Telangana Elections: జోష్ కొరవడడంతో పార్టీల కేడర్‌లో నిరుత్సాహం
ABN, Publish Date - May 06 , 2024 | 06:40 AM
అప్పుడేమో.. ప్రత్యర్థి పార్టీల్లో పలుకుబడి ఉన్నవారైతే పిలిచి మరీ కండువాలు! వీధివీధినా ఆత్మీయ సమ్మేళనాలు! దావత్‌లతో రాత్రింబవళ్లు మందు పార్టీలు! ఖర్చుకు లెక్కే లేదు! గడపగడపకూ నాయకులు! ఓటరన్నకు వంగివంగి దండాలు..!
సమ్మేళనాలు.. దావత్‌లు.. డబ్బుల పంపిణీ లేదు
ద్వితీయ శ్రేణి నేతల చేరికలపై పట్టింపు కరువు
ప్రచార రథాల చక్కర్లు, మైకుల మోత తక్కువే
హంగామా లేకుండా సాదాసీదాగా ప్రచార పర్వం
అసెంబ్లీ-లోక్‌పభ ఎన్నికల మధ్య చాలా వ్యత్యాసం
అగ్ర నేతల పర్యటనలు, సభలున్నపుడే హడావుడి
అప్పుడేమో.. ప్రత్యర్థి పార్టీల్లో పలుకుబడి ఉన్నవారైతే పిలిచి మరీ కండువాలు! వీధివీధినా ఆత్మీయ సమ్మేళనాలు! దావత్‌లతో రాత్రింబవళ్లు మందు పార్టీలు! ఖర్చుకు లెక్కే లేదు! గడపగడపకూ నాయకులు! ఓటరన్నకు వంగివంగి దండాలు..! ఇప్పుడేమో.. ప్రచార రథాల్లో హోరెత్తే మైకుల మోత లేదు.. ర్యాలీల్లో రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాల సందడి లేదు.. పార్టీల్లో చేరికల పేరిట డబ్బు ఎర లేదు.. ఆత్మీయ సమ్మేళనాలంటూ ఆలింగనాలూ లేవు.. మత్తులో ముంచెత్తే విందులూ లేవు..!
సరిగ్గా ఆరంటే ఆరే నెలలు.. అవీ ఎన్నికలే. ఇవీ ఎన్నికలే. కానీ, పూర్తిగా తేడా. ఎందుకంటే.. అవి అసెంబ్లీ ఎన్నికలు. ఇవి పార్లమెంటువి. వాస్తవానికి ఈ రెండూ కలిసొస్తే అభ్యర్థులు ఓ మాట అనుకుని ఖర్చు పెట్టేవారు. ఎంపీ అభ్యర్థులు ఇచ్చే ఫండ్.. ఎమ్మెల్యే అభ్యర్థులకు వేన్నీళ్లకు చన్నీళ్లు తోడైనట్లు ఆసరాగా ఉండేది. వీటికి సొంత ఆర్థిక వనరులు, పార్టీ ఇచ్చే డబ్బును కలుపుకొని ఎమ్మెల్యే అభ్యర్థులే ఎన్నికలను భుజాన మోసేవారు. ఎంపీ అభ్యర్థులు వారిని అనుసరిస్తూ ప్రచారంలో పాల్గొనేవారు. కానీ, ఇప్పుడు ఎవరి గోల వారిదే అన్నట్లుంది. అందుకే కాసుల కళకళ.. సీసాల గలగల లేదు. పోలింగ్ పది రోజులే ఉండగా.. అంతా మొక్కుబడిగా గడిచిపోతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నాటి వైభవాన్ని, ప్రస్తుత పరిస్థితిని తలుచుకుని పార్టీల కేడర్ ఉసూరుమంటున్నారు.
భరించడం కష్టమే..
ఒక్కో పార్లమెంటు పరిధిలో ఏడు వరకు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. డబ్బు సర్దుబాటులో ఎంపీ అభ్యర్థులకు.. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడినవారు) మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. వ్యాపార నేపథ్యం ఉన్నవారు కాస్త ఖర్చు పెడుతున్నా, మిగిలినవారు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. ‘మీరు డబ్బులు ఇస్తేనే.. మా క్యాడర్ వస్తారు. లేకపోతే మీ ఇష్టం!’ అని అసెంబ్లీ ఇన్‌చార్జులు కుండబద్దలు కొడుతున్నారు. ఫండ్‌తో పాటు ప్రాధాన్యం ఏమాత్రం తగ్గినా అలకపాన్పు ఎక్కుతున్నారు. కాదని ముందుకెళ్లే పరిస్థితి లేదు. దీంతో వారిని భరించడం ఎంపీ అభ్యర్థుల వల్ల కావడం లేదు.
చేరికలున్నాయి.. కానీ ఫ్రీ
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల కేడర్‌లో అసెంబ్లీ ఎన్నికల నాటి జోష్ లేదు. కారణం ఎంపీ అభ్యర్థులు ఆచితూచి ఖర్చు పెడుతుండడమే! గత ఎన్నికల సందర్భంగా.. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పదవులు లేకపోయినా ఓటర్లను ప్రభావితం చేయగలిగే నేతలకు స్థాయిని బట్టి చెల్లించారు. రూ.50 వేలు, లక్ష.. రూ.5 లక్షలు, రూ.10 లక్షల వరకు ‘సర్దుబాటు’ చేశారు. పార్టీలో చేర్చుకునేందుకు కూడా డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు కూడా చేరికలున్నాయ్.. కానీ, అన్నీ ఉచితమే. అప్పటి అధికార బీఆర్‌ఎ్‌సలో చేరికల సందడే సందడి. ఇప్పుడు అధికార కాంగ్రెస్, బీజేపీలోనూ అంతా గప్‌చుప్. కాసుల గలగల లేక.. ద్వితీయ శ్రేణి నేతలు ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోవడంలేదు. అగ్ర నేతల పర్యటనలు, ముఖ్య నేతల సమావేశాలు ఉంటేనే కాలు బయట పెడుతున్నారు. మిగతా సమయంలో పనుల్లో నిమగ్నం అవుతున్నారు.
ఆత్మీయ సభల్లేవు.. దావత్‌లు లేవు
అసెంబ్లీ ఎన్నికలకు నెల, రెండు నెలల ముందు నుంచే కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు, రైతులు, మహిళలు, యువజన, ఉద్యోగ సంఘాలతో సదస్సులు నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనాల్లో మద్యం ఏరులై పారింది. బిర్యానీలు వండిపెట్టారు. బస్సులు, జీపులు, దారి ఖర్చులతో పాటు సభలు, సమావేశాలకు వచ్చినవారికి రూ.250 నుంచి రూ.500 ఇచ్చారు. బూత్‌ల వారీగా ఇన్‌చార్జులను నియమించి.. ఓటర్ల లెక్కన డబ్బులు, మద్యం, మాంసం పంచారు. పోలింగ్‌కు 2 రోజుల ముందు నుంచి ఓటుకు రూ.500 మొదలు1,500 వరకు అందజేశారు. ప్రతిష్ఠాత్మక, ప్రధాన నియోజకవర్గాల్లో ఓటుకు రూ.3 వేల-రూ.5 వేల చొప్పు న కూడా పంచారు. ఇప్పుడు ఇది మచ్చుకైనా లేదు.
మారిన సరళి..
ఈసారి ప్రచార సరళి కూడా మారిపోయింది. ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎం, రాష్ట్ర మంత్రులు, పార్టీ అగ్ర నేతల సభలు, సమావేశాలను మాత్రమే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. వీరు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లకు ప్రాధాన్యమిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇంటింటి ప్రచారం పెద్దగా కనిపించడం లేదు. ద్వితీయ శ్రేణి నేతలు క్రియాశీలంగా ఉన్నచోట.. నమూనా బ్యాలెట్ ఇస్తున్నారు. ఫ్లెక్సీలు, డోర్ పోస్టర్లు, వాల్ పోస్టర్లు కూడా పరిమితమే.
- ఆదిలాబాద్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి
Updated Date - May 06 , 2024 | 06:40 AM