Share News

హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా మృతి

ABN , Publish Date - Sep 29 , 2024 | 03:45 AM

ఇరాన్‌ మద్దతుతో.. లెబనాన్‌ భూభాగం పైనుంచి ఇజ్రాయెల్‌పై భీకర క్షిపణి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు పెద్ద దెబ్బ తగిలింది.

హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా మృతి

  • ఇరాన్‌ జనరల్‌ అబ్బాస్‌ కూడా..

  • బీరుట్‌లో ఓ బంకర్‌లో సమావేశం.. గుర్తించి దాడులు చేసిన ఇజ్రాయెల్‌

  • నస్రల్లా కూతురు జైనబ్‌ మృతిచెందినట్లు ఐడీఎఫ్‌ ప్రకటన

  • 32 ఏళ్లుగా హిజ్బుల్లా చీఫ్‌గా నస్రల్లా

  • బీరుట్‌పై కొనసాగుతున్న దాడులు..720కి చేరిన మరణాలు

  • రహస్య ప్రదేశానికి ఇరాన్‌ సుప్రీం లీడర్‌

  • అమెరికన్లకు న్యాయం: బైడెన్‌

టెల్‌అవీవ్‌/బీరుట్‌, సెప్టెంబరు 28: ఇరాన్‌ మద్దతుతో.. లెబనాన్‌ భూభాగం పైనుంచి ఇజ్రాయెల్‌పై భీకర క్షిపణి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు పెద్ద దెబ్బ తగిలింది. శుక్రవారం రాత్రి దక్షిణ బీరుట్‌లోని దహియాపై ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) వైమానిక దళం చేసిన క్షిపణి దాడుల్లో.. హిజ్బుల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా మృతిచెందారు. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ జనరల్‌ అబ్బాస్‌ నిల్ఫోరుషన్‌ కూడా ఈ దాడిలో దుర్మరణంపాలయ్యారు.

వీరిద్దరితోపాటు.. హిజ్బుల్లాకు చెందిన ఒక కమాండర్‌ అలీ కర్కీ, ఇద్దరు డిప్యూటీ కమాండర్లు, నస్రల్లా కుమార్తె జైనబ్‌ నస్రల్లా కూడా మృతిచెందినట్లు ఐడీఎఫ్‌ శనివారం ఉదయం ప్రకటించింది. మధ్యాహ్నానికి హిజ్బుల్లా వర్గాలు కూడా హసన్‌ నస్రల్లా మృతిని ధ్రువీకరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశాయి. ‘‘జెరూసలేం వైపు వెళ్లే క్రమంలో జరుగుతున్న పోరాటంలో నస్రల్లా అమరుడయ్యారు’’ అని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ ప్రకటనలో స్పష్టం చేశాయి. నస్రల్లా ఉనికిని గుర్తించిన ఐడీఎఫ్‌ పక్కా వ్యూహంతో ‘ఆపరేషన్‌ న్యూ ఆర్డర్‌’ పేరుతో భీకర దాడులు జరిపింది.

Untitled-1 copy.jpg

దహియాలోని ఓ ఇంటి కింద ఉన్న బంకర్‌లో నస్రల్లా ఉన్నట్లు గుర్తించి, అంతమొందించింది. ‘‘నస్రల్లా ఇకపై ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురి చేయలేడు’’ అని ప్రకటించింది. పేజర్‌ బాంబులు, వాకీటాకీ పేలుళ్ల తర్వాత.. లెబనాన్‌పై వైమానిక దాడులను ముమ్మరం చేసిన ఇజ్రాయెల్‌.. వ్యూహాత్మకంగా.. ఒక్కొక్కరుగా హిజ్బుల్లా కీలక నేతలను అంతమొందిస్తూ వచ్చింది. బుధవారం హిజ్బుల్లా క్షిపణి విభాగం కమాండర్‌ మహమ్మద్‌ అలీ ఇస్మాయిల్‌ అడ్డు తొలగించింది. గురువారం వైమానిక దళ కమాండర్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ సోరౌర్‌ను హతమార్చింది. శనివారం సాయంత్రం కొనసాగించిన దాడుల్లో హిజ్బుల్లా ఇంటెలిజెన్స్‌ విభాగం సీనియర్‌ నేత హసన్‌ ఖలీల్‌ యాసిన్‌ మృతిచెందినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది.


  • 16 ఏళ్ల ప్రాయంలో ఉద్యమం వైపు..

నస్రల్లా 1960లో బీరుట్‌ శివారులోని బుర్జ్‌ హమ్ముద్‌లో ఓ చిరు కూరగాయల వ్యాపారి ఇంట్లో తొమ్మిది మంది తోబుట్టువుల్లో ఒకరిగా నస్రల్లా జన్మించారు. 16 ఏళ్ల వయసులో షియా పొలిటికల్‌, పారామిలిటరీ గ్రూప్‌ ఉద్యమం ‘అమల్‌’లో చేరారు. అప్పుడే ఆయన పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌(పీఎల్‌వో) నేత అబ్బాస్‌ అల్‌ ముసావి దృష్టిలోపడ్డారు. 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేసి, బీరుట్‌ నుంచి పీఎల్‌వోను తరిమికొట్టింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌ వ్యతిరేక ఉద్యమాల్లో నస్రల్లా కీలకంగా వ్యవహరించారు. 1982లో హిజ్బుల్లా ఏర్పాటులో నస్రల్లాది కీలక పాత్ర. 1992లో అప్పటి హిజ్బుల్లా అధినేత అబ్బాస్‌ అల్‌ ముసావిని ఇజ్రాయెల్‌ దళాలు హతమార్చాయి. దీంతో సంస్థ పగ్గాలను నస్రల్లా అందుకున్నారు. అప్పటికి అతడి వయసు 32 సంవత్సరాలు. 2006లో లెబనాన్‌లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఓడించడంలో ఆయన కీలక ప్రాత పోషించారు. అప్పటి నుంచే ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువుగా మారారు. హిజ్బుల్లా ప్రభావాన్ని దేశ సరిహద్దులు దాటించి.. 2011లో సిరియా అంతర్యుద్ధంలోనూ పాల్గొనేలా చేశారు. కాగా.. 1997లో ఇజ్రాయెల్‌ సైనికులతో జరిగిన పోరాటంలో నస్రల్లా తన పెద్ద కుమారుడు హదీని కోల్పోయారు. తాజాగా బీరుట్‌పై ఇజ్రాయెల్‌ దాడుల్లో కుమార్తె జైనబ్‌ ప్రాణాలను పోగొట్టుకున్నారు.


  • రహస్య ప్రదేశానికి ఖమేనీ

నస్రల్లా మరణం.. ఇజ్రాయెల్‌ సైన్యం దూకుడు నేపథ్యంలో ఇరాన్‌ అప్రమత్తమైంది. నస్రల్లాతోపాటు.. తమ సైన్యానికి చెందిన జనరల్‌ కూడా మరణించడంతో ఇజ్రాయెల్‌పై అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేసింది. అయితే.. అంతకు ముందు ఖమేనీ హిజ్బుల్లా, పశ్చిమాసియాలోని ఇతర మిత్ర పక్షాలతో అత్యవసరంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. నస్రల్లా మరణం నేపథ్యంలో ఖమేనీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘లెబనాన్‌ ప్రజలకు, హిజ్బుల్లాకు అండగా ఉండాలి. దాడులను ఎదుర్కోవడంలో వారికి సహాయం చేయాలి’’ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. నస్రల్లా మృతితో లెబనాన్‌కు తమ బలగాలను పంపి, ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనేందుకు ఇరాన్‌ సిద్ధమవుతోందని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. నస్రల్లా మృతిని హమాస్‌, ఇరాక్‌ కూడా ఖండించాయి. ఇరాక్‌ ఏకంగా మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.


  • దాడులు ఉధృతం

శనివారం మధ్యాహ్నం నుంచి బీరుట్‌, దహియాపై ఐడీఎఫ్‌ దాడులను ఉధృతం చేసింది. అంతకు ముందు ఈ ప్రాంతాలను వదిలి వెళ్లాలంటూ పౌరులకు ఐడీఎఫ్‌ హెచ్చరికలు చేసింది. ‘‘నస్రల్లా మరణంతో మా యుద్ధం ఆగదు’’ అంటూ సందేశాలు పంపింది. కాగా.. గడిచిన వారం రోజుల్లో లెబనాన్‌ పౌరులు సుమారు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్‌ దాడుల్లో 720 మంది మృతిచెందారు.

  • వారసుడు హాషిమ్‌ కర్కోటకుడే?

నస్రల్లా మరణంతో అతని వారసుడిపై చర్చ మొదలైంది. ఆయన తర్వాత హిజ్బుల్లాలో నంబర్‌-2గా ఉండే అవకాశం ఉన్న నేతలందరినీ ఐడీఎఫ్‌ ఈ వారం రోజుల్లో మట్టుబెట్టింది. దీంతో హిజ్బుల్లా విదేశాంగ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నస్రల్లా తమ్ముడి వరస అయ్యే హాషిమ్‌ సఫీద్దీన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇరాన్‌ కూడా అధికారికంగా ఆమెదం తెలిపితే.. వెంటనే హిజ్బుల్లా తమ కొత్త నాయకుడిగా హాషిమ్‌ పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే.. నస్రల్లా కంటే హాషిమ్‌ కర్కోటకుడని, ఆయనకు ర్యాడికల్‌ భావజాలం మరీ ఎక్కువని పశ్చిమాసియా వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.


  • 7 నిమిషాలు.. 80 బాంబులు.. నస్రల్లా ఖతం!

గడిచిన వారం రోజులుగా ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ మొస్సాద్‌.. నస్రల్లా జాడ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మొస్సాద్‌ నుంచి ఐడీఎ్‌ఫకు కీలక సమాచారం అందింది. ‘‘దహియాలో ఇరాన్‌ ప్రతినిధితో నస్రల్లా, ఇతర కీలక నేతలు భేటీ కానున్నారు’’ అనేది అందులోని సారాంశం. అంతే.. ఆగమేఘాల మీద ఇజ్రాయెల్‌ వార్‌రూమ్‌, ఐడీఎఫ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఉరుకులు-పరుగులు మొదలయ్యాయి. త్రివిధ దళాధిపతులు అక్కడకు చేరుకున్నారు. తమకు వచ్చిన సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకున్నాక.. వైమానిక దళం చీఫ్‌-- మేజర్‌ జనరల్‌ టోమర్‌ బార్‌ నేతృత్వంలో ‘ఆపరేషన్‌ న్యూ ఆర్డర్‌’ ప్రారంభమైంది.

త్రివిధ దళాధిపతులు ఉత్కంఠగా కంప్యూటర్ల ముందు కూర్చుని, తమ వైమానిక దళాలు బీరుట్‌వైపు వెళ్లడాన్ని గమనించారు. అర్ధరాత్రి దాటాక.. సరిగ్గా నస్రల్లా ఉన్న బంకర్‌ వద్దకు వైమానిక దళం చేరుకోగానే.. మేజర్‌ జనరల్‌ టోమర్‌ బార్‌ ఆదేశాలు జారీ చేశారు. అప్పటిదాకా టార్గెట్‌ను లాక్‌ చేసి.. ఆదేశాల కోసం ఎదురుచూసిన ఫైటర్‌ పైలట్లు.. 7 నిమిషాల వ్యవధిలో ఒక్కోటి టన్ను బరువుండే 80 బంకర్‌ బ్లాస్టర్‌(జీబీయూ-28) బాంబులను జారవిడిచారు. అంతే.. ఆ బంకర్‌ పైభాగంలో ఉన్న భవనం కుప్పకూలిపోయింది. మంటలు చెలరేగాయి. 80 బాంబులతో చేసిన దాడిలో.. ఎవరూ బతికే అవకాశాలుండవని నిర్ధారించుకున్న వెంటనే ఇజ్రాయెల్‌ విమానాలు వెనుదిరిగాయి. తర్వాత నస్రల్లా మరణంపై ప్రకటన వెలువడింది.

Updated Date - Sep 29 , 2024 | 03:56 AM