గర్జించలేదు రష్యా..
ABN, Publish Date - Oct 21 , 2024 | 04:07 AM
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై దాదాపు 30 నెలలు గడుస్తోంది! భౌగోళికంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశం (1,71,25,191 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 16 దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది).. 11.5 లక్షల సైనిక బలం, అణ్వాయుధాలు ఉన్న దేశం..
ఉక్రెయిన్‌తో యుద్ధంలో లక్షలాది సైనికులను కోల్పోయిన పుతిన్
యుద్ధం మొదలై 31 నెలలు దాటినా.. లొంగని ఉక్రెయిన్
నాటో దేశాల అండ, టెక్నాలజీ సాయంతో రష్యాపై పోరు
రష్యా భూభాగాన్ని సైతం ఆక్రమించుకున్న జెలెన్‌స్కీ సైన్యం
నల్లసముద్రంలో పుతిన్ మోహరించిన యుద్ధనౌకల ధ్వంసం
బైబిల్ కథల్లో డేవిడ్ అండ్ గోలియత్ కథ చాలా మందికి తెలిసే ఉంటుంది! అత్యంత శక్తిమంతుడైన గోలియత్‌ను బాలుడైన డేవిడ్.. మట్టికరిపిస్తాడు! గోలియత్‌ను కొట్టడానికి డేవిడ్ దగ్గర పెద్దగా శస్త్రాస్త్రాలేమీ ఉండవు. కేవలం తన దగ్గరున్న ఒడిసెల(స్లింగ్)తో కొట్టి విజయం సాధిస్తాడు! అది కథ కావచ్చు. కానీ, ఇప్పుడు అలాంటిదే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధరూపంలో మన కళ్ల ముందు జరుగుతోంది. అత్యంత బలమైన సైనిక శక్తుల్లో ఒకటైన రష్యాను.. చిరుదేశమైన ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది! రెండున్నరేళ్లకు పైబడి సాగుతున్న ఈ యుద్ధంలో.. రష్యా లక్షలాది మంది సైనికులను కోల్పోయింది! అంతేకాదు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి తన భూభాగాన్ని సైతం కోల్పోయింది.
- సెంట్రల్ డెస్క్
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై దాదాపు 30 నెలలు గడుస్తోంది! భౌగోళికంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశం (1,71,25,191 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 16 దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది).. 11.5 లక్షల సైనిక బలం, అణ్వాయుధాలు ఉన్న దేశం.. వచ్చి మీదపడిపోతే ఉక్రెయిన్‌లాంటి చిట్టి దేశం ఎన్నాళ్లు పోరాడగలదని మొదట్లో చాలా మంది భావించారు! కానీ.. అలా అనుకున్నవారందరి అంచనాలూ తారుమారయ్యాయి! తనపై ముప్పేట దాడికి దిగిన అంత పెద్ద దేశాన్నీ ఉక్రెయిన్ ముప్పతిప్పలు పెట్టి మూడు సముద్రాల నీళ్లు తాగిస్తోంది. నాటో దేశాల సహకారంతో దెబ్బతీస్తోంది! అత్యుత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో ఈ యుద్ధాన్ని మొదలుపెట్టిన రష్యా.. తానే ఎక్కువ నష్టాలను చవిచూస్తోంది. యుద్ధం మొదలైన తొలినాళ్లలో ఉన్న జోరు ఇప్పుడు లేదు. మూణ్నాలుగు రోజుల క్రితం ఉక్రెయిన్‌కు చెందిన 110 డ్రోన్లను నేలకూల్చినట్టు రష్యా ప్రకటించిందిగానీ.. తనకున్న పరిమిత వనరులతో వ్యూహాత్మకంగా పోరాడుతున్న జెలెన్‌స్కీ సైన్యందే పై చేయిగా ఉందనడంలో సందేహం లేదు.
2022 ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటిదాకా.. రష్యా సైనికులు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా 4 లక్షల మంది తీవ్రంగా గాయపడినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. అంటే చనిపోయినవారు, గాయపడ్డవారు అంతా కలిపి 6 లక్షల మందికిపైగా సైన్యాన్ని రష్యా కోల్పోయినట్టు లెక్క! ఈ నేపథ్యంలోనే.. పుతిన్ ఈ ఏడాది మేలో రక్షణ మంత్రి సెర్గి షోయిగును పదవి నుంచి తొలగించారు! కోల్పోయిన సైనికుల స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు.. రష్యా ఆర్మీ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది.
స్వచ్ఛందంగా సైన్యంలో చేరాలంటూ ప్రజలకు పిలుపునిస్తోంది. దేశమంతటా ఎక్కడపడితే అక్కడ.. సైనిక నియామకాలకు సంబంధించి ‘సమాచార కేంద్రాల’ను ఏర్పాటు చేస్తోంది. రష్యాలో సైన్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరాలనుకునేవారికి ఏడాదికి 30 లక్షల రూబుళ్ల నుంచి 53 లక్షల రూబుళ్ల (రూ.27 లక్షల నుంచి రూ.48 లక్షల) దాకా వన్‌టైమ్ చెల్లింపు చేస్తామని.. నెలవారీ జీతంగా ఇచ్చే 7 లక్షల రూబుళ్లకు ఇది అదనమని ప్రకటనలు చేస్తోంది.
అంతకుముందు నెలవారీ వేతనం సగటున 63,060 రూబుళ్లుగా ఉండేది. అంతేనా.. ‘రిఫర్ ఏ ఫ్రెండ్’ ఆఫర్ కూడా నడుస్తోందక్కడ. అంటే, ఇప్పటికే సైన్యంలో చేరినవారు మరొకరిని చేరిస్తే.. వారికి బోన్‌సగా మరికొంత సొమ్ము ముట్టజెప్తున్నారు. మెట్రో స్టేషన్ల ముందు మొబైల్ రిక్రూట్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ యువతను సైన్యంలోకి తీసుకుంటున్నారు. అలాగే.. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నేరగాళ్లను, అండర్ ట్రయల్ ఖైదీలను సైతం సైన్యంలో చేర్చుకోవడానికి వీలుగా రష్యా చట్టసభల సభ్యులు ఒక బిల్లును ఆమోదించారు. యుద్ధంలో సాహసోపేతంగా పోరాడి పతకాలు సంపాదిస్తే.. వారిపైనున్న నేర రికార్డులను తొలగిస్తామని హామీ ఇచ్చారు.
భారతీయులనూ మోసం చేసి..
సైనికుల కొరత నేపథ్యంలో.. విదేశీ యువకులను సైతం సైన్యంలో చేర్చుకోవడానికి రష్యా వెనుకాడట్లేదు. దీంతో కొందరు ఏజెంట్లు... ‘రష్యాలో హెల్పర్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం’ అంటూ మోసపూరిత ప్రకటనలతో పలువురు భారతీయులను కూడా అక్కడికి తరలించిన సంగతి తెలిసిందే! అలా వెళ్లినవారిలో మన తెలుగువారు కూడా ఉన్నారు! తొలుతవారికి తుపాకులు కాల్చడంలో శిక్షణ ఇచ్చి.. రోజుకు 15 గంటలు పనిచేయించుకునేవారు. వారు తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి గోడు వినిపిస్తే.. ప్రధాని మోదీ రష్యాకు వెళ్లినప్పుడు వారిని తిరిగి భారత్‌కు పంపించాలని కోరారు. దీంతో అక్కడి సైన్యం తొలి విడతగా 45 మంది భారతీయులను యుద్ధభూమి నుంచి వెనక్కి రప్పించి, భారత్‌కు పంపింది. మరో 40-50 మంది దాకా మనవాళ్లు ఇంకా అక్కడే ఉన్నారు.
భూభాగాన్నీ కోల్పోయి..
యుద్ధం మొదలైన తొలినాళ్లలో తన భూభాగంలోకి వచ్చిన రష్యన్ సేనలను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసిన ఉక్రెయిన్.. ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి రష్యా భూభాగాలను ఆక్రమించడం ప్రారంభించింది. ‘ఆపరేషన్ వైట్ ట్రయాంగిల్’ పేరుతో.. ఇప్పటిదాకా 1500 చదరపు కిలోమీటర్లకు పైగా రష్యన్ భూభాగాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. ఇంత భారీగా రష్యా భూభాగం విదేశీ ఆక్రమణకు గురికావడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగానే.. ఉక్రెయిన్ చేతికి నాటో దేశాల నుంచి ఎఫ్16 యుద్ధవిమానాలు అందడం మొదలైంది. నిజానికి.. ఉక్రెయిన్‌కు ఎఫ్-16లు ఇస్తే అది ప్రపంచయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అమెరికా, యూరప్ దేశాలు తొలుత కొంత సంశయించాయి. కానీ.. రష్యా ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆ అవకాశం లేదని గ్రహించి ఇప్పుడు ఇవ్వడం మొదలుపెట్టాయి.
రష్యావాటిని ఎంతవరకూ ఎదుర్కోగలదు? వాటికెలా ప్రతిస్పందిస్తుంది? అనే విషయాలను గమనించాక, తాను కూడా ఉక్రెయిన్‌కు ఎఫ్-16లు ఇవ్వాలని అమెరికా భావిస్తున్నట్టు సమాచారం. అమెరికా దగ్గర వాడని పాత ఎఫ్-16లు 700 నుంచి 900 దాకా ఉన్నాయి. వాటితోపాటు.. ఏఐతో పనిచేసే ఎఫ్-16లను కూడా ఉక్రెయిన్‌లో దించే ఆలోచనలో అమెరికా ఉన్నట్టు సమాచారం. ఇవి రిమోట్‌తో పనిచేస్తాయి. వాటిని ప్రత్యక్ష యుద్ధంలో పరీక్షించాలని అమెరికా భావిస్తోందని.. అందుకే ఉక్రెయిన్‌కు ఇచ్చే చాన్స్ ఉందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అవి రంగంలోకి దిగితే.. కథే మారిపోతుంది!!
రష్యా నష్టాలపై ఉక్రెయిన్ లెక్కలివీ..
యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఇప్పటిదాకా రష్యా కోల్పోయిన సైనికులు, యుద్ధ ట్యాంకులు, యుద్ధనౌకలు, విమానాల సంఖ్యకు సంబంధించి 2024 అక్టోబరు 20న ‘జనరల్ స్టాఫ్ ఆఫ్ ఉక్రెయిన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్’ ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం..
6,78,520 రష్యా కోల్పోయిన సైనికులు
9,047 యుద్ధట్యాంకులు
18,111 ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్
26,987 వెహికల్స్ అండ్ ఫ్యూయెల్ ట్యాంక్స్
19,565 ఆర్టిలరీ సిస్టమ్స్
1,232 మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్
978 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్
369 విమానాలు
329 హెలికాప్టర్లు
17,287 డ్రోన్లు
28 యుద్ధనౌకలు, ఓడలు
1 జలాంతర్గామి
బయటపడలేక.. లోపల ఉండలేక..
బాస్పొరస్ జలసంధిని టర్కీ మూసేయడంతో నల్లసముద్రంలో ఇరుక్కుపోయిన రష్యా నౌకలు
రష్యా ‘బ్లాక్ సీ ఫ్లీట్’ పేరొందిన నౌకాదళంలో.. ఫ్రిగేట్లు, కార్వెట్లు, క్షిపణి ఓడలు, మైన్‌స్వీపర్లు ఇలా అన్నీ కలిపి 50 దాకా సర్ఫేస్ వార్‌షిప్పులు ఉంటాయి. వాటితోపాటు.. ల్యాండింగ్ షిప్స్, ఆయిలర్స్, టగ్స్, సర్వే, ఇంటెలిజెన్స్, ఆక్సిలరీ నౌకలు, ఆరు జలాంతర్గాములు ఉంటాయి. వాటన్నింటిలో కలిపి 25 వేల మంది దాకా సిబ్బంది పని చేస్తుంటారు. అంతటి అమేయశక్తినీ ఉక్రెయిన్ తన డ్రోన్, క్షిపణి దాడులతో వెనక్కి తగ్గేలా చేయగలిగింది. రష్యాకు చెందిన పలు పెద్ద నౌకలను ధ్వంసం చేసేసింది.
మరి అంత నష్టం జరగకముందే రష్యా తన నౌకలను అక్కడి నుంచి వేరొకచోటకు ఎందుకు తరలించలేకపోయిందంటే.. దానికి కారణం టర్కీ. ప్రపంచపటాన్ని ఒకసారి పరిశీలిస్తే.. రష్యా, ఉక్రెయిన్, టర్కీ, బల్గేరియా, రోమేనియా, జార్జియా, మాల్డోవా దేశాల నడుమ ఒక బెలూన్ ఆకారంలో ‘నల్ల సముద్రం’ కనిపిస్తుంది. రష్యా నౌకలు మధ్యధరా సముద్రం గుండి ఇతర దేశాలతో వాణిజ్యసంబంధాలు నెరపాలంటే.. టర్కీ అధీనంలో ఉన్న బాస్పొరస్, డార్డనెల్లెస్ జల సంధుల గుండానే జరపాల్సి ఉంటుంది. అసలు నల్ల సముద్రం నుంచి రష్యా నౌకలు బయటకు రావాలంటే ఆ జలసంధి గుండానే రావాలి. అంతటి కీలక జలసంధులను.. జెలెన్ స్కీ విజ్ఞప్తి మేరకు టర్కీ మూసేయడంతో రష్యాకు దెబ్బ పడింది.
నిప్పులు కక్కే డ్రాగన్ డ్రోన్లు
తమ దేశం మీద దండయాత్ర చేసిన రష్యాను నిలువరించడానికి ఉక్రెయిన్ ప్రధానంగా వాడుతున్నది.. డ్రోన్ టెక్నాలజీనే! యుద్ధం తొలి దశల్లో రష్యన్ యుద్ధట్యాంకులను పేల్చేయడానికి డ్రోన్లనే వాడింది. ఆ తర్వాత కూడా.. రకరకాల డ్రోన్లను వినియోగించింది. తాజాగా.. ‘డ్రాగన్ డ్రోన్’లతో రష్యాకు దడ పుట్టిస్తోంది. చైనీస్ పురాణాల్లో ఉండే డ్రాగన్‌ల లాగా.. నిప్పులు కక్కే డ్రోన్లు ఇవి. యుద్ధరంగంలో శత్రువుల మీద, శత్రు భూభాగంలో.. 2,200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే థెర్మైట్‌ను (అల్యూమినియం పొడి, ఐరన్ ఆక్సైడ్‌ల మిశ్రమం) స్ర్పే చేస్తూ ముందుకు సాగిపోతాయి! ఆ డ్రోన్లు నిప్పులు కక్కిన దారిలో జీవం అంటూ ఏదీ మిగలదు! కన్నుమూసి తెరిచేలోపు అక్కడంతా కరిగిపోతుంది!! రైల్వే ట్రాకుల వెల్డింగ్ కోసం జర్మన్ కెమిస్ట్ ఒకరు 1890ల్లో ఈ థెర్మైట్‌ను అభివృద్ధి చేశారు. కానీ, జర్మనీ దీన్ని మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌పై దాడికి ఉపయోగించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ, దాని మిత్ర దేశాలు వినియోగించాయి. ఇప్పుడు అదే థెర్మైట్‌ను ఉక్రెయిన్. డ్రోన్ల ద్వారా వినియోగిస్తోంది.
Updated Date - Oct 21 , 2024 | 04:11 AM