాశీ వెళ్లాలనుకుంటున్నారా.. తక్కువ ఖర్చుతో ఈజీగా ఇలా ప్లాన్ చేయండి
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:56 PM
కాశీ వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. కానీ వెళ్లలేని పరిస్థితి. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి వెళ్లే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి డైెరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. రైలు ప్రయాణం ద్వారా తక్కువ ఖర్చుతో కాశీ ఎలా వెళ్లాలో తెలుసుకుందాం.

జీవితంలో ఒకసారైనా కాశీ వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. జీవితంలో అదొక డ్రీమ్‌గా ఉంటుంది. ఎక్కువుగా వయసులో పెద్దవాళ్లు కాశీకి వెళ్తుంటారు. మరికొందరైతే జీవితం చివరిలో కొద్దిరోజులు కాశీలో ఉండి రావాలని అనుకుంటారు. కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా కాశీకి అంతా వెళ్తున్నారు. వారణాసిలో అడుగుపెడితే చాలు.. మనస్సంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. వాటిని మర్చిపోయేలా చేస్తుంది కాశీ క్షేత్రం. చాలామందికి కాశీ వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ ఖర్చు, సరైన ప్రణాళిక లేకపోవడంతో కొందరు వెళ్లలేకపోతుంటారు. పదేళ్ల క్రితం కాశీకి, ఇప్పటి కాశీకి ఎంతో మార్పు కనిపిస్తుంది. గతంలో చిన్న చిన్న వీధులు, ఆలయ దర్శనానికి వెళ్లే మార్గం చిన్నదిగా ఉండేది. ప్రస్తుతం ఆలయాన్ని ఎంతో బాగా అభివృద్ధి చేశారు. కాశీ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ప్రతి ఒక్కరూ సమయాన్ని మర్చిపోయి.. అథ్యాత్మిక భావనలోకి వెళ్లిపోతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి కాశీ క్షేత్రానికి తక్కువ ఖర్చుతో ఎలా వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తక్కువ ఖర్చుతో..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వారణాసి పుణ్యక్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లాలంటే చాలామంది ఖర్చుకోసం భయపడుతుంటారు. వేల రూపాయిలు ఖర్చవుతుందనే ఉద్దేశంతో చాలామంది కాశీ ప్రయాణానికి వెనుకాడుతూఉంటారు. అతి తక్కువ ఖర్చుతో కాశీ వెళ్లాలనే మన కోరికను తీర్చుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లుగా ఉన్న విజయవాడ, హైదరాబాద్ నుంచి బెనారస్‌కు డైరెక్ట్ రైళ్లు ఉన్నాయి. విజయవాడ లేదా హైదరాబాద్ నుంచి బెనారస్ వెళ్లేందుకు స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ టికెట్ ధర రూ.700లోపు ఉంటుంది. వెళ్లడానికి రావడానికి కేవలం రైలు ప్రయాణం ఖర్చులు రూ.1400 మాత్రమే. బెనారస్ రైల్వేస్టేషన్‌లో దిగిన తర్వాత కాశీవిశ్వనాధుని ఆలయం సమీపానికి చేరుకోవడానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా బుక్ చేసుకోకపోయినా.. షేరింగ్ ఆటోలు అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి ఆలయం వద్దకు ఒక్కొక్కరికి రూ.30 నుంచి రూ.50 వరకు తీసుకుంటారు. ఆలయం నుంచి రైల్వేస్టేషన్‌కు, రైల్వేస్టేషన్ నుంచి ఆలయానికి ఆటో ఛార్జీలు వంద రూపాయిల వరకు ఖర్చవుతుంది. ఇతర ఖర్చులు కలిపితే కనీసం రూ.2వేల రూపాయిలతో కాశీ క్షేత్రాన్ని సందర్శించి రావచ్చు. ఒకవేళ కాశీలో మిగిలిన ఆలయాలు సందర్శించి, స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలు సందర్శించాలంటే మాత్రం మరింత డబ్బులు అవసరమవుతాయి. రైలుపై ఆహారం ఇంటి నుంచి పట్టుకునివెళ్తే మరింత ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది.
దర్శనం, భోజనం ఫ్రీ..
కాశీ విశ్వనాధుని దర్శనం కోసం ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. సర్వదర్శన సదుపాయం అందుబాటులో ఉంది. ఎలాంటి టికెట్ తీసుకోకుండా విశ్వనాధుని దర్శనం చేసుకోవచ్చు. ఉదయం అభిషేకం సమయానికి వెళ్తే ఉచితంగా స్పర్శదర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. కాశీలో విశ్వనాధుని దర్శనానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఆలయం బయట ఉండే సహాయ కేంద్రాన్ని సంప్రదించి అవసరమైన సమాచారన్ని పొందవచ్చు. ఇక కాశీ క్షేత్రానికి వెళ్లిన తర్వాత భోజనానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బయట డబ్బులుపెట్టి భోజనం హోటల్స్‌లో కొని తినాల్సిన పనిలేదు. అన్నపూర్ణదేవి ఆలయం వద్ద ఉన్న అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తారు. అక్కడికి వెళ్లినట్లైతే ఉదయం, రాత్రి భోజనం చేయవచ్చు. ఇలా చేస్తే రూ.2 నుంచి 3వేలతో కాశీ విశ్వనాధుడిని దర్శించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
YSRCP vs JANASENA: పవన్‌తో పెట్టుకుంటే అంతే.. దెబ్బ గట్టిగా తగిలిందా
Train Ticket Auto Upgradation: స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీలో ప్రయాణం.. రూపాయి ఖర్చు లేకుండా
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here