ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RK Kokthapaluku : జగన్‌ ధ్వంస రచన.. అబద్ధాలే ఆలంబన!

ABN, Publish Date - Jul 28 , 2024 | 01:40 AM

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆలోచనలు, ఎత్తుగడలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడినవారు అతడిని అర్థం చేసుకోవడం కష్టం...

Kotha Paluku

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆలోచనలు, ఎత్తుగడలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. సంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడినవారు అతడిని అర్థం చేసుకోవడం కష్టం. ఇటీవలిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆపసోపాలు పడటం చూశాం. 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అప్పట్లో జగన్‌రెడ్డిని తేలికగా తీసుకోవడంతో 2019 ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. అబద్ధాలే పునాదిగా జగన్‌ రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు తాజా ఎన్నికల్లో తమకు అపూర్వ విజయం దక్కడంతో జగన్మోహన్‌రెడ్డి పనైపోయిందని చంద్రబాబు అండ్‌ కో సంబరపడినంత సేపు పట్టలేదు... అతగాడు తనలోని మరో కోణం ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఎన్నికల ఫలితాలు చూశాక తనకు హిమాలయాలకు వెళ్లిపోవాలనిపించిందని జగన్‌ వ్యాఖ్యానించడంతో నిజమే కాబోలు అని నమ్మారు. ‘తాజా ఫలితాలు చూశాక జగన్‌రెడ్డి కోలుకుంటారని అనుకుంటున్నారా?’ అని తెలుగుదేశం ముఖ్యుడొకరు ప్రశ్నించగా, ‘చూస్తూ ఉండండి. మీకే తెలుస్తుంది’ అని నేను బదులిచ్చాను. 2014 ఎన్నికల తర్వాత తానే ముఖ్యమంత్రినని బలంగా నమ్మిన జగన్‌రెడ్డి, ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా బెదరలేదు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అప్పట్లో అతడిని అర్థం చేసుకోలేకపోయిన చంద్రబాబు అండ్‌ కో తేలికగా తీసుకున్నారు. ఆ తర్వాత గానీ జగన్మోహన్‌రెడ్డి అనే రాజకీయ భూతం తమనే కాదు... రాష్ర్టాన్ని కూడా వెంటాడుతూనే ఉంటుందని ఊహించలేకపోయారు.


నెలనాళ్లకే నానాయాగీ

చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిందో లేదో... రాష్ట్రంలో అరాచకం ప్రబలిందని, రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెట్టడం జగన్‌రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. దాదాపు 57 శాతం ఓట్లు, 93 శాతం సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని నెల రోజులకే రద్దు చేయాలని కోరడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం కావొచ్చు. ఇదే జగన్‌రెడ్డి ప్రత్యేకత! క్రిమినాలజీలో ఆరితేరిన జగన్‌రెడ్డి రాజకీయాలు విలక్షణంగానే ఉంటాయి. గతంలో ఫ్యాక్షనిస్టులు తమ ప్రత్యర్థులకు స్పాట్‌ పెట్టాలనుకున్నప్పుడు ఎలిబీ కోసం ఏదో ఒక ఆస్పత్రిలో చికిత్స పేరిట చేరిపోయేవారు. ఆ తర్వాత ఎవరో ఒకరు హత్యకు గురయ్యేవారు. ఇప్పుడు ఈ ఆధునిక పాలెగాడైన జగన్మోహన్‌రెడ్డి తనపై గతంలోనే నమోదైన కేసులతో పాటు ఇకపై నమోదయ్యే కేసుల నుంచి రక్షణ కోసం ఢిల్లీ స్థాయిలో ధర్నా పేరిట స్కెచ్‌ వేసుకున్నారు. ఈ నేపథ్యంలో అతగాడు అలవోకగా అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు. 30 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్‌ ఇచ్చి కుల పక్షపాతానికి పాల్పడ్డారని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేశారు. సదరు అబద్ధం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో 2019 ఎన్నికలు కమ్మ వ్యతిరేకత ప్రాతిపదికన జరిగాయి. ఇప్పుడు ఢిల్లీ వేదికగా నెల రోజుల చంద్రబాబు పాలనలో 36 మంది హత్యకు గురయ్యారని జగన్‌ అలవోకగా అబద్ధాలు చెప్పారు. క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలియని ఢిల్లీ రాజకీయ నేతలు గానీ, మీడియా ప్రతినిధులు గానీ ఇందులో నిజానిజాల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయరు కదా! జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారు ఇలాంటి అబద్ధాలు చెప్పకపోయినా నోరు విప్పితే చాలు... కేసులు పెట్టడం చూశాం. నిజాలు ప్రచురించిన పత్రికలపై సీఐడీ ద్వారా కేసులు పెట్టించారు. ఇప్పుడు నెల రోజుల్లో 36 మంది హత్యకు గురయ్యారని, వందల మందిపై హత్యాయత్నం జరిగిందని జగన్‌రెడ్డి అదురూ బెదురూ లేకుండా అబద్ధాలు చెబుతున్నారు.


దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్‌ కో... శుక్రవారం శాసనసభలో బదులిస్తూ, అదే నిజమైతే ఎఫ్‌ఐఆర్‌లు బయటపెట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ హత్యలు మాత్రమే కాదు, వ్యక్తిగత కక్షలతో కూడిన హత్యలను కూడా కలుపుకొన్నా 36 హత్యలే జరగలేదు. అలాంటప్పుడు జగన్‌రెడ్డి వేసిన బాటలో చంద్రబాబు ప్రభుత్వం కూడా కేసులు పెట్టవచ్చు కదా? చంద్రబాబులో అంత తెంపరితనం ఉండదన్న నమ్మకం జగన్‌రెడ్డిలో ఉన్నట్టుంది. అందుకే వినుకొండలో ఇద్దరు రౌడీల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీయగా... దాన్ని బూచిగా చూపి ఢిల్లీ వరకు వెళ్లారు.

శవం... రాజకీయం...

జగన్‌రెడ్డి రాజకీయాలకు అబద్ధాలు ఒక్కటే ఆలంబన కాదు, శవాలు కూడా కావాలి. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం గరిష్ఠంగా వాడుకున్నారు. నేరాలు, హత్యలు చేసిన తన వాళ్లను మంచివాళ్లుగా చెప్పుకోవడం ఆయనకు అలవాటు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి కూడా మంచివాడుగానే కితాబు ఇస్తూ వచ్చారు. తనకు గానీ, తన వాళ్లకు గానీ ప్రమేయం ఉన్న సందర్భాలలో అదెలా జరిగిందో దేవుడికే ఎరుక అని చెప్పి తప్పించుకోవడం కూడా జగన్‌రెడ్డికి అలవాటే. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పాత్ర అందులో ఉందని ప్రచారం చేసిన జగన్‌రెడ్డి... తాను ముఖ్యమంత్రి అయ్యాక హత్య చేసింది ఎవరో దేవుడికే తెలియాలని సింపుల్‌గా తేల్చేశారు. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా ఓటమికి కారణం దేవుడికే తెలియాలని తేల్చిపారేశారు.

నిన్నగాక మొన్న మదనపల్లెలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం దహనం కేసులో కూడా అదెలా జరిగిందో దేవుడికే తెలియాలని చెబుతున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి చాలా మంచివాళ్లని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. జగన్‌రెడ్డి మాటలు వింటూ ఉంటే ‘అందరూ శ్రీవైష్ణవులే– బుట్టలోని రొయ్యలు మాత్రం మాయమయ్యాయి’ అన్న సామెత గుర్తుకొస్తుంది. జగన్‌రెడ్డి చేతులు పిసుక్కుంటూ పిచ్చి చూపులు చూడటాన్ని ట్రోల్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియా సిబ్బంది, తెలుగు తమ్ముళ్లు ఆనంద పడిపోతుంటారు కానీ... ఆ పిసుక్కోవడం వెనుక ఉండే వికృతమైన ఆలోచనలను పసిగట్టడంలో విఫలమవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన రాజకీయాలకోసం శవాలు ఎక్కడ దొరుకుతాయా అని జగన్‌ ఎదురుచూస్తుంటారు. తాజాగా వినుకొండలో రషీద్‌ శవం అతనికి లభించింది. వెంటనే వికృత రాజకీయాలకు తెరలేపారు. ఈ సందర్భంగా ‘స్పైడర్‌’ సినిమాలో ఎస్‌జే సూర్య క్యారెక్టర్‌ గుర్తుకు రాకుండా ఉండదు. ఆ సినిమాలో ఎవరైనా చనిపోతే విలన్‌ పాత్రధారి అలౌకిక ఆనందం పొందుతాడు.


ఎవరిది అరాచకం?

జగన్‌రెడ్డి విషయానికి వస్తే... అతను అప్పుడప్పుడూ నిజాలు చెబుతుంటాడు. అయితే, అవి ఏ కాలానికి సంబంధించినవన్నదే ప్రశ్న! రాష్ట్రంలో అరాచకాలు, విధ్వంసాలు ప్రబలాయని, ప్రశ్నించే వారిని వేధిస్తున్నారని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని జగన్‌రెడ్డి తాజాగా చెప్పుకొచ్చారు. ఇవన్నీ నిజమేగానీ, అలా జరిగింది తన పాలనలోనే అన్న నిజాన్ని మాత్రం జగన్‌ అంగీకరించరు. తన పాలనలో అరాచకం ప్రబలిందని నమ్మడం వల్లనే ప్రజలు తనను పదకొండు సీట్లకు పరిమితం చేశారని కూడా ఆయన ఒప్పుకోరు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత దేవుడు గొప్ప స్ర్కిప్ట్‌ రాశాడని గొప్పగా చెప్పుకొన్న జగన్‌రెడ్డి ఇప్పుడు కూడా అదే దేవుడు గొప్ప స్క్పిప్ట్‌ రాశాడని, చేసిన పాపాలకు తగిన శిక్ష విధించాడని మాత్రం ఒప్పుకోరు. ప్రజలు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వలేదని గుర్తించి, కోల్పోయిన ప్రజాభిమానం చూరగొనే ప్రయత్నం మాత్రం ఆయన చేయరు. అలా చేస్తే అతను జగన్మోహన్‌రెడ్డి ఎందుకవుతారు? తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే శాసనసభకు కూడా హాజరు కానని అతగాడు తాజాగా సెలవిచ్చారు. ప్రజలే ఇవ్వని హోదా కోసం హైకోర్టును ఆశ్రయించడం జగన్‌రెడ్డికే చెల్లింది. జగన్‌రెడ్డి శాసనసభకు హాజరైనా, అవకపోయినా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. చంద్రబాబు శాసనసభకు హాజరు కాకూడదని నిర్ణయించుకోవడం వెనుక బలమైన కారణం ఉందని కొందరైనా అంగీకరిస్తారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే శాసనసభకే రానని చెప్పడమే జగన్‌రెడ్డి ప్రత్యేకత. సంప్రదాయ రాజకీయాలకు అలవాటుపడిన వారి అభిప్రాయాలకు ఆయన విలువ ఇవ్వరు. అతడి ఆలోచనల వెనుక అంతరంగం అంతుబట్టదు. అన్నీ తెలిసేసరికి రాజకీయ ప్రత్యర్థులకు జరగాల్సిన నష్టం జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ విధ్వంసాన్నే నమ్ముకున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా విధ్వంసాన్నే నమ్ముకుంటున్నారు.


ధనం... అధికారం...

జగన్‌రెడ్డి వద్ద అంతులేని ధన బలం ఉంది. అతడికి కావాల్సింది అధికారం! ‘అధికారం కోసం ధనం – ధనం కోసం అధికారం’ అన్న సూత్రాన్ని జగన్‌రెడ్డి బలంగా నమ్ముతారు. అందుకే శాసనసభకు హాజరై అతను టైం వేస్ట్‌ చేసుకోరు. ప్రజా సమస్యలపై గొంతు విప్పడానికే ప్రతిపక్షం ఉంటుందన్న పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాలను జగన్‌ నమ్మరు. తాడేపల్లి ప్యాలెస్‌లోనో, బెంగళూరు ప్యాలెస్‌లోనో, మరోచోట నిర్మించుకున్న ప్యాలెస్‌లోనో సతీసమేతంగా సేదదీరుతూ విధ్వంస రచన చేస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలను అణచివేసేందుకు విధ్వంస రచనకే అధిక సమయం కేటాయించిన విషయం మరచిపోకూడదు. రాష్ర్టాన్ని వరదలు ముంచెత్తినా జగన్‌కు పట్టదు. జగన్‌ తరహా రాజకీయాలు ఒంటబట్టించుకోని షర్మిల మాత్రం సంప్రదాయ రాజకీయాలను నమ్ముకున్నట్టున్నారు. అందుకే వరద నీటిలో దిగి ఫొటోలు దిగారు. ఇలాంటివి చిల్లర రాజకీయాలుగా జగన్‌ భావిస్తారు. 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేయడమెలా? అన్న దానిపైనే ఇప్పుడు ఆయన ఫోకస్‌ ఉంటోంది. ఇందుకోసం అతను ఎటువంటి విధ్వంస రచన చేస్తారో వేచిచూడాలి.


చంద్రబాబు తెలుసుకోవాలి...

తాను పది ఎన్నికలు చూశానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొంటున్నారు కానీ, జగన్‌రెడ్డి వంటి వారిని ఇప్పుడే చూస్తున్నానని అనుక్షణం గుర్తు చేసుకోవాలన్నది మరచిపోతున్నారు. రాజకీయాలలో తన సమకాలీనుడైన వైఎస్‌ రాజశేఖరరెడ్డితో తలపడినప్పుడు చంద్రబాబుకు ఇన్ని ఇబ్బందులు ఎదురుకాలేదు. గత ఐదేళ్లు చంద్రబాబు రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయం. కార్యకర్త నుంచి చంద్రబాబు వరకు ప్రతి ఒక్కరినీ వేధించిన చరిత్ర జగన్‌రెడ్డిది. రాష్ర్టాభివృద్ధి ఎంత ముఖ్యమో, జగన్‌రెడ్డి వంటి వారిని రాజకీయంగా మళ్లీ కోలుకోకుండా దెబ్బతీయడం కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు తక్షణం గ్రహించాలి. అతగాడికి రాజకీయ భవిష్యత్తు లేదన్న నమ్మకం కుదిరితేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తారు. జగన్‌రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ముఖ్యం– రాష్ర్టాభివృద్ధిని ఆయన పట్టించుకోరు. ఈ క్రమంలో ఆయన ఎంతకైనా తెగిస్తారు. కేవలం వంద కోట్ల లిక్కర్‌ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయ కవిత జైలు జీవితం గడుపుతున్నారు. జగన్‌రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని 36 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని సీబీఐ తన చార్జిషీట్లలో పేర్కొంది. అయినా అదురూ బెదురూ లేకుండా క్రిమినల్‌ రాజకీయాలనే జగన్‌ నమ్ముకున్నారంటే అతను ఎలాంటివాడో అర్థం చేసుకోవాలి. మా ఓటర్లు వేరు అని చెప్పుకొనే జగన్‌రెడ్డి తన రాజకీయాలు వేరుగా ఉంటాయని కూడా చెప్పకనే చెబుతున్నారు. అర్థం చేసుకోలేకపోవడం అవతలివారి అవివేకం అవుతుంది. తాజా ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ద్వారా పాతాళానికి తొక్కినా రాజకీయంగా మళ్లీ ఊపిరి పోసుకోవడానికే జగన్‌ ప్రయత్నం చేస్తారు. అందుకోసం శవాల వేట కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కాకముందే రాష్ట్రపతి పాలన కోరడం మనకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు. ఈ డిమాండ్‌ చేయడం వెనుక ఎటువంటి వికృత ఆలోచనలు, వ్యూహాలు ఉన్నాయో గుర్తించే ప్రయత్నం చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుంది.

కొలంబియాకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మాఫియా డాన్‌ ఎస్కోబార్‌తో జగన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు పోల్చారు. ఎస్కోబార్‌ కేవలం డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ మీదే ఆధారపడ్డాడు. అధికారం చేపట్టలేదు. కానీ... జగన్మోహన్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కాలం కలిసొస్తే రాజకీయంగా ఊపిరిపోసుకొని మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నది జగన్‌రెడ్డి లక్ష్యం. ఇందుకోసం ఆయన ఎంతకైనా తెగిస్తారు. అప్రమత్తంగా ఉండటమా లేదా అన్నది చంద్రబాబు అండ్‌ కో తేల్చుకోవాలి. కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ సర్కార్‌ సహకారంతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలన్న చంద్రబాబు సంకల్పం వాంఛనీయమే కానీ, రాజకీయం కూడా అంతే ముఖ్యం. జగన్‌ విషయంలో ఏ మాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా రాజకీయ భూతం మళ్లీ జూలు విదిలిస్తుంది.


కేంద్రం అండపైనా అక్కసే...

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌లతో చర్చలు జరిపి రాష్ర్టానికి కేంద్రం సహాయంపై ఒక అవగాహన కుదుర్చుకొని వచ్చారు. ఫలితంగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర సంస్థల ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయల సహాయం లభించబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ఈ విషయాన్ని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించగానే అది అప్పు మాత్రమేనని, గ్రాంట్‌ కాదని జగన్‌ అండ్‌ కో విష ప్రచారం మొదలెట్టింది. తాను ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్లినప్పుడు ఎప్పుడైనా రాష్ట్రం గురించి అడిగిన దాఖలాలు చూపించే సాహసం జగన్‌ చేయలేరు. అయినా ఇప్పుడు అది అప్పు మాత్రమే అని ఎగతాళి చేయడాన్నిబట్టి జగన్‌ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక హోదా బదులుగా 2019కి పూర్వం కేంద్రం ఇవ్వజూపిన ప్రత్యేక ప్యాకేజీ ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. ఈ ప్యాకేజీ కింద లభించే సహాయాన్ని కేంద్రమే భరిస్తుంది. ఈ వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకోకుండా అబద్ధాల మత్తులో ప్రజలను ముంచెత్తేందుకు జగన్‌ అండ్‌ కో శక్తివంచన లేకుండా ప్రయత్నాలు మొదలెట్టారు. కారణాలు ఏమైనా శిథిలమైన రాష్ర్టాన్ని ఆదుకోవడానికి మోదీ ప్రభుత్వం ఇప్పుడు సంసిద్దంగా ఉంది. ఈ అవకాశాన్ని చంద్రబాబు ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి. ప్రత్యేక హోదా వంటి కాలం చెల్లిన నినాదాలను ఎవరు చేసినా పట్టించుకోకూడదు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని కోరడం రాజకీయమే అవుతుంది. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రం నిలదొక్కుకోలేదు. ప్రజలు ఈ వాస్తవాన్ని గుర్తించలేని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌కు మోక్షం ఉండదు. గతంలో జగన్‌ ట్రాప్‌లో పడి ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు వదులుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలు గ్రహించాలి. జగన్‌రెడ్డి ఎత్తుగడలు ఎన్నో రూపాల్లో ఉంటున్నాయి. వాటిల్లో ప్రజాహితం మచ్చుకైనా ఉండదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పదే పదే ప్రదర్శిస్తే చాలు. అతని వద్ద సమాధానం ఉండదు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు.


పులి కాదు.. పిల్లి

జగన్‌రెడ్డి ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో కొంత మంది ఇండియా కూటమి నాయకులు పాల్గొనడంతో ఆయన ఇండియా కూటమిలో చేరతారా? అన్న చర్చ మొదలైంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమాలకు కూడా ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేసే నాయకులను ఆహ్వానించేవారు. ఢిల్లీ రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి ఇవన్నీ తెలుసు. వచ్చే వారు ఎందుకు వస్తారో అందరికీ తెలుసు. జాతీయ మీడియాలో చోటు లభించాలంటే ఏం చేయాలో కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో జగన్‌రెడ్డి ఇండియా కూటమిలో చేరబోతున్నారా? అన్న చర్చలో వాస్తవం నేతి బీరకాయలోని నెయ్యి చందంగా ఉంటుంది. జగన్‌రెడ్డి అనే వ్యక్తి పులి కాదు పిల్లి అని అనేక సందర్భాలలో రుజువైంది. గతంలో బెయిలు కోసం సోనియాగాంధీ వద్ద సాగిలపడిన విషయం మరచిపోవద్దు. ఇప్పుడు ప్రధాని మోదీని ధిక్కరించిన బలమైన నాయకులకు కూడా ఏ గతి పట్టిందో తెలిసి కూడా జగన్‌రెడ్డి వంటి వారు మోదీని ధిక్కరించే సాహసం చేస్తారని అనుకోలేం. తన గారాల పట్టి కవితను విడిపించుకోవడం కోసం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనుషులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోవడాన్ని చూస్తున్నాం. కవితకు బెయిల్‌ వచ్చేలా సహకరిస్తే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడానికి కూడా కేసీఆర్‌ సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌రెడ్డి మోదీని ధిక్కరించి ఇండియా కూటమిలో చేరతారా? చేరితే ఏం జరుగుతుందో జగన్‌కు తెలియదా? సీబీఐ, ఈడీ కేసులలో విచారణ వేగవంతమైతే ఏం జరుగుతుందో జగన్‌కు తెలియదా? మరోవైపు రాష్ట్రంలో అధికారం వెలగబెట్టినప్పుడు చేసిన అరాచకాలు, అవినీతిపై కేసులు కట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించే సాహసం జగన్‌రెడ్డి చేసే అవకాశం లేదు. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు జగన్‌ రాజకీయాలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. కేంద్రంతో సఖ్యత సాధ్యం కాని పక్షంలో రాజ్యసభలోని తన సభ్యులను బీజేపీలోకి పంపడానికి కూడా మొహమాటపడరు.


ఆయనకు ప్రస్తుతం కేసుల నుంచి రక్షణ కావాలి. లేని పక్షంలో రాష్ట్రంలో రాజకీయంగా ఊపిరి పోసుకొనే విషయం అటుంచితే అతడి రాజకీయ జీవితమే కొడిగట్టే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయ విన్యాసాలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు... తాను మాత్రం బాగుండాలన్నదే జగన్‌రెడ్డి ఏకైక లక్ష్యం. అందుకోసం ఆయన ఏమైనా చేస్తారు. ఎంతకైనా దిగజారుతారు. ‘‘తన పెళ్లి లోకకళ్యాణమని, తన చావు జగత్ప్రళయమని’’ అనుకునే బాపతు జగన్‌. అధికారంలో ఉన్నంత కాలం తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును పెద్దగా ప్రస్తావించని జగన్‌రెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోయాక రాజశేఖరరెడ్డి పాలనను ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నాలను మళ్లీ మొదలుపెట్టడం గమనార్హం. ఈ మహానుభావుడికి ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి సంస్థలు దుర్మార్గంగా కనపడటంలో ఆశ్చర్యం ఏముంది? అయినా అతడిని మించిన దుర్మార్గుడు ఎవరుంటారు లెండి!

ఆర్కే

Updated Date - Jul 28 , 2024 | 06:59 AM

Advertising
Advertising
<