Mental Stress: తీవ్రమైన మానసిక ఒత్తిడి వేధిస్తోందా.. అయితే తప్పక తెలుసుకోండి..
ABN, Publish Date - Dec 27 , 2024 | 07:14 AM
మానసిక ఒత్తిడికి గురవుతున్న వ్యక్తులు ఆఫీసు, ఆర్థిక, కుటుంబ సమస్యలు మరిచిపోయి ఇష్టమైన వారితో సమయం గడపాలని మానసిక వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న సమయంలో పనికి బ్రేక్ తీసుకుని ఏదైనా నచ్చిన ప్రదేశానికి వెళ్లాలని సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక ప్రపంచంలో మానసిక ఒత్తిడి అనేది అతిపెద్ద సమస్యగా మారింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఒత్తిడికి గురవుతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా అతిగా ఆలోచిస్తూ ఆందోళనకు గురవుతున్నారు. మారిన జీవన పరిస్థితులూ అందుకు తోడయ్యాయి. నేటి సమాజంలో ఉద్యోగం చేసే వారు తీవ్రమైన పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అలాగే ఆర్థిక, కుటుంబ సమస్యలు వంటివి తీవ్ర ఆందోళనకు గురి చేసి అది కాస్త మానసిక ఒత్తిడికి దారి తీస్తోంది. దీంతో బీపీ, గుండెపోటు సహా ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే మెరుగైన జీవనశైలితో మందులు లేకుండా మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇవి పాటించండి చాలు..
మానసిక ఒత్తిడికి గురవుతున్న వ్యక్తులు ఆఫీసు, ఆర్థిక, కుటుంబ సమస్యలు మరిచిపోయి ఇష్టమైన వారితో సమయం గడపాలని మానసిక వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న సమయంలో పనికి బ్రేక్ తీసుకుని ఏదైనా నచ్చిన ప్రదేశానికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇష్టమైన పనులు చేయడం, మంచి సంగీతం వినడం, స్నేహితులు, కుటుంబంతో గడపడం వంటి పనులు ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు.
మంచి ఆహార నియమాలు పాటిస్తే మానసిక ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను న్యాచురల్‌గా తగ్గించుకోవడమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఇదే విషయాన్ని అనేక పరిశోధనలు నిరూపించాయని వెల్లడిస్తున్నారు. కొన్ని రకాల ఆహారాలు ఆందోళన, ఒత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని సూచిస్తున్నారు.
అలాగే ప్రతి రోజూ ఉదయం యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. యోగా, ధ్యానం వల్ల ఆందోళన తగ్గి ఒత్తిడిని నియంత్రించుకోవచ్చని చెబుతున్నారు. మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న వారు మంచి డైట్‌తోపాటు రోజూ కనీసం అరగంటపాటు యోగా, ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.
యోగా, ధ్యానంతోపాటు ప్రతి రోజూ వ్యాయామం చేయడం ద్వారా మానసిక ఒత్తిడికి చెక్ పెట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా చేసే వ్యాయామంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, అందులో ముఖ్యంగా ఒత్తిడికి గురవుతున్న వారు దీన్ని నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు.
క్రమబద్దమైన జీవన శైలి సైతం మానసిక ఒత్తిడికి పరిష్కారం చూపించగలదని నిపుణులు చెబుతున్నారు. రోజూ మంచి ఆహారం తింటూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలని సూచిస్తున్నారు. నిద్రలేమితో బాధపడుతున్న వారిలో మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సమయానికి అన్ని పనులు చేయడం, అతిగా ఆలోచించకపోవడం, ప్రతి చిన్న విషయానికీ ఆందోళనకు గురికాకుండా చూసుకోవడం ద్వారా ఒత్తిడి అనే సమస్యను జయించవచ్చని చెబుతున్నారు. లేదంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి కాస్త డెప్రెషన్‌గా మారి అనేక ప్రమాదాలు తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు.
Updated Date - Dec 27 , 2024 | 07:14 AM