GAC FRUIT:ఈ పండు తింటే.. ముసలితనం రాదు
ABN, Publish Date - Dec 17 , 2024 | 05:20 PM
వియత్నాం, మలేషియా, థాయ్‌లాండ్, చైనా దేశాల్లో మాత్రమే కనిపించే ఈ పండు ఇప్పుడు ఇండియాలోనూ లభిస్తోంది. పుచ్చకాయ జాతికి ఇది పోషకాల గని. నిత్యయవ్వనంగా ఉంచేలా చేసే ఈ పండు పేరు...
రంగులో నారింజలా, ఆకారంలో చిన్నపాటి పనసలా కనిపిస్తున్న ఈ పండు పేరు గ్యాక్ ఫ్రూట్. శాస్త్రీయ నామం మొమోడికా కొచిన్‌చైనెన్సిస్. వియత్నాం, మలేషియా, థాయ్‌లాండ్, చైనా దేశాల్లో మాత్రమే కనిపించే ఈ పండు ఇప్పుడు ఇండియాలోనూ లభిస్తోంది. పుచ్చకాయ జాతికి గ్యాక్ ఫ్రూట్ పోషకాల గని. ఈ పండు ఒక్కటి తింటే చాలు. 3, 4 రకాల పండ్లు తిన్నంత. ఇందులో క్యారెట్లో కంటే 10 రెట్లు ఎక్కువగా బీటెన్ కెరోటిన్, టమాటాలో కంటే 70 రెట్లు ఎక్కువగా లైకోపీన్ ఉంటాయి. నారింజపండులో కంటే 40 రెట్లు అధికంగా విటమిన్-సి లభిస్తుంది. ఒమెగా త్రీ ఫ్యాటీయాసిడ్లు, విటమిన్-ఇలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనికి 'హెవెన్ ఆఫ్ ఫ్రూట్' అని నామకరణం చేశారు సైంటిస్ట్‌లు.
స్వర్గఫలంగా పిలిచే గ్యాక్ ప్రూట్ తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలున్నాయి. ప్రపంచంలో అధిక మంది ప్రజలు ఎదుర్కొంటున్న డిప్రెషన్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి దరి చేరవు. ఇందులో లభించే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు జీర్ణశక్తి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ నివారించే ఈ పండు గుజ్జును ఎండబెట్టి పౌడర్‌గా చేసి లైకోపీన్ ట్యాబెట్లు తయారుచేస్తున్నాయి ఫార్మా కంపెనీలు. ఇన్ని పోషకాలు ఉండటం చేతే గ్యాక్ ఫ్రూట్‌కు ఆన్‌లైన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. కిలో ధర రూ.1000 నుంచి రూ.1200 వరకూ ఉంది. ఇక ఎండబెట్టిన గ్యాక్ ఫ్రూట్ పౌడర్ ధర ఏకంగా రూ.25 వేలు పలుకుతోంది.
అరకిలో నుంచి కిలో బరువుండే గ్యాక్ ఫ్రూట్ కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది. తర్వాత పసుపు, నారింజ, ఎరుపు రంగులోకి మారుతుంది. క్రీమీగా ఉండే గ్యాక్ ఫ్రూట్ గుజ్జు రుచిలో కాస్త తియ్యగా అనిపిస్తుంది. కాయగా ఉన్నప్పుడు సూప్‌లు, కూరల్లో వేసుకుంటే స్పెషల్ టేస్ట్ వస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ తీగ జాతి మొక్కను పందిళ్ల ద్వారా పెరట్లోనైనా నాటుకోవచ్చు. ఒకసారి నాటితే ఒక్కో మొక్క 20 సంవత్సరాల వరకూ కాపునిస్తుంది. ఏడాది తర్వాత ఒక్కో మొక్క నుండి దాదాపు 50 నుంచి 60 కాయలు కాస్తాయి. హ్యాండ్ పాలినేషన్ ద్వారా మంచి దిగుబడి లభిస్తుంది.
అనారోగ్య సమస్యలొక్కటే కాదు. నిత్యయవ్వనంగా ఉంచే శక్తి గ్యాక్ ఫ్రూట్ సొంతమని తేల్చారు పోషకాహార నిపుణులు. అందుకే ఈ హెవెన్ ఫ్రూట్‌ను డైట్‌లో భాగం చేసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అని సూచిస్తున్నారు.
Updated Date - Dec 17 , 2024 | 05:26 PM