China: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యాం!
ABN, Publish Date - Dec 27 , 2024 | 05:36 AM
చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్తు డ్యామ్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. త్రీగోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు పెద్దదైన ఈ డ్యామ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
టిబెట్‌లో భారత సరిహద్దుకు సమీపంలో..
విద్యుదుత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్.. భారత్‌కు ముప్పే!
నీటిని మళ్లిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో నీటిఎద్దడి
యుద్ధం పరిస్థితులు వస్తే డ్యామ్‌ను చైనా ‘వాటర్ బాంబ్’గా వాడే ప్రమాదం?
బీజింగ్, డిసెంబరు 26: చైనా ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్తు డ్యామ్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. త్రీగోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు పెద్దదైన ఈ డ్యామ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. టిబెట్ ప్రాంతంలో భారత సరిహద్దుకు సమీపంలో ఈ డ్యామ్‌ను నిర్మించనుంది. టిబెట్ తూర్పు అంచులో ఉన్న యార్లంగ్ జాంగ్బో నది దిగువ భాగంలో ఈ ఆనకట్టను నిర్మించనున్నట్లు చైనా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 137 బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్‌ఫ్రా ప్రాజెక్టుగా ఈ డ్యామ్ నిలుస్తుందని పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు విద్యుదుత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ అని 2020లో చైనా పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ అంచనా వేసింది. ప్రస్తుతం చైనాలో ఉన్న అతి పెద్దదైన త్రీగోర్జెస్ డ్యామ్ సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్. అంటే కొత్త డ్యామ్ సామర్థ్యం దానికి మూడు రెట్లు అధికం. హిమాలయాల్లో బ్రహ్మపుత్ర నది పెద్ద యూ టర్న్ తీసుకొని అరుణాచల్‌ప్రదేశ్, అసోం గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది.
యూ టర్న్ తీసుకునే ప్రాంతంలోని భారీ లోయ వద్ద డ్యామ్‌ను నిర్మించాలని చైనా నిర్ణయించడం గమనార్హం. 137 బిలియన్ డాలర్ల (చైనా కరెన్సీలో ట్రిలియన్ యువాన్లు) ఖర్చుతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి ఖరీదైన, భారీ ప్రాజెక్టుగా నిలవనుంది. యార్లంగ్ జాంబ్బో నదిపై ప్రాజెక్టు నిర్మించతలపెట్టిన ప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక జలవిద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉన్నవాటిలో ఒకటి అని చైనా పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ అంచనా వేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. జలవిద్యుదుత్పత్తి కోసం బ్రహ్మపుత్ర నదిలోని సగం నీటిని దారి మళ్లించేందుకు 20 కిలోమీటర్ల పొడవైన సొరంగాలను నాలుగు నుంచి ఆరు వరకు తవ్వాలని పేర్కొంది. నమ్‌చా బార్వా కొండల్లో తవ్వే ఈ సొరంగాల ద్వారా సెకనుకు 2 వేల క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తుందని వివరించింది. ఈ ప్రాజెక్టు కేవలం జలవిద్యుత్తు డ్యామ్ మాత్రమే కాదని.. పర్యావరణానికి, చైనా జాతీయ భద్రతకు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, ఇంధనం, అంతర్జాతీయ సహకారానికి సంబంధించిన ప్రాజెక్టు అని చైనా పవర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ గత చైర్మన్ యాన్ జియాంగ్ పేర్కొనడం గమనార్హం.
బ్రహ్మపుత్ర.. యార్లంగ్ జాంగ్బో
టిబెట్‌లో జన్మించిన బ్రహ్మపుత్ర నది (దీన్ని అక్కడ యార్లంగ్ జాంగ్బోగా పిలుస్తారు) భారత్ గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తోంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ఇది వరదాయిని. ఈ నదీ జలాల ప్రవాహ తీరు, పంపిణీ వంటి అంశాలపై సమాచార మార్పిడి కోసం భారత్-చైనా మధ్య ఒప్పందం ఉంది. వానాకాలంలో ఈ నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి. ఇరుదేశాల మధ్య ఒప్పందం ప్రకారం మే 15 నుంచి అక్టోబరు 15 వరకు బ్రహ్మపుత్ర జలాల సంబంధిత విషయాల్ని చైనా.. భారత్‌తో పంచుకోవాల్సి ఉంది. వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు నదిలో ప్రవాహ స్థితిగతులను దిగువనున్న దేశాలకు తెలియజేయాలి. కానీ, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని సరిగా ఇవ్వడంలేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరి సారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంకా కొత్త ఒప్పందం జరగలేదు. ఈ తరుణంలో ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవడం కలవరపెడుతోంది.
చైనా ప్రతిపాదిత ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్‌కు పక్కలో బల్లెంలా మారే ప్రమాదముంది. బ్రహ్మపుత్ర జలాలపై చైనా నియంత్రణ పెరిగిపోతుంది. ఎండాకాలంలో నీటిని మళ్లించేందుకు చైనాకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో అసోం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరద ఉంటుంది. ఒకేసారి పెద్దమొత్తంలో నీటిని విడుదల చేస్తే.. దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ఈ ప్రాజెక్టు భారత్-చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందువల్ల రక్షణ పరంగానూ భారత్‌కు సమస్యలు పొంచి ఉన్నాయి. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే.. ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి.. చైనా ‘వాటర్ బాంబ్’గా ఉపయోగించే ప్రమాదం కూడా ఉంటుంది. అంత ఎత్తు నుంచి నీటిని విడుదల చేస్తే అల్లకల్లోలమే. అసోం, అరుణాచల్ వంటి రాష్ట్రాలు పూర్తిగా జలసమాధి అవయ్యే ప్రమాదం ఉంటుంది. కాగా, ఇరుదేశాల మధ్య ప్రవహించే నదులు సహా పలు అంశాలపై సీమాంతర సహకారం, పరస్పర సమాచార మార్పిడి చేసుకోవాలని ఈ నెల 18న జరిగిన భారత్-చైనా ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో నిర్ణయించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. టిబెట్ ప్రాంతం భూకంప జోన్‌లో ఉందని, అక్కడ తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయని.. ఇలాంటి చోట భారీ డ్యామ్ కట్టడం ఆందోళనకరమని పేర్కొంది.
Updated Date - Dec 27 , 2024 | 05:36 AM