Bangladesh Crisis: రక్షణగా రాఫెల్ యుద్ధ విమానాలు.. నాటకీయ పరిణామాల మధ్య హసీనా భారత్ ఎంట్రీ

ABN, Publish Date - Aug 06 , 2024 | 05:14 PM

శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై పెద్ద ఎత్తున జరిగిన నిరసనలు .. చివరకు మాజీ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశం విడిచి మిలిటరీ జెట్‌లో పారిపోయేలా చేశాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యవహారంలో అచ్చం ఇలాగే జరిగింది.

Bangladesh Crisis: రక్షణగా రాఫెల్ యుద్ధ విమానాలు.. నాటకీయ పరిణామాల మధ్య హసీనా భారత్ ఎంట్రీ

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై పెద్ద ఎత్తున జరిగిన నిరసనలు .. చివరకు మాజీ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశం విడిచి మిలిటరీ జెట్‌లో పారిపోయేలా చేశాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యవహారంలో అచ్చం ఇలాగే జరిగింది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో అధ్యక్షుడు పారిపోయే పరిస్థితులు వస్తే.. బంగ్లాదేశ్‌లో మాత్రం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం చినికి చినికి గాలివానలా మారి షేక్ హసీనా పదవికే ఎసరు తెచ్చాయి. షేక్ హసీనాను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు డెడ్‌లైన్ విధించడంతో.. ఆ డెడ్‌లైన్ గడువు తీరేలోపే సోమవారం ఉదయమే హసీనా రాజీనామా సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి రాఫెల్ యుద్ధ విమానాల రక్షణ నడుమ ఢిల్లీకి చేరుకున్నారు. అయితే సోమవారం ఉదయం నుంచి ఆమె భారత్‌కి చేరుకునే వరకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.


అవేంటంటే... భారత్ వైపు ఆమె విమానం రావడాన్ని గుర్తించిన భారత వైమానిక దళం, అనేక భద్రతల నడుమ ఆమెను ఢిల్లీకి తీసుకొచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తుండగా.. భారత్ - బంగ్లా సరిహద్దు బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి ఆకస్మిక పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ తెలిపింది. హసీనా పయనమౌతున్నవేళ భారత వైమానిక దళం రాడార్లు, బంగ్లాదేశ్ గగనతలాన్ని పర్యవేక్షించాయి. సోమవారం మధ్యాహ్నం ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి భారత భూభాగం వైపు వస్తున్నట్లు వైమానిక దళం గుర్తించింది. అందులో ఉన్నవారెవరో తెలియడంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ని భారత భూభాగంలోకి అనుమతించింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆ ఎయిర్ క్రాఫ్ట్‌కు పశ్చిమ బెంగాల్‌లోని హషిమరా వైమానిక స్థావరానికి చెందిన రెండు రఫేల్ యుద్ధ విమానాలు భద్రత కల్పించాయి.


బిహార్, జార్ఖండ్ మీదుగా వెళ్తున్న సమయంలో రక్షణగా వెంట వచ్చాయి. ఎయిర్‌క్రాఫ్ట్ కదలికలపై అధికారులు ఎప్పటికప్పుడూ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌధరీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రతి కదలికను క్షుణ్నంగా గమనించారు. తరువాత భారత ఆర్మీ, వాయుసేన చీఫ్‌లు, ఉన్నతాధికారులు బంగ్లాదేశ్ పరిణామాలపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అలా భద్రత నడుమ షేక్ హసీనా భారత్‌కి క్షేమంగా చేరుకున్నారు. భారత్‌లోకి వచ్చాక ఆమెను పలువురు ఉన్నతాధికారులు కలిశారు.


యూకే ప్రయాణంపై సందిగ్ధత..

భారత్‌కి వచ్చిన కొన్ని గంటల్లోనే షేక్ హసీనా యూకేకి బయల్దేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆమె మరి కొంతకాలం భారత్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హసీనాకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అయితే షేక్‌ హసీనా రాజకీయ శరణార్థిగా యూకేలో ఆశ్రయం కోరారని అయితే.. ఆమెకు బ్రిటన్ నుంచి ఇంకా అనుమతి లభించలేదని తెలుస్తోంది. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్(UK) అనుమతులు వచ్చే వరకు ఆమె భారత్‌లోనే ఉండనున్నారు.

For Latest News and National News click here

Updated Date - Aug 06 , 2024 | 05:14 PM

Advertising
Advertising
<