ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోదీ పాలనకు ప్రజాభి‘వంద’నం

ABN, Publish Date - Sep 21 , 2024 | 02:19 AM

వికసిత్ భారత్ సంకల్పం సాకారం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ బలమైన పునాదులు వేస్తున్నారు. ఒక నిర్ణయాత్మక, మహా సంకల్ప సాధన కోసం మార్గనిర్దేశనం చేస్తున్నారు.

వికసిత్ భారత్ సంకల్పం సాకారం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ బలమైన పునాదులు వేస్తున్నారు. ఒక నిర్ణయాత్మక, మహా సంకల్ప సాధన కోసం మార్గనిర్దేశనం చేస్తున్నారు. మునుపెన్నడూ లేనిరీతిలో సమాజంలోని ప్రతి వర్గానికి సాధికారతనిచ్చేలా దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటూ, సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి వరకు చేరేలా పాలన అందిస్తున్నారు. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా పేదలు, మధ్యతరగతి, అణగారిన ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. మోదీ 3.0 మొదటి వందరోజుల పాలనలో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులతో వ్యవసాయం, మౌలికవసతులు సహా వివిధ కీలక రంగాలకు పెద్దపీట వేశారు.


ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. మోదీ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పథకాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వేలు, భద్రత, ఇంధనం, సాంకేతికత వంటి అనేక రంగాలలో గత వంద రోజుల పాలనలో మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. దేశ ప్రగతిలో గణనీయ భాగస్వామ్యం రీత్యా వ్యవసాయానికి భవ్యమైన భవిష్యత్తును కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. రైతుల సమస్యల పరిష్కారంతో పాటు ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. ఇటీవల పీఎం కిసాన్ నిధి 17వ వాయిదా కింద 9.3 కోట్ల మంది రైతులకు 20 వేల కోట్లు అకౌంట్లలో జమచేసింది. వంద రోజుల పాలనలో వ్యవసాయ రంగంలో సాంకేతికతను వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ.. గ్రామీణ పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలకు అండగా నిలిచేలా 750 కోట్ల రూపాయలతో ‘అగ్రిష్యూర్’ పథకాన్ని ప్రారంభించింది. గోధుమలను నిల్వ ఉంచడానికి 3 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన ధాన్యాగారాలను ఏర్పాటు చేసింది. 2024–25 ఖరీఫ్ సీజన్‌కు కనీస మద్దతు ధరను పెంచి, రైతాంగానికి రూ.2 లక్షల కోట్లు ప్రయోజనం చేకూర్చింది.


వ్యవసాయాన్ని సుస్థిరం చేసేందుకు ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాలకు విధివిధానాల రూపకల్పన చేసింది. విపత్తుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన వ్యవస్థను నిర్మించింది. 2 వేల కోట్ల నిధులతో ‘మిషన్ మౌసం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. మత్స్యకార రంగం బలోపేతానికి 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులను ఏర్పాటు చేసింది. ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.28,602 కోట్లతో దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2,361 కోట్ల నిధులతో ఒక ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని తెలంగాణలోని జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా ముందడుగు వేయనుంది. హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది.


ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారతదేశంలో లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు, సిమెంట్, బాక్సైట్, సున్నపురాయి, అల్యూమినియం పౌడర్, గ్రానైట్, బ్యాలస్ట్, కంటైనర్లు మొదలైన సరుకుల రవాణాకు కనెక్టివిటీ పెంచడంపై దృష్టి సారించింది. ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం, సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించడం, చమురు దిగుమతి, కర్బన ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా, రోడ్డు, రైలు, ఓడ‌రేవులు, వైమానిక‌మార్గాల క‌నెక్టివిటీని, ఆర్థిక వృద్ధిని బ‌లోపేతం చేయ‌డం కోసం 3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టింది. ప్ర‌పంచంలోనే 10 అత్యుత్త‌మ ఓడ‌రేవుల్లో ఒక‌టిగా నిలిచేలా 76,000 కోట్ల నిధులతో మ‌హారాష్ట్ర‌లో ‘వదవాన్’ ఓడరేవుకు శంకుస్థాపన చేసింది. వివిధ రాష్ట్రాల‌లో 900 కిలోమీట‌ర్ల మేర‌కు రైల్ నెట్‌వ‌ర్క్‌ను విస్త‌రించేలా 24,600 కోట్ల రూపాయలతో 8 నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులు ప్రారంభించింది. ఇందులో తెలంగాణ నుంచి కూడా ఓ రైల్వే లైను ఉంది. 4,109 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో.. భద్రాచలం–మల్కన్‌గిరి మధ్య 173 కి.మీ.ల ప్రాజెక్టుకు ఆమోదముద్ర పడింది. 900 కిలోమీటర్ల మేర 8 జాతీయ రహదారుల అభివృద్ధికి 50,600 కోట్ల‌ రూపాయలు కేటాయించింది.


దేశంలో 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా వర్తింపచేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. వృద్ధులు 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. తెలంగాణ నుంచి అదనంగా మరో 10లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఖరీదైన మూడు కేన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించింది. మెడికల్ కాలేజీల సంఖ్య పెంచి, అదనంగా 75 వేల సీట్లను పెంచి వైద్య విద్యను ప్రోత్సహిస్తోంది. సైన్స్, టెక్నాలజీ రంగంలో సృజనాత్మకతకు పెద్దపీట వేసేలా.. రూ.10,600 కోట్లతో విజ్ఞాన్ ధారా పథకాన్ని ప్రారంభించింది. భారతదేశం నానాటికీ బలం పుంజుకోవడానికి మూలం దేశంలోని యువశక్తే. అందుకే వారిని మరింత శక్తిమంతం, స్వయంసమృద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అందుకు అనుగుణంగా యువతకు ఉపాధి, స్వయం-ఉపాధి లక్ష్యంగా ఎన్నడూ లేనిరీతిలో అవకాశాలు కల్పించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. యువతలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కోసం 2 లక్షల కోట్ల నిధులతో ప్రధానమంత్రి ప్యాకేజిని ఏర్పాటుచేసింది. దీంతో 4.1 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీని నిరోధించి, పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. తెలంగాణలో పేపర్ లీకేజీలతో లక్షల మంది యువత జీవితాలు బుగ్గిపాలయ్యాయి. కీర్తి (ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్) కార్యక్రమం తీసుకొచ్చి, అనేక మంది క్రీడాకారులకు ప్రోత్సహిస్తోంది.


మహిళలు కొనుగోలు చేసే ఆస్తులపై స్టాంప్ డ్యూటీ తక్కువ ఉండేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తోంది. నారీ శక్తికి లబ్ధి చేకూర్చేలా అభివృద్ధి పథకాలకు 2024–25 బడ్జెట్‌లో 3 లక్షల కోట్లు కేటాయించింది. 48 లక్షల మంది స్వయం సహాయక బృందాల సభ్యులకు లబ్ధి చేకూరేలా 4.3 లక్షల మందికి 2,500 కోట్ల రూపాయలతో రివాల్వింగ్ ఫండ్‌ను విడుదల చేసింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, సంరక్షణ కోసం, వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను ప్రవేశపెట్టింది.

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు పీఎం సూర్యఘర్ ముక్త్ బిజిలి యువజన పథకం కింద భారీ సబ్సిడీ పథకాన్ని తీసుకొచ్చింది. 3.5 లక్షల ఇండ్లలో సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నది. దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే క్రమంలో రెన్యూయబుల్ ఎనర్జీ (సోలార్+విండ్+హైడ్రోజన్)పై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను నిర్ధారించింది. పెట్రోలులో 20 శాతం ఇథనాల్ మిక్స్‌తో రైతులకు సంవత్సరానికి రూ.50 వేల కోట్ల అదనపు ఆదాయం లభించనుంది. 2030 నాటికి భారతదేశం 500 గిగావాట్ల గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రతి రైల్వేస్టేషన్ సీలింగ్‌పై సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేస్తున్నది.


దేశ వ్యాప్తంగా 63,000 గ్రామాల్లోని 5 కోట్ల మంది గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రధానమంత్రి జన్ జాతియా ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని తీసుకొచ్చింది. చెత్త సేకరించే వారి కోసం నమస్తే పథకానికి శ్రీకారం చుట్టి, వారి సామాజిక, ఆర్థిక సాధికారతకు దోహదపడుతోంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి 2.9 లక్షలకు పైగా దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వలస చట్టాల స్థానంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు తెచ్చింది. వీటిలో శిక్ష కన్నా న్యాయంపైనే దృష్టి పెట్టింది. 2250 కోట్ల నిధులతో నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్‌హాన్స్‌మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టి సకాలంలో, శాస్త్రీయంగా ఆధారాల పరిశీలన చేస్తున్నది. ఒడిశా, జార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా పూర్వోదయ ప్రణాళిక రూపొందించారు. మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి కార్యక్రమం వికసిత్ భారత్ @2047కు దోహదం చేసేదే.

కె. లక్ష్మణ్

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు

Updated Date - Sep 22 , 2024 | 12:49 AM