మాండలికంలో మొగలాయి
ABN , Publish Date - Mar 17 , 2024 | 01:24 AM
ఎవర్నయినా ఎందుకు తలుచుకుంటాం? ఎవర్నయినా ఎందుకు గుర్తు పెట్టుకుంటాం? ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన మాటలు ఇప్పుడు గుర్తొచ్చినా...

ఎవర్నయినా ఎందుకు తలుచుకుంటాం?
ఎవర్నయినా ఎందుకు గుర్తు పెట్టుకుంటాం?
ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన మాటలు ఇప్పుడు గుర్తొచ్చినా ఎందుకు మురిసిపోతాం?
తెలతెలవారుతుండగా పొలం గట్ల మీద నడుస్తున్నట్టు,
పొయ్యి మీద అన్నం ఉడుకుతున్నట్టు,
పొలిమేరలో నించుని చంద్రోదయాన్ని చూస్తున్నట్టు...
ఎవరైతే రాయగలుగుతారో వాళ్ళని ఎలా మరిచిపోతాం?
కంకుల మీద వాలిన పిచ్చికలు పలకరించినట్టు,
పిల్లలు... చెట్టు కొమ్మకి కట్టిన ఉయ్యాలలూగుతున్నట్టు,
రైతు కూలీ రెండు చేతులతో పంట కాల్వలో నీళ్ళు తాగుతున్నట్టు....
అంత సహజంగా, సమ్మోహనంగా రాయడం సాధ్యమేనా?
నామినిని తలుచుకోవడం అందుకే.
నామిని సుబ్రహ్మణ్య నాయుడు మాకు బాగా తెలిసినవాడని గొప్పగా చెప్పుకోవడమూ అందుకే.
నామిని రాసేవి కేవలం అక్షరాలు కావు. అవి మేలు రకం విత్తనాలు. వాక్యాలు కావవి, రాగులూ, సజ్జలూ, జొన్న రాశులు. తాటాకు గుడిసె ముందు చింకి చాప పరిచి, నిండు జీవితాన్ని ఎండబెడతాడు. నిరాశ నిండిన బతుకు నీడల మీద నుంచి నామిని నడిచి వెళిపోతుంటాడు. పల్లెటూరి పేదరికాన్ని, తిండి గింజలు లేని వేదనని దయతో, ప్రేమతో, అపేక్షతో చూస్తాడు. ఆ నిత్యజీవన వేదనలోని విషాద సంగీతాన్ని చెవివొగ్గి మరీ వింటాడు. ఆ చీకటిని కూడా వెలిగించగలిగే చిరునవ్వు వెనుక దాగిన హాస్యాన్నీ ఒడిసి పట్టుకుంటాడు. వాటిని కథలుగా రాస్తాడు.
గోగాకు వూరు బిండితో సద్ది తాగినట్టు,
ఆదివారం మాంసం కూరతో ఆబగా తిన్నట్టు,
నులక మంచమ్మీద నాన్న పక్కన సుఖంగా నిద్ర పోతున్నట్టు...
అలవోకగా రాసుకుంటూ పోతాడు. ఆ కుశాలను, మనేదను మనకి కానుకగా యిచ్చి వెళతాడు. అందుకే, నామిని కంప్లీట్లీ, అబ్సల్యూట్లీ ఒరిజినల్. ఇంగ్లీషు సాహిత్యమో, రావి శాస్త్రో, కేశవ రెడ్డో, పతంజలో.... మరే ఇతర ప్రభావమూ లేకుండా ఒక సొంత వాక్యాన్ని, ఒక సొంత స్టైల్‌నీ, తనే డిస్కవర్ చేసిన సొంత నేరేటివ్‌ని అక్షరాల్లో పలికించిన ‘మొగలాయి’ నామిని.
రాయలసీమ మాండలికం అనే కల్తీ లేని వెన్నెల విత్తనాలను రాష్ట్రమంతటా వెదజల్లితే, అవి మన పెరట్లో రంగురంగుల సీతాకోకచిలుకలై ఎగిరి, యాస పువ్వులై విరబూశాయి. సువాసనలు పంచి యిచ్చాయి. ఆ యాసకు వుండే సొగసునీ, తూగునీ, మాధుర్యాన్ని మనలో నింపుతూనే, ఆ వ్యక్తీకరణలోని శక్తితో గుండెను చీల్చి వేయడం అనే రహస్య విద్యలో ఆరితేరినవాడు నామిని. అక్షరాలను ఆవిర్లు ఎగజిమ్మే అన్నం మెతుకులుగా మార్చగలిగే నామిని, పచ్చనాకు సాక్షిగా మాండలికానికి అమ్మ.
అసలు నామిని అంటేనే ఒక ఉద్యానవనం.
నామిని అంటే ఒక పునరుజ్జీవనం.
మరో మాట లేదు... ప్రపంచస్థాయి రచయిత, ఆధునిక తెలుగు సాహిత్యంలో అగ్రతాంబూలం అందుకోవడానికి అర్హుడు.
నామిని రాసే చిత్తూరు జిల్లా భాష నుడికారంలో ఒక సౌందర్యం, జీవసుగంధం ఉంటాయి. కథ చెప్పడంలో నామినిది ఒక ప్రత్యేకమైన నేరేటివ్ టెక్నిక్. దూరం నుంచి చూస్తున్న ప్రేక్షకుడి లాగానే నిరపేక్షగా కథ నడిపిస్తాడు. ఆ శిల్పచాతుర్యం మనల్ని చకితుల్ని చేస్తుంది. ఎక్కడా తొణకడు. మెలోడ్రామాకు పాల్పడడు. పాఠకుణ్ణి ఇంప్రెస్ చేసే వేషాలు వేయడు. కేవలం వాక్యనిర్మాణ నైపుణ్యం మాత్రమే కాదు, నిస్సంకోచంగా భయమూ బెరుకూ లేకుండా చెపుతాడు. అతని చూపుతో, అభివ్యక్తితో అనంతమైన ఊహా శక్తితో ఒక అపూర్వమైన అనుభవానికి ద్వారాలు తెరుస్తాడు. ఉత్తమాభిరుచికి కొత్త దారులు పరుస్తాడు.
ఒక ఇస్మత్ చూగ్తాయి, సాదత్ హసన్ మంటోలా సాహసి నామిని. గుడిపాటి వెంకటచలంలా తిరుగుబాటుదారుడు.
ఆఫ్రికన్ ఆకలి అయినా, లాటిన్ అమెరికా నెత్తురయినా, మిట్టూరు కన్నీళ్లయినా పేదవాడి వేదన ఒక్కటే. బాధితుడి నిస్సహాయతా ఒక్కటే.
వడపోసిన జీవితానుభవసారాన్ని తేలిక మాటలతో సులభంగా, సూటిగా చెప్పడం అంత తేలికేమి కాదు. పైగా, పరిమళభరితమైన ఒక ప్రాంతీయ మాండలికానికి ఉత్తమ సాహిత్య గౌరవం యిచ్చి, తాను ముందుండి ఆ మహోద్యమాన్ని నడిపించిన లిటరరీ విజనరీ నామిని. పూట గడవని సామాన్య జనం యాసలోని రసపారవశ్యాన్ని అనుభవించి, ఆ పలుకుబడి మాధుర్యంతో మన దోసిలి నింపినవాడు. సహజసుందరమైన యాసలోని ఆత్మసౌందర్యాన్ని తెలుగు పాఠకుల గుండెల్లోకి వొంపినవాడు.
అలనాటి గురజాడ వెంకట అప్పారావుకీ, మన కాలం వీరుడు నామిని సుబ్రహ్మణ్యం నాయుడికీ మధ్య 75 సంవత్సరాల అంతరం వుంది.... వుందా? లేదేమో!
‘నాకు మానవ సమాజం పట్ల మహత్తరమైన బాధ్యత వున్నది. నాది ప్రజా ఉద్యమం. దానిని ఎవరిని సంతోషపెట్టడానికీ వదులుకోలేను’ అని స్పష్టంగా చెప్పారు గురజాడ. ఈ మాట నామినికి కూడా నూరు శాతం వర్తిస్తుంది.
కన్యాశుల్కం ఒక మహత్తరమైన నాటకం.
నామిని ‘మూలింటామె’ ఒక మహా కావ్యం.
వాడుక భాష అంటే భావవ్యక్తీకరణకు ప్రజలు వాడే పదజాలం. ప్రజలంటే మనమూ మనమిత్రపుత్ర బృందాలే అయినా, ఒక ప్రాంతం వాళ్ళు వాడే ముతకమాటల మూటలు మనకు దొరకవు. కోస్తా, ఉత్తరాంధ్ర యాసలో గొప్ప సాహిత్య సృష్టి జరిగినా, రాయలసీమ అనగానే ఏడుకొండలవాడిలాగా నామిని సుబ్రహ్మణ్య నాయుడు సాక్షాత్కారిస్తాడు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అనేకమంది రచయితలు మాండలికాన్ని పండించినా, ఆ ప్రాంతపు మాటల్ని ఇంత పదునుగా, ఇంత చురుగ్గా, ఇంత లాఘవంగా రికార్డు చేసి, పాత్రల చేత పలికించినవారు లేరు. మునికన్నడి మాట ఐనా, మూలింటామె దిగులైనా, మిట్టూరోడి మనేద అయినా, జీవ భాషగా ప్రవహించే యాసలోని సప్తస్వరాలనూ మన నరాల తీగలపై పలికించే తీవ్రతకు పాఠకులు దిమ్మతిరిగి సొమ్మసిల్లి పడిపోతారు. ఎండలో, వానలో, వెన్నెల్లో తడిచిన నాణ్యమైన మిట్టూరు మట్టిని తెలుగు సాహిత్యాకాశం అంచులదాకా విసిరినవాడు, జాను తెలుగుయాసను త్రికరణశుద్ధిగా జాతికి అంకితం చేసినవాడు నామిని ఒక్కడే! ఒక పాప, ఒక బాబు– నిద్రపోతున్న ఇద్దరు చిన్న పిల్లలు, ఆడ చందమామలా, మగ చందమామలా వున్నారని రాయడం తెలుగులో మరో రచయితకు సాధ్యం అయ్యే పనేనా?
అమ్మానాన్న చేసుకున్న పుణ్యం కావొచ్చేమో గానీ, సాక్షాత్తూ ఆ వెంకటేశ్వరస్వామి, ఏడు కొండలూ దిగి వచ్చి తెలుగు సాహితీ లోకానికి ఇచ్చిన అమూల్యమైన, అమృతతుల్యమైన కానుక నామిని సుబ్రహ్మణ్యం నాయుడు.
ఇందుకే అమరరాజా వారి రాజన్న ట్రస్ట్ నామినిని ‘మాండలిక బ్రహ్మ’ అంటోంది.
తాడి ప్రకాష్
(నేడు తిరుపతిలో సుప్రసిద్ధ రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడుకు రాజన్న ఫౌండేషన్ వారిచే ‘మాండలిక బ్రహ్మ’ అవార్డు ప్రదానం)