ప్రాణప్రదం పాలకూర
ABN, Publish Date - Dec 22 , 2024 | 10:57 AM
‘‘జీవన్తి అనే ఓషధి ఉంది. దానికి పాల కూర అని ఏదో తెచ్చి ఇస్తున్నారు. ఇక్కడ అమ్మే పాలకూరలో పాలూ లేవు, కూర లేదు. నాగపూర్ నుండి ఇది దిగుమతి అయ్యింది. ఎండిన మాంసాన్ని కూర చెయ్యడానికి ఈ కూరను ఉపయోగిస్తారు.
‘‘జీవన్తి అనే ఓషధి ఉంది. దానికి పాల కూర అని ఏదో తెచ్చి ఇస్తున్నారు. ఇక్కడ అమ్మే పాలకూరలో పాలూ లేవు, కూర లేదు. నాగపూర్ నుండి ఇది దిగుమతి అయ్యింది. ఎండిన మాంసాన్ని కూర చెయ్యడానికి ఈ కూరను ఉపయోగిస్తారు. అసలు పాలకూర మనుబాల అనీ, వలంగ్ తోడు అని ఇక్కడ వ్యవహరిస్తారు. వలంగు తోడు అంటే మంచాలను విరగ్గొట్టేది అని బంజారాల భాషలో అర్థం.’’
పాలకూర గురించి శ్రీవేదాల రామానుజ స్వామి చెప్పిన విశేషాలివి. నిజంగా మంచాలు విరగ్గొట్టేంత లైంగికశక్తినిచ్చే పాలకూర మనం తినే పాలకూరా ఒకటేనా? పాలకూర తినగానే ఏనుగంత బలం వచ్చేస్తుంది ‘పాపాయ్’ కార్టూన్ సీరియల్లో!
పాలకూర నిజమైన ఎనర్జీ బూస్టర్. మన నుంచి అరబ్ దేశాలు స్వీకరించి ప్రపంచం అంతా విస్తరింప చేయగా, స్పెయిన్ నుండి తెచ్చుకుని స్పెయిన్ కూర అనే అర్థంలో ‘పినాచ్’ అని ఇంగ్లీషువాళ్లు పిలిచారు. వసంత రుతువప్పుడు ఏ కూరగాయలు దొరక్క పోయినా పాలకూర దొరుకుతుందని ఇంగ్లీషువాళ్లు దీన్ని బాగా ఇష్టపడ్డారు.
జీవం, జీవంతి, జీవద, జీవధాత్రి, జీవదృష్ట, జీవన, జీవని, జీవ్యము, జైత్రి, జయంతి ఇలాంటి పేర్లున్న పాలకూరని పాలికా అని పాకశాస్త్ర గ్రంథాల్లో వివరించారు. పాలకూర అనే తెలుగు పేరు ఈ పాలిక లేదాపాలిక్యాన్ని బట్టే వచ్చింది. ‘‘పాలిక్యం దలితం శాకం తిల తైలె విపాచితమ్ /అమ్లద్రవ్యసమాకీర్ణ హింగు సైంధవసంయుతమ్’’ అని, క్షేమకుతూహలం పాకశాస్త్ర గ్రంథంలో చక్కగా వివరించింది.
పాలకూర ఆకుల్ని తుంచి తెచ్చుకుని కడిగి శుభ్రం చేసి సన్నగా తరగాలి. తిలతైలే విపాచితమ్: ఒక భాండీలోకి నువ్వులనూనె కొద్దిగా తీసుకుని ఇంగువ, తాలింపు గింజలు వేగించి ఈ తరుగుని అందులో వేయాలి. ఆమ్లద్రవ్యసమాకీర్ణం: పుల్లగా వుండే చుక్క కూర లేదా చింత చిగురుని కూడా తరిగి తగినంతగా ఇందులో కలపాలి. సరిపడ సైంధవలవణం కలిపి నీళ్ళమూతబెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన పాలకూరని కూర పొడి కలిపి అన్నంలో పొడికూరగా తినవచ్చు. ఉడికించిన పప్పు కలిపి కమ్మని పాలకూర పప్పు తినొచ్చు. మెత్తగా నూరితే పచ్చడి అవుతుంది. వేడన్నంలో కలిపితే పాలక్ రైస్ అవుతుంది. చింతపండు రసం పోస్తే పులుసు కూర అవుతుంది. మెత్తగా మిక్సీ పట్టి ఉల్లి, వెల్లుల్లి ఇతర సుగంధ ద్రవ్యాలు చాలినంత కలిపి పాలక్ లాంటి మసాలా కూర చేసుకోవచ్చు. కారపు రుచికోసం అల్లం మిరియాల పొడి మిరపకారం కలుపుకోవచ్చు.
పేరుకి పాలకూరే గానీ దీనికి పాలతో విరోధం ఉంది. పాలు, పాల పదార్థాలతో కలిపి వండకూడదు. అందుకని పన్నీర్ ముక్కలు కలిపిన పాలక్ పన్నీరు లాంటివి శాస్త్ర విరుద్ధం. ఇది వాత కఫాలను పెంచుతుంది కాబట్టి, ఉల్లి, వెల్లుల్లి, మిరియాలు, ఇతర మసాలా ద్రవ్యాలతో కలిపి వండటమే ఉత్తమం. ఎక్కువ చింతపండు వాడిన పాలకూర హానికరం అవుతుంది. పాలకూరని మిక్సీ పట్టి పలుచగా రసం తీసి కమ్మగా చారు కాచుకుంటే, బలకరం, పుష్టి ప్రదం. సుఖవిరేచనం అవుతుంది. వేడి తగ్గుతుంది.
52శాతం ఎ-విటమిన్ దీని ద్వారా లభ్యమవు తుంది. 10శాతం క్యాల్షియం-22శాతం ఇనుము, 13శాతం ఇ-విటమిన్, 47శాతం సి-విటమిన్లు కూడా దొరుకు తాయి. గొప్ప పోషక పదార్థాలు కలిగిన వంటకం ఇది. ఈ పోషకాలు పోకుండా ఉండా లంటే పాలకూరని నీళ్ళలో వండి, వార్చకుండా క్షేమకుతూహలం చెప్పిన పద్ధతిలో తక్కువ ఉష్ణోగ్రత దగ్గర మగ్గించటమే మేలు.
ఇనుము లభించే విషయంలో పాలకూర గోంగూర సమానమే! కానీ, గోంగూర వేడి చేస్తుంది నొప్పుల్ని బైటపెడుతుంది. పాలకూర చలవనిచ్చి ఉపశమింపచేస్తుంది. యాపిల్ కన్నా చవక. జంతు మాంసం నుండి త్వరగా రక్తంగా మారే ఇనుము (heme-iron), మొక్కల నుండి ఆలస్యంగా మారే ఇనుము (non hemeiron) లభిస్తుంది. అందుకని ఇనుము రక్తంగా మారే ప్రక్రియ వేగవంతం కావాలంటే పాలకూరని ఎక్కువ పీచు కలిగిన బీర, పొట్ల, సొర, బూడిద గుమ్మడి, అల్లం, ముల్లంగి లాంటి ద్రవ్యాలతో యుక్తిగా, రుచిగా వంటలు చేసుకుని తినటంశ్రేయస్కరం. ఉడికించకుండా టమాటా రసాన్ని కలుపుకుంటే ‘సి’విటమిన్ దండిగా అందుతుంది.
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
Updated Date - Dec 22 , 2024 | 10:57 AM