హర్యానాలో బీజేపీ ఎలా గెలిచింది
ABN, Publish Date - Oct 09 , 2024 | 01:47 AM
భారతీయ జనతా పార్టీతో ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎందుకని గట్టి పోటీనివ్వకపోతోంది? బీజేపీని ఎదుర్కొనేందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలు కాంగ్రెస్ వద్ద లేవా? 2022లో హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ...
భారతీయ జనతా పార్టీతో ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎందుకని గట్టి పోటీనివ్వకపోతోంది? బీజేపీని ఎదుర్కొనేందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలు కాంగ్రెస్ వద్ద లేవా? 2022లో హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతో కాంగ్రెస్ ముఖాముఖి పోటీపడి విజయం సాధించగలిగింది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికలలో కర్ణాటకలో బీజేపీకి 17 సీట్లు లభిస్తే కాంగ్రెస్‌కు 9 సీట్లు మాత్రమే లభించాయి. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు సీట్లు బీజేపీకే దక్కాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికంగా మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన స్థానాల్లోనే విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మిత్రపక్షాల వల్ల కాంగ్రెస్ ఓటు శాతం పెరిగింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సంఖ్యాబలం 240కి తగ్గిపోయిన తర్వాత బీజేపీని ముఖాముఖి ఢీకొనే అవకాశం కాంగ్రెస్‌కు ఇప్పుడు హర్యానాలో లభించింది. నిజానికి లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు టేకాఫ్ దశ ప్రారంభమైందని చాలా మంది భావించారు. ప్రతిపక్ష నేత హోదా సాధించిన రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్‌కు మాత్రమే బీజేపీని ఢీకొనే శక్తి ఉన్నదనే ప్రచారం జరిగింది. లోక్‌సభలో ఇతర మిత్రపక్షాలతో కలిసి బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసిన రాహుల్‌గాంధీ విస్తృతంగా ప్రజల్లో ప్రవేశించడమే కాక విదేశాలకు వెళ్లి కూడా తాను మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడుగా నిరూపించుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తన స్వంత భావజాలం సృష్టించుకుంది. దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలకు తామే ప్రాతినిధ్యం వహించగలమని చెప్పుకుంది. బీజేపీని సంపన్న వర్గాల పార్టీగా తమది పేదల పార్టీగా చిత్రీకరించింది. కులజనగణన, రైతుల సమస్యలు, నిరుద్యోగం, అధిక ధరలు మొదలైన అనేక అంశాలను లేవనెత్తింది. నరేంద్రమోదీని రాహుల్ గాంధీ విమర్శించినంత తీవ్రంగా మరే నేతా విమర్శించలేదు. ప్రతిపక్షాలు కూడా రాహుల్‌తో ఏ మాత్రం విభేదించలేదు. పైగా ఆయనను ప్రోత్సహించాయి. లోక్‌సభలో ఆయన వెన్నంటి నిలిచాయి. కాంగ్రెస్‌తో పొత్తు కుదరని రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలు రాహుల్‌ను వ్యక్తిగతంగా విమర్శించకుండా ఇండియా కూటమిలో కొనసాగుతూ వచ్చాయి.
బీజేపీతో ముఖాముఖి పోటీ చేసే రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాన్ని ఓడించగల శక్తిని, వ్యూహరచనను సమకూర్చుకోలేదని హర్యానా ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. నిజానికి హర్యానాలో పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. రైతుల ఆందోళన, మల్లయోధుల నిరసనతో పాటు అనేక స్థానిక అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా మారాయి. హర్యానాలో తిరిగిన ప్రతి జర్నలిస్టూ అక్కడ మార్పు సంభవిస్తోందని భావించారు. హర్యానాలో ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించిన ఏడు ప్రధాన సంస్థలు చెప్పిన ఫలితాలను సగటున బేరీజు వేసి చూస్తే 90 సీట్లలో 55 సీట్లు కాంగ్రెస్‌కు దక్కుతాయని, బీజేపీకి 26 సీట్లు దక్కుతాయని తేలింది. కాని ఇప్పుడు ఫలితాలు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి. బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ చేసి అధికారంలోకి రాగలిగింది.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎన్నికల కమిషన్‌ను, ఈవీఎంలను విమర్శించడం ప్రతి పార్టీ చేస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఫలితాలను వెంటవెంటనే ప్రకటించడం లేదని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జి జైరాం రమేశ్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అందుకు ఎన్నికల కమిషన్ వెంటనే స్పందిస్తూ అందుకు ఆధారాలేమీ లేవని, ప్రతి అయిదు నిమిషాలకూ ఫలితాలను ప్రకటిస్తూనే వచ్చామని స్పష్టం చేసింది. అంటే కాంగ్రెస్‌కు తాము ఎందుకు ఓడిపోయామో ఏ మాత్రం అర్థం కాలేదన్న విషయం తేటతెల్లమవుతోంది. మేము ఈ ఫలితాలను ఆమోదించం అని ప్రకటించినంత మాత్రాన ఏమి జరుగుతుంది?
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయిన తర్వాత బీజేపీతో జరిగిన ఒప్పందంలో భాగంగా హర్యానాలో తమ అభ్యర్థులను రంగంలోకి దింపారని ఒక ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు. కేజ్రీవాల్‌తో బీజేపీ అలాంటి ఒప్పందమే నిజంగా కుదుర్చుకుని ఉంటే అందుకు ఆ పార్టీ వ్యూహకర్తలను ప్రశంసించాల్సి ఉంటుంది కాని తప్పుపట్టలేము. తమిళనాడులో డిఎంకెకు కూడా బీజేపీ స్నేహహస్తం చాస్తోందని ఇటీవల మరో ప్రచారం మొదలైంది. నవంబర్‌లో మహారాష్ట్ర ఎన్నికలు సమీపించేసరికి బీజేపీ ఏ వ్యూహరచన చేస్తుందో, లేక ఇప్పటికే చేసిందో చెప్పడం కష్టం. దేశంలో తన ఆమోదయోగ్యత పెంచుకునేందుకు, తాను బలహీనపడ్డానన్న విమర్శలను దూరం చేసేందుకు, పూర్తి టర్మ్ అధికారంలో కొనసాగేందుకు మోదీ ఏ వ్యూహాన్నైనా అవలంబించవచ్చు. దక్షిణాదిన తెలుగుదేశం, జనతాదళ్ (ఎస్)తో చేతులు కలిపాక బీజేపీ ఆమోదయోగ్యత పెంచుకుంది. తెలంగాణలో ఆ పార్టీ ఏమి చేస్తుందో కొద్ది నెలల్లో తేలనుంది.
ఎటొచ్చి హర్యానాలో గెలుపుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి దేశ రాజకీయాల్లో తన పార్టీకి బలమైన నాయకత్వం అందించగలరని నిరూపించుకుని ఆయన ఓటమిని ఆకాంక్షిస్తున్నవారు వెనక్కు తగ్గేలా చేశారు. జమ్ము కశ్మీర్‌తో పాటు హర్యానా ఎన్నికల్లో ఓడి ఉంటే మహారాష్ట్రలోనూ, పొరుగున ఉన్న ఢిల్లీలోనూ మోదీ తన బలం నిరూపించుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. అ తర్వాత మోదీకి ప్రత్యామ్నాయం గురించి కూడా దేశంలో తీవ్ర చర్చ జరిగేది. ప్రస్తుతానికి ఆ చర్చ అప్రస్తుతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల తర్వాత తాను పుంజుకున్నానని నిరూపించేందుకు కాంగ్రెస్‌కు లభించిన ఒకే ఒక్క అవకాశాన్ని హర్యానాలో పోగొట్టుకుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపినట్లు కొత్తరక్తాన్ని, కొత్త నేతలను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నా అందుకు ప్రయత్నించే ధైర్యం చేయలేదు. మల్లయోధురాలు వినేశ్ ఫోగట్ లాంటి ఒకరిద్దరిని నిలబెట్టినా మొదటి జాబితాలోనే 28 మంది సిట్టింగ్ అభ్యర్థులను రంగంలోకి దించారు. బీజేపీ కొందరు రాష్ట్ర మంత్రులకు కూడా సీట్లు నిరాకరించే ధైర్యం చేస్తే కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవికి అయిదారు మంది పోటీపడ్డా సర్దుబాటు చేయలేని పరిస్థితిలో పడింది. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన పీసీసీ అధ్యక్షుడు ఉదయభాను కూడా ఓడిపోయారు. రాహుల్, ప్రియాంక ఇద్దరూ హర్యానాలో విస్తృతంగా ప్రచారం చేశారు. వారి సభలకు జనం పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాని వారిని ఓటు బ్యాంకుగా మళ్లించే వ్యూహరచన కాంగ్రెస్ చేయలేకపోయింది.
ఒకవైపు యువతను ఆకర్షించేందుకు నిరుద్యోగం వంటి వాటిని కాంగ్రెస్ ప్రస్తావించినప్పటికీ యువ నేతలకు సీట్లు ఇవ్వకపోతే ఏమి ప్రయోజనం? కులజనగణన, దళితుల గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించి ఉండవచ్చు కాని మూడోవంతు సీట్లను జాట్లకు ఎందుకు కేటాయించాల్సి వచ్చింది? అయినా జాట్ల అధిపత్యం ఉన్న సీట్లలో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు ఎందుకు సాధించలేకపోయింది? 1966లో హర్యానా ఏర్పడిన నాటి నుంచి 33 ఏళ్లు జాట్ ముఖ్యమంత్రులే పారిపాలించారు. ఒక్క భజన్‌లాల్ తప్ప జాట్ కాని వారు ఎక్కువకాలం పాలించలేకపోయారు. రాష్ట్రంలో 33 శాతం ఉన్న బీసీలు, 22 శాతం ఉన్న దళితులపై బీజేపీ పూర్తిగా దృష్టి కేంద్రీకరించి మూడోవంతు సీట్లను జాట్లు కాని వర్గాలకు కేటాయించింది. బీసీలకే 22 సీట్లు దక్కాయి. ఆరు నెలల క్రితమే బీసీ వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా నియమించిన బీజేపీ బ్రాహ్మణులు, పంజాబీ ఖత్రీలు, రాజపుత్రులు, వైశ్యులను కూడా దరిచేర్చుకుంది. అంతేకాక, క్రీమీలేయర్ పద్ధతిని సమర్థంగా ఉపయోగించి బీసీల్లో బాగా వెనుకబడిన వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చే చర్యలు చేపట్టింది. నిజానికి దేశ వ్యాప్తంగా ఓబీసీ ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. సాధ్యమైనంత మేరకు ముఖ్యమంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులను ఓబీసీ వర్గాలనుంచే నియమిస్తోంది. జాట్ కాని వారందర్నీ సంఘటితం చేసే ప్రయత్నంలో బీజేపీ విజయవంతం కావడమే హర్యానాలో ఆ పార్టీ గెలుపునకు కారణమని అంటున్నారు.
బీజేపీకి గత లోక్‌సభ ఎన్నికల్లో 240 సీట్లు మాత్రమే వచ్చాయని ఆనందిస్తున్న కాంగ్రెస్, ఆ పార్టీకి ఓట్లు 37.3 శాతం నుంచి 36.6 శాతానికి మాత్రమే తగ్గాయని గుర్తించాలి. అఖిల భారత స్థాయిలో బీజేపీ ఆదరణ అనుకున్నంత తగ్గలేదు. కనుక బీజేపీతో ఆ పార్టీ ఇంకా సుదీర్ఘకాలం బలంగా పోరాడాల్సి ఉంటుంది. ఒకరకంగా హర్యానాలో కాంగ్రెస్ బాగానే ఘర్షించి, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న అధికార పార్టీకి ముచ్చెమటలు పుట్టించిందనే చెప్పాలి. కాని విజయం సాధించదగ్గ ప్రణాళికను కాంగ్రెస్ అమలు చేయలేకపోయింది. ఒడిషాలో అధికారం సాధించి, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకుంటే కాంగ్రెస్ తాను బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా నిలదొక్కుకోలేకపోతోంది. మరో ఒకటి రెండునెలల్లో ఎన్నికలు జరుగనున్న మహారాష్ట్ర, ఢిల్లీల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తే కాంగ్రెస్ శ్రేణులు మరింత నీరుకారిపోక తప్పదు. అప్పుడు ఇండియా కూటమిలో కూడా లుకలుకలు ఏర్పడుతాయి. ‘హర్యానా చిన్న రాష్ట్రమైనా ఒక కీలక సమయంలో జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికలు మోదీకి తిరుగులేని బలాన్ని చేకూర్చాయి. ఈ విజయం ప్రాతిపదికగా ఆయన మహారాష్ట్రలో కూడా గెలిచేందుకు ప్రతిపక్ష శిబిరాన్ని కకావికలు చేసేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తారు’ అని ఒక ముఖ్యమంత్రి మంగళవారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు. కాంగ్రెస్ తన భవిష్యత్ కార్యాచరణపై మరింత ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - Oct 09 , 2024 | 08:38 AM