ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రంప్‌ తొలిదెబ్బ.. భారతీయులపైనే!

ABN, Publish Date - Nov 10 , 2024 | 03:05 AM

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌.. గద్దెనెక్కిన తొలిరోజే భారతీయులకు షాక్‌ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

  • పౌరసత్వ మంజూరుపై కఠిన ఆంక్షలు

  • గద్దెనెక్కిన తొలిరోజే ఉత్తర్వులిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ప్రకటన

  • లక్షల మంది భారతీయులు, వారి సంతానంపై తీవ్ర ప్రభావం

  • కోర్టుల్లో సవాల్‌ చేసే అవకాశం

వాషింగ్టన్‌, నవంబరు 9: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌.. గద్దెనెక్కిన తొలిరోజే భారతీయులకు షాక్‌ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. వలసలను నిరోధిస్తూ.. సహజ పౌరసత్వాల మంజూరును నియంత్రిస్తామని, అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చే కార్యనిర్వాహక ఉత్తర్వు ఇదేనని ట్రంప్‌, కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఇదే జరిగితే పౌరసత్వం కోసం అమెరికాలోనే ఉండి ఎదురుచూస్తున్న లక్షలాది మంది భారతీయులు, వారి సంతానం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం ఖాయం. ఈ నేపథ్యంలో ట్రంప్‌ జారీచేసే కార్యనిర్వాహక ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానాల్లో సవాల్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్రంప్‌ ప్రచార వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్‌ ప్రకారం.. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తొలి రోజే... వలసలను నివారిస్తూ ఆయన కార్యనిర్వాహక ఆదేశాలు జారీచేస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికన్‌ పౌరులై ఉండాలని.. లేదా చట్టబద్ధ శాశ్వత నివాసులై (పర్మినెంట్‌ రెసిడెన్స్‌-పీఆర్‌) ఉండాలని.. అప్పుడే వారి పిల్లలు ఆటోమేటిగ్గా అమెరికన్‌ పౌరులవుతారని.. లేదంటే వారిని స్వదేశాలకు పంపించివేయాలని ఫెడరల్‌ ఏజెన్సీలకు ఉత్తర్వులు ఇస్తారు. అంటే.. భవిష్యత్‌లో అమెరికా పౌరులు కాని.. శాశ్వత నివాసులు కాని దంపతులకు అక్కడ పుట్టిన పిల్లలు సహజ ప్రక్రియ ద్వారా వారు ఆటోమేటిక్‌ పౌరులవడానికి అర్హులు కారు. ట్రంప్‌ తన ప్రతి ప్రచార సభలో కూడా.. అమెరికన్‌ చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్‌ (అక్రమ వలసదారులు స్వదేశాలకు అప్పగింత) కార్యక్రమాన్ని అధ్యక్షుడిగా మొదటి రోజే ప్రారంభిస్తానని ప్రకటించారు. అధికారిక గణాంకాలు లేనప్పటికీ.. 2023 మొదటి త్రైమాసికం నాటికి ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు (అమెరికా పౌరసత్వం) కోసం ఎదురుచూస్తున్న భారతీయుల సంఖ్య పది లక్షలు దాటిందని ఒక అంచనా. గ్రీన్‌కార్డు కోసం వీరి వెయిటింగ్‌ కాలపరిమితి సగటున 50 ఏళ్లకుపైనే ఉంటుంది.


దీనిప్రకారం అమెరికాలో చదువుకునేందుకు లేదా ఉద్యోగం చేసుకోవడానికి వెళ్లిన 5లక్షల మందికిపైగా యువ వలసదారులు.. పౌరసత్వం రాకముందే మరణించే అవకాశముంది. అలాగే దరిదాపుగా రెండున్నర లక్షల మంది పిల్లల వయసు 21 ఏళ్లు దాటుతుంది. విద్యార్థి వీసా వంటి ప్రత్యామ్నాయ వీసా గనుక లేకపోతే వారు అక్రమ వలసదారులవుతారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని అమెరికన్‌ న్యాయ నిపుణులు అంటున్నారు. 14వ సవరణను అది ఉల్లంఘిస్తోందని చెబుతున్నారు. ఈ 14వ సవరణలోని ఒకటో సెక్షన్‌ ప్రకారం.. అమెరికాలో పుట్టిన.. సహజ ప్రక్రియ ద్వారా పౌరులైన వారంతా అమెరికన్‌ పౌరులే. వారు నివసిస్తున్న రాష్ట్రానికి చెందినవారే. అమెరికా పౌరుల హక్కులు, రక్షణలను నియంత్రించే ఎలాంటి చట్టాలనూ రాష్ట్రాలు చేయరాదు.. అమలు చేయకూడదు. అయితే 14వ సవరణకు సరైన భాష్యం తామే చెబుతున్నామని ట్రంప్‌ జారీచేయబోతున్న కార్యనిర్వాహక ఆదేశాల ముసాయిదాలో పేర్కొనడం గమనార్హం. 2022 అమెరికా జనాభా లెక్కలను విశ్లేషించిన ‘ప్యూ రీసెర్చ్‌’ సంస్థ.. ‘అమెరికాలో స్ధిరనివాసం ఏర్పరచుకున్న భారతీయ అమెరికన్లు 48 లక్షల మంది.

వీరిలో 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టి పెరిగి సహజ పౌరులుగా మారారు’ అని తెలిపింది. కాగా, ట్రంప్‌ను హత్యచేసేందుకు ఇరాన్‌ పన్నిన కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది. ఫర్హాద్‌ షకేరీ అనే ఆఫ్ఘన్‌ పౌరుడికి ఐఆర్‌జీసీ ఈ బాధ్యతలు అప్పగించిందంటూ ముగ్గురిపై అమెరికా న్యాయ విభాగం ఫెడరల్‌ కోర్టులో అభియోగాలు మోపింది. ఈ కేసులో ఇప్పటికే మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. అధ్యక్ష ఎన్నికలకు ముందే ట్రంప్‌ను హత్య చేయాలని ఐఆర్‌జీసీ ఆదేశించినా షకేరీ కావాలనే ఆలస్యం చేశాడు. ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక ట్రంప్‌ను హత్య చేయడం సులభమని భావించి పథకాన్ని వాయిదా వేసుకున్నాడు.

Updated Date - Nov 10 , 2024 | 03:05 AM